కృష్ణా డెల్టాకు గోదావరి జలాలు: పట్టిసీమ లిఫ్ట్ మోటార్లను ఆన్ చేసిన మంత్రి నిమ్మల

by Kema Shiva Kumar |

పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి 12 పంపుల ద్వారా కృష్ణా డెల్టాకు గోదావరి జలాలను మంత్రి నిమ్మల రామానాయుడు విడుదల చేశారు.

కృష్ణా డెల్టాకు గోదావరి జలాలు: పట్టిసీమ లిఫ్ట్ మోటార్లను ఆన్ చేసిన మంత్రి నిమ్మల
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో నదుల అనుసంధాన ప్రక్రియలో భాగంగా మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఏలూరు జిల్లాలో పర్యటించిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanayudu), పోలవరం మండల పరిధిలోని పట్టిసీమ ఎత్తిపోతల పథకం వద్ద మోటార్లను ఆన్ చేసి గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు విడుదల చేశారు. మొత్తం 12 పంపుల ద్వారా ప్రాజెక్టు కుడి కాల్వలోకి 4,248 క్యూసెక్కుల నీటిని అధికారులు నీటిని వదిలారు. అంతకుముందు పట్టిసీమ డెలివరీ పాయింట్, తాడిపూడి ఎత్తిపోతల వద్ద మంత్రి నిమ్మల రామానాయుడు గోదావరి మాతకు భక్తిశ్రద్ధలతో జలహారతి ఇచ్చారు.

చంద్రబాబు దూరదృష్టి వల్లే ఇది సాధ్యమైంది..

ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. దేశంలోనే నదుల అనుసంధానానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. గతంతో ఇదే ప్రాజెక్టును ‘ఒట్టిసీమ’ అంటూ అవహేళన చేసిన వైఎస్ జగన్ (YS Jagan) ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. ముందుచూపు ఉన్న నాయకుడు పవర్‌లో ఉంటే.. ప్రజలకు మేలు జరగుతుందని అన్నారు. జగన్‌కు ఆ ఆలోచన లేకపోవడం వల్లే గత ఐదేళ్లు పట్టిసీమను పట్టించుకోలేదని ఆరోపించారు. ఇప్పటి వరకు ఈ పట్టిసీమ పథకం ద్వారా 442 టీఎంసీలకు పైగా గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు విజయవంతంగా తరలించి రైతాంగాన్ని ఆదుకున్నామని అన్నారు. ప్రస్తుతం గోదావరి ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీరు వృథాగా సముద్రంలో కలవకుండా, దానిని కృష్ణా డెల్టాకు తరలిస్తున్నామయని మంత్రి నిమ్మల పేర్కొన్నారు.

Next Story