ఆయకట్టు చివరి భూములకు నీరందక ఇక్కట్లు

by Jakkula.Mamatha |

రైతులకు సాగునీరు అందించే మేజర్ మైనర్ కాలువలు కబ్జాకు గురవుతున్నాయి.

ఆయకట్టు చివరి భూములకు నీరందక ఇక్కట్లు
X

దిశ, కొణిజర్ల: రైతులకు సాగునీరు అందించే మేజర్ మైనర్ కాలువలు కబ్జాకు గురవుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతమంది రైతులు కాలువలను ఆక్రమించుకోవడంతో సాగు నీరందక రైతుల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. మేజర్ కాలువలు కబ్జాకు గురి కాగా పంట కాలువలు ఆనవాళ్లు లేకుండా పోతున్నాయి. ఫలితంగా చివరి ఆయకట్టు దారులకు సాగు నీరందక పంటలు ఎండిపోయే దుస్థితి నెలకొంటుంది. ఏ మేజరు పరిధిలో కూడా ఆయకట్టు చివరి భూములకు నీరందే పరిస్థితి లేదు. బోనకల్ బ్రాంచ్ కెనాల్ (బీబీసి) పరిధిలో 6 సాగర్ మెయిన్ కెనాల్ పరిధిలో 11 మేజర్లు ఉన్నాయి. మండలంలో ప్రధానంగా 80 శాతం మంది రైతులకు సాగు నీరందించేది సాగర్ కాలువలే. వేల ఎకరాలకు సాగు నీరందించే మేజర్లు సైతం ఆక్రమణ గురవుతుంటే పట్టించుకునే వారే లేకపోవడం విశేషం. ఇక మైనర్లు పరిస్థితి దారుణం అవి ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి నెలకొంది.

కొంతమంది రైతులు సిమెంట్ పైపులు వేయటంతో కాలువ వెడల్పు లోతు తగ్గి చివరి ఆయకట్టు రైతులకు నీరు అందని పరిస్థితి నెలకొంది. పంట కాలవల పరిస్థితి చెప్పనక్కర్లేదు. కాలువల ఆనవాళ్లే లేకుండా చదును చేసి చక్కగా తమ భూముల్లో కలుపుకుంటున్నారు. కాలువలను ఆక్రమణకు గురికావటంతో చివరి ఆయకట్టు భూములకు నీరు అందక రైతుల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఆక్రమణలపై ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకునే పరిస్థితి లేదు. తమ పరిధిలో ఉన్న సమస్యను పరిష్కరించకుండా తాము ఏమి చేయలేమని తహశీల్దారుకు పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేయమని ఉచిత సలహాలు ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మల్లుపల్లి (సీత రామయ్య బంజర) మేజరు విషయంలో రెండు వర్గాల రైతుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

దీంతో ఇరు వర్గాల రైతులు ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. మేజరుకు సంబంధించిన మ్యాప్ తీసుకొని సంఘటన స్థలానికి వెళ్లి సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించి సామరస్యపూర్వకంగా పరిష్కరించాల్సిన అధికారులు తమకేమి సంబంధం తమకేమీ పట్టనట్లు వ్యవహరించారు. మ్యాప్ లేకుండా సంఘటన స్థలానికి వెళ్లిన ఇరిగేషన్ అధికారులు అటు మూడు అడుగులు ఇటు మూడు అడుగులు అంటూ చెప్పటంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో అధికారుల తీరుపై రైతులు ఆగ్రహం చేశారు. సంబంధిత శాఖ అధికారులు పూర్తి నిర్లక్ష్యం వ్యవహరించడంతో విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి పోలీస్ స్టేషన్ ఎదుట రైతులు ధర్నా చేసే వరకు పరిస్థితి వెళ్ళిందంటే ఇరిగేషన్ అధికారుల పని తీరును అర్థం చేసుకోవచ్చు.

ఖమ్మం వైరా హైవే పక్కన వైరా మేజరు కట్టను ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి పూర్తిగా తవ్వి ఆక్రమించి దర్జాగా ఫినిషింగ్ ఏర్పాటు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిత్యం జిల్లా స్థాయి అధికారులు మంత్రులు ఎమ్మెల్యేలు నిత్యం పర్యటించే రహదారి పక్కనే కాలువ కట్ట ఆక్రమణకు గురైతే సంబంధిత అధికారులకు చీమకుట్టినట్లెన లేకపోవడం విశేషం. నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించి పర్యవేక్షించాల్సిన ఏఈలు వారానికో పది రోజులకో వచ్చి వెళ్తుతుంటారని రైతులు పేర్కొంటున్నారు. సంబంధిత మేజర్ల ఏఈలు క్షేత్రస్థాయిలో కాలువలపై పర్యటిస్తే సమస్యలపై అవగాహన ఉండటంతో సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే అవకాశం కలుగుతుంది. ఏఈలకు అవగాహన లేకపోవడంతో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. కొణిజర్లకు డిఈ స్థాయి అధికారి ఉన్న పెద్దగా ప్రయోజనం ఏమీ లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఉద్యోగం కొణిజర్లలో కార్యాలయం ఖమ్మం నగరంలో ఉండటంతో కార్యాలయానికే పరిమితం అవుతున్నట్లు సమాచారం. పర్యవేక్షణ కొరవడడంతో సమస్యల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే అన్న చందంగా తయారయింది. తమ శాఖకు సంబంధించిన సమస్యలను తాము పరిష్కరించకుండా రెవెన్యూ పోలీస్ శాఖలపైకి నెట్టి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు మేజర్లపై పర్యటించి అక్రమణలు తొలగించి చివరి ఆయకట్టు భూములకు సాగునీరు అదే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

ఆక్రమణలకు రైతులే బాధ్యులు:డీఈ

కాలువల ఆక్రమణ పై డీఈ గౌతమి శిల్పాను వివరణ కోరగా.. కాలువల అక్రమాలకు రైతులే బాధ్యులని స్పష్టం చేశారు. బోర్లు ఉన్న రైతులకు సాగర్ నీళ్లతో అవసరం లేకపోవడంతో కాలువలు నిరుపయోగంగా ఉండటంతో ఆక్రమణలకు గురవుతున్నాయని తెలిపారు. తన దగ్గరకు వచ్చే ప్రతి సమస్యను పరిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు.

Next Story