- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘సత్లుజ్’ బ్యాన్‌పై నందిని రెడ్డి ఫైర్.. నిజాలు చెప్పే స్వేచ్ఛ లేకుంటే స్వాతంత్య్రానికి అర్థం ఏముందంటూ పోస్ట్
మన సమాజంలో మనల్ని బాధపెట్టే నిజాలను కూడా ధైర్యంగా చెప్పుకునే స్వేచ్ఛ మనకు లేకపోతే, అసలు మనకున్న స్వాతంత్ర్యానికి అర్థం ఏముందంటూ నందిని రెడ్డి నిలదీశారు

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ నటుడు దిల్జీత్ దోసాంజ్, దర్శకుడు హనీ టెహ్రన్ కాంబినేషన్‌లో వచ్చిన రియల్ లైఫ్ హార్డ్ హిట్టింగ్ మూవీ ‘సత్లుజ్’. పంజాబ్‌కు చెందిన ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త జస్వంత్ సింగ్ ఖల్రా జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. ఇందులో అర్జున్ రాంపాల్, సువీందర్ విక్కీ కీలక పాత్రలు పోషించారు. 1990ల కాలంలో పంజాబ్‌లో జరిగిన సుమారు 25,000 మంది యువకుల అదృశ్యం వెనుక ఉన్న అసలు వాస్తవాలను, హృదయవిదారక సంఘటనలను ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. అయితే, 2022లోనే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ.. సెన్సార్ సమస్యలు, కోర్టు కేసులు, ఆర్థిక ఇబ్బందులు, టైటిల్ వివాదాల కారణంగా గత నాలుగేళ్లుగా విడుదల కాలేదు. ఎట్టకేలకు ఇటీవల ఈ సినిమా సడెన్‌గా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై ప్రత్యక్షమైంది. కానీ, ఈ సినిమా కథాంశంపై మళ్లీ తీవ్ర వివాదం తలెత్తడంతో, స్ట్రీమింగ్ అయిన కేవలం రెండు రోజులకే ఈ సినిమాను ఓటీటీ నుంచి తొలగించి, నిలిపివేయడం గమనార్హం.
అయితే ఈ వివాదంపై సినీ సెలబ్రిటీలు ఒక్కోక్కరిగా రియాక్ట్ అవుతున్నారు. తాజాగా, టాలీవుడ్ దర్శకురాలు నందిని రెడ్డి ఈ విషయంపై ఇన్‌స్టాగ్రామ్ ద్వారా రియాక్ట్ అయ్యారు. తాను ఈ అద్భుతమైన సినిమాను చూడటం మొదలుపెట్టానని నందిని రెడ్డి తెలిపారు. అయితే అందులో చూపించిన కఠినమైన నిజాలను చూసి తట్టుకోలేక, సినిమా ముగియడానికి చివరి 30 నిమిషాల ముందు చిన్న బ్రేక్ తీసుకున్నట్లు చెప్పారు. మిగిలిన భాగాన్ని మరుసటి రోజు చూద్దాం అనుకునేలోపే ఈ సినిమాను బ్యాన్ చేసేశారని, అప్పుడే మొత్తం సినిమా చూసేసి ఉంటే బాగుండేది అనిపించిందని ఆమె పేర్కొన్నారు. మన సమాజంలో మనల్ని బాధపెట్టే నిజాలను కూడా ధైర్యంగా చెప్పుకునే స్వేచ్ఛ మనకు లేకపోతే, అసలు మనకున్న స్వాతంత్ర్యానికి అర్థం ఏముందంటూ నందిని రెడ్డి నిలదీశారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.






