రోడ్డెక్కిన ఫార్మా రైతులు : ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా

by Batti.Sumithra |

సాగర్ రోడ్డులోని ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఫార్మా వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

రోడ్డెక్కిన ఫార్మా రైతులు : ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా
X

దిశ, యాచారం : కూలీల కేసు కొనసాగుతుండగానే అక్రమంగా పనులు చేపడుతూ, బోరు మోటర్లకు విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఫార్మా రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం సాగర్ రోడ్డులోని ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఫార్మా వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఫార్మా వ్యతిరేక కమిటీ సమన్వయకర్త కవుల సరస్వతి మాట్లాడుతూ ఫార్మాసిటీ కోసం గతంలో సేకరించిన నాలుగు గ్రామాల అసైన్డ్, పట్టా భూములకు సంబంధించి హైకోర్టులో కేసు కొనసాగుతోందని తెలిపారు. అయినప్పటికీ అధికారులు చట్టాన్ని పట్టించుకోకుండా, కూలీల కేసు కొనసాగుతున్న భూముల్లోకి ప్రవేశించి భూమి చదును పనులు చేపడుతున్నారని ఆరోపించారు.

అలాగే రైతుల బోరు మోటర్లకు విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో తాగునీరు అందక మూగజీవాలు మృతి చెందుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తీసుకున్న భూములకు పూర్తి నష్టపరిహారం, హామీ ఇచ్చిన ప్లాట్లు ఇంకా ఇవ్వలేదని, అలాంటప్పుడు ఆ భూముల్లోకి అధికారులు ఎలా ప్రవేశిస్తారని ప్రశ్నించారు. ఎమ్మార్వో, విద్యుత్ ఏఈలు దీనిపై సమాధానం చెప్పాలని రైతులు కోరగా, తాము పై అధికారుల ఆదేశాల మేరకే పనిచేస్తున్నట్లు వారు తెలిపారు. అనంతరం ఫార్మా రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ వినతిపత్రాన్ని ఎమ్మార్వోకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫార్మా వ్యతిరేక కమిటీ సభ్యులు మహిపాల్ రెడ్డి, వంగ వినోద్ రెడ్డి, దేవోజి, అనంతరెడ్డి, సందీప్ రెడ్డి, కాన మౌని గణేష్‌తో పాటు కూలీలు, ఫార్మా రైతులు పాల్గొన్నారు.

Next Story