ఆలేరు మున్సిపాలిటీలో ‘అటకెక్కిన అభివృద్ధి’: నిధులున్నా ముందుకు సాగని పనులు!

by Malleboina Mahesh |

ఆలేరు మున్సిపాలిటీలో ఏఈ, టీపీఓ వంటి కీలక పోస్టులు ఖాళీగా ఉండటంతో రూ. 30 కోట్ల నిధులు ఉన్నా అభివృద్ధి పనులు నిలిచిపోయాయి.

ఆలేరు మున్సిపాలిటీలో ‘అటకెక్కిన అభివృద్ధి’: నిధులున్నా ముందుకు సాగని పనులు!
X

దిశ, ఆలేరు : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీలో కీలకమైన అధికారుల పోస్టులు ఖాళీగా ఉండటంతో పట్టణ అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ), టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ (టీపీఓ) వంటి ప్రధాన పోస్టులు గత ఆరున్నర ఏళ్లుగా భర్తీకి నోచుకోలేదు. భువనగిరి మున్సిపల్ ఏఈని ఇక్కడ ఇన్చార్జిగా నియమించినప్పటికీ, ఆయన నెలలో ఒక్క రోజు కూడా ఆలేరు మున్సిపాలిటీకి రాకపోవడం గమనార్హం. దీనివల్ల మంచినీటి సరఫరా, మురుగు కాలువల నిర్మాణం, రోడ్ల మరమ్మతులు వంటి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అలాగే జనగామ టీపీఓ వారానికి ఒకటి రెండు రోజులే అందుబాటులో ఉండడం తో టౌన్ ప్లానింగ్ సేవల కోసం ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.

ఖజానాలో రూ.30 కోట్ల నిధులు!

ఆలేరు మున్సిపాలిటీ అభివృద్ధి కోసం టీఎఫ్ఐడీసీ, 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా సుమారు రూ.30 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో మున్సిపల్ కార్యాలయ భవనం, 12 వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టుల నిర్మాణం చేపట్టాలని గత, ప్రస్తుత పాలకవర్గాలు తీర్మానాలు కూడా చేశాయి. అయితే, సాంకేతికంగా పనుల అంచనా విలువ (ఎస్టిమేషన్), అనుమతులు, టెండర్ల ప్రక్రియ నిర్వహించేందుకు రెగ్యులర్ ఏఈ లేకపోవడంతో ఈ నిధులు ఖజానాలోనే మూలుగుతున్నాయి. కొత్తగా ఎన్నికైన చైర్మన్, కౌన్సిలర్లు వార్డుల్లో పర్యటిస్తూ సమస్యలు పరిష్కరిస్తామని హామీలు ఇస్తున్నప్పటికీ, టెక్నికల్ సిబ్బంది లేక ఆ పనులు పూర్తి చేయలేక ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి దాపురించింది. ‘దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించని’ చందంగా ఆలేరు మున్సిపాలిటీ పరిస్థితి తయారైందని స్థానికులు మండిపడుతున్నారు.

కీలక పోస్టుల భర్తీ ఏదీ?

మేజర్ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారిన నాటి నుంచి ఆలేరులో ఏఈ, టీపీఓ, శానిటరీ ఇన్‌స్పెక్టర్, వర్క్ ఇన్‌స్పెక్టర్, సీనియర్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఇన్చార్జి అధికారులు కార్యాలయంలో నిత్యం అందుబాటులో ఉండకపోవడం వల్ల పట్టణంలో అభివృద్ధి కుంటు పడడమే కాకుండా, ప్రజల కనీస అవసరాలు కూడా తీరడం లేదు. మౌలిక వసతుల కల్పనలో మున్సిపాలిటీ విఫలమవడంతో వర్షాకాలం వస్తే మురుగు నీరు రోడ్లపైకి చేరుతోందని, వీధి దీపాలు, మంచినీటి సరఫరా వంటి పనులు కూడా పర్యవేక్షించేవారు లేక అస్తవ్యస్తంగా మారుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.

ప్రజల అసంతృప్తి..

నిధులు అందుబాటులో ఉన్నా అధికారులు లేకపోవడంతో అభివృద్ధి జరగకపోవడంపై పట్టణ ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇన్చార్జిల పాలనలో మున్సిపాలిటీ కి రావాల్సిన అనుమతులు రాక, కొత్త ఇళ్ల నిర్మాణాలకు ప్లానింగ్ అనుమతులు లభించక జనం ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా జోక్యం చేసుకొని, ఖాళీగా ఉన్న పోస్టులను రెగ్యులర్ సిబ్బందితో భర్తీ చేయాలని, ఆలేరు మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Next Story