మహిళా డాక్టర్ పై కార్పొరేటర్ దాడి.. ఖండించిన FAIMA

by Prasad Jukanti |

NICUలో బెడ్ లేదన్న కారణంతో ఓ మహిళా డాక్టర్, ఆసుపత్రి సిబ్బందిపై కార్పొరేటర్ అతని అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఏడుస్తున్నా కనికరించకుండా ఎటాక్ చేశారు.

మహిళా డాక్టర్ పై కార్పొరేటర్ దాడి.. ఖండించిన FAIMA
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహారాష్ట్రలోని కేడీఎంసీ శాస్త్రి నగర్ ఆసుపత్రిలో మహిళా డాక్టర్, నర్సులు, సిబ్బందిపై శివసేన కార్పొరేటర్ రమేశ్ మహాత్రే దాడి తీవ్ర కలకలం రేపుతోంది. ఆసుపత్రి సిబ్బంది ఏడుస్తున్నా వారిపై దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‍గా మారాయి. ఈ ఘటనను ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ (FAIMA) తీవ్రంగా ఖండించింది. దేశవ్యాప్తంగా వైద్యులు నిరంతరం భయానక వాతావరణంలో పనిచేయాల్సి వస్తోందని ఫైమా చీఫ్ పాట్రన్ డాక్టర్ రోహన్ కృష్ణన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో వైద్యులపై రోజురోజుకూ దాడులు పెరుగుతున్నాయని దాడులు, వేధింపులు, తీవ్రమైన మానసిక ఒత్తిడి కారణంగా సిబ్బంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇలా వైద్య సిబ్బందిపై భౌతిక దాడులు, అవమానాలు జరుగుతుంటే వారు నిస్వార్థంగా సేవలు అందించాలని దేశం ఆశించడం సరికాదని పేర్కొన్నారు. వైద్యుడిపై దాడి అంటే అది మొత్తం ఆరోగ్య వ్యవస్థపై జరిగిన దాడిగానే భావిస్తామని ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.

వీడియో ఆధారం ఉన్న తప్పు అంగీకరించని కార్పొరేటర్:

మహిళా డాక్టర్‍తో పాటు ఆసుపత్రి సిబ్బందిపై రమేశ్ మహాత్రే, అతడి అనుచరులు తీవ్రంగా దాడి చేసిన వీడియోలు ఉన్నప్పటికీ సదరు కార్పొరేటర్ ఏ మాత్రం పశ్చాతాపం వ్యక్తం చేయలేదు. తాజాగా ఓ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ నేను మహిళా డాక్టర్‌పై ఎలాంటి దాడి చేయలేదని మా ఫిర్యాదు వినకుండా ఆమె ఫోన్ మాట్లాడుతుండటంతో, ఫోన్‌ను పక్కకు నెట్టేందుకు మాత్రమే ఆమె చేతిని తట్టాను. అన్యాయంపై పోరాడటమే మాకు బాలాసాహెబ్ ఠాక్రే నేర్పించారని అన్నారు. ఈ ఘటనలో డాక్టర్లు ముందుగా క్షమాపణ చెబితే తాను కూడా విచారం వ్యక్తం చేస్తాననన్నారు.

అసలేం జరిగింది?

ఆసుపత్రి వర్గాల సమాచారం ప్రకారం.. ఎన్‌ఐసీయూ (NICU - నవజాత శిశువుల ఐసీయూ) బెడ్‌ల కొరత కారణంగా ఈ వివాదం తలెత్తింది. ఒక గర్భిణిని పరీక్షించిన వైద్యులు.. పుట్టబోయే బిడ్డకు NICU సంరక్షణ అవసరమవుతుందని, అయితే ప్రస్తుతం ఆసుపత్రిలో బెడ్‌లన్నీ నిండిపోవడంతో వేరే ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీనిపై సదరు కుటుంబ సభ్యులు కార్పొరేటర్‌కు సమాచారం అందించడంతో రమేశఅ మహాత్రే తన అనుచరులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో గొడవ పెద్దది కావడంతో ఆసుపత్రి సిబ్బందిపై కార్పొరేటర్ అనుచరులు దాడి చేయగా ఫోన్ లో మాట్లాడుతున్న మహిళా డాక్టర్ పై రమేశ్ చేయిచేసుకున్నారుర. ఈ ఘటనపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే కుమారుడు, శివసేన ఎంపీ డాక్టర్ శ్రీకాంత్ షిండే తీవ్రంగా స్పందించారు. శాస్త్రీనగర్ ఆసుపత్రిలో వైద్య సిబ్బందిపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో, ఒత్తిడిలో రాత్రింబగళ్లు ప్రజలకు సేవ చేసే వైద్యులపై ఇలాంటి దాడులు సహించరానివని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా హామీ ఇచ్చారు.

Next Story