యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ ఆలయంలో ఈదురు గాలుల బీభత్సం

by Muthe.Rajitha |

తెలంగాణలోకి ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పరిసరాల్లో వీచిన అత్యంత బలమైన ఈదురు గాలులు తీవ్ర బీభత్సాన్ని సృష్టించాయి.

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ ఆలయంలో ఈదురు గాలుల బీభత్సం
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలోకి ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పరిసరాల్లో వీచిన అత్యంత బలమైన ఈదురు గాలులు తీవ్ర బీభత్సాన్ని సృష్టించాయి. ఈ హఠాత్ పరిణామానికి ఆలయానికి వచ్చిన భక్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కొండపై ఒక్కసారిగా బలమైన ఈదురు గాలులు వీచడంతో, భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణంలో క్యూ లైన్ల వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక రేకుల షెడ్లు, టెంట్లు, ఐరన్ పిల్లర్లు, బ్యానర్లు గాల్లోకి లేచి దూరంగా పడిపోయాయి. ప్రసాద విక్రయ శాలల వద్ద ఉన్న తాత్కాలిక రక్షణ ఏర్పాట్లు కూడా దెబ్బతిన్నాయి.

భక్తులకు తీవ్ర అసౌకర్యం.. తృటిలో తప్పిన ప్రమాదం

ఆ సమయంలో స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లలో, మాడ వీధుల్లో వేచి ఉన్న వేలాది మంది భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రేకులు, టెంట్లు ఎగిరిపడుతుండటంతో ప్రాణాలు కాపాడుకోవడానికి భక్తులు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. అయితే, అత్యంత అదృష్టవశాత్తూ ఈ ఘోర ఈదురు గాలుల ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, భక్తులెవరికీ పెద్దగా గాయాలు కాలేదని ప్రాథమిక సమాచారం ద్వారా తెలిసింది. కొన్ని తాత్కాలిక నిర్మాణాలు మాత్రమే భారీగా ధ్వంసమయ్యాయి. ప్రమాద తీవ్రతను గమనించిన యాదగరిగుట్ట ఆలయ అధికారులు, ఈవో, సిబ్బంది తక్షణమే అప్రమత్తమయ్యారు. సహాయక బృందాలను రంగంలోకి దించి కొండపై విరిగిపడిన చెట్లను, కూలిపోయిన తాత్కాలిక షెడ్ల శిథిలాలను యుద్ధప్రతిపాదికన తొలగించే చర్యలు చేపట్టారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వారిని సురక్షితమైన ప్రదేశాలకు తరలించారు.

Next Story