విదేశాల్లో భారతీయ పర్యాటకుల ప్రవర్తనపై ఆందోళన

by Malleboina Mahesh |

భారతీయ టూరిస్టులో విదేశాల్లో ప్రవర్తిస్తున్న తీరుపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

విదేశాల్లో భారతీయ పర్యాటకుల ప్రవర్తనపై ఆందోళన
X

దిశ, వెబ్ డెస్క్: గత కొద్ది సంవత్సరాలుగా భారతదేశంలోని విదేశీ పర్యాటకుల (Foreign tourists) తాకిడి భారీగా పెరిగిపోయిన విషయం తెలిసిందే. అలాగే భారత్ నుంచి విదేశాలకు వెళ్లే భారతీయ పర్యాటకుల (Indian tourists) సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే సోషల్ మీడియా రీల్స్ కోసం కొంతమంది భారతీయులు విదేశీ పర్యటనల్లో వ్యవహరిస్తున్న తీరు ఇంటర్నెట్‌లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. వియత్నాం ఎయిర్‌పోర్ట్ రన్‌వేపై గర్బా నృత్యాలు చేయడం, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా వద్ద పాటలకు స్టెప్పులేయడం, పారిస్‌ వీధుల్లో బిగ్గరగా నినాదాలు చేయడం వంటి ఘటనలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అంతేకాకుండా, చికాగో నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలోని టాయిలెట్లను దుస్తులు, కవర్లతో బ్లాక్ చేయడం వల్ల విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి రావడం వంటి అపశృతులు చోటు చేసుకున్నాయి. దీంతో వారి ప్రవర్తన కారణంగా దేశ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ విధమైన ప్రవర్తనల కారణంగా స్విట్జర్లాండ్‌లోని ఒక హోటల్.. భారతీయ పర్యాటకుల కోసం ప్రత్యేకంగా 'బఫే నుండి ఆహారాన్ని ప్యాక్ చేయవద్దు, కారిడార్లలో అరవద్దు' అంటూ ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేసింది. థాయ్‌లాండ్ కూడా భారతీయులకు ఇచ్చే వీసా ఫ్రీ స్టే వ్యవధిని తగ్గించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, విదేశీయులు భారతదేశానికి వచ్చి ఇలాంటి పనులు చేసినప్పుడు వారిని ఎవరూ తప్పుబట్టరని, కానీ భారతీయులు చేసినప్పుడు మాత్రం ఆన్‌లైన్‌లో జాత్యహంకారం (Racism), పక్షపాత ధోరణితో ట్రోల్ చేస్తున్నారనే వాదనలు కూడా ఉన్నాయి.

ఆర్థికంగా చూస్తే, మెకిన్సే (McKinsey) నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యంత విలువైన పర్యాటక మార్కెట్‌గా భారతీయులు ఎదుగుతున్నారు. 2023 లోనే భారతీయులు విదేశీ ప్రయాణాల కోసం 33.3 బిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. అందుకే చాలా దేశాలు భారతీయులకు వీసా రహిత ప్రవేశాన్ని కల్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, విదేశాలకు వెళ్లే ప్రతి ఒక్కరూ కనీస ప్రయాణ నిబంధనలు (Travel Etiquette) పాటించడం, స్థానిక సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించడం, బహిరంగ ప్రదేశాలను వ్యక్తిగత రీల్స్ కోసం వాడుకోకుండా ఉండడం ఎంతో అవసరమని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

Next Story