'ప్రశ్న రావణ్'కు 14 రోజుల రిమాండ్

by Muthe.Rajitha |

తెలంగాణ యూట్యూబర్ ప్రశ్న రావణ్ కు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

ప్రశ్న రావణ్కు 14 రోజుల రిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణకు చెందిన ప్రముఖ యూట్యూబర్, సోషల్ మీడియా యాక్టివిస్ట్ ‘ప్రశ్న రావణ్’కు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ నెల 18వ తేదీ వరకు ఆయనకు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. UAPA సహా పలు చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడినట్లు ఆయనపై తీవ్రమైన ఆరోపణలు రావడంతో ఆంధ్రప్రదేశ్‌లోని గన్నవరం పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల ఆధారంగానే పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టారు.

గన్నవరంలో కేసులు.. నెల్లూరు జైలుకు తరలింపు

ప్రశ్న రావణ్ సోషల్ మీడియా వేదికగా చేసిన కొన్ని వ్యాఖ్యలు, వీడియోలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్రోహ చర్యలను ప్రేరేపించేలా ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో గన్నవరం పోలీసులు రంగంలోకి దిగి ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మొదట 4 కేసుల్లో బెయిల్ పొందగా.. ఐదవ కేసులో ఆయనను మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా, కోర్టు 14 రోజుల రిమాండ్ ఖరారు చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా న్యాయస్థానం ఆదేశాల మేరకు రావణ్‌ను వెంటనే నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ కేసులకు సంబంధించి పోలీసులు మరింత సమాచారం సేకరిస్తున్నారు. అయితే రావణ్ అరెస్టును ఇరు తెలుగు రాష్ట్రాల పౌరసంఘాల నేతలు, ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు.

Next Story