‘గ్రీన్ హైడ్రోజన్’ భవిష్యత్ ఇంధనం.. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

దేశంలో ఇంధన నిల్వలకు ఎలాంటి ఢోకా లేదని, ప్రస్తుతం 76 రోజులకు సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురి స్పష్టం చేశారు.

‘గ్రీన్ హైడ్రోజన్’ భవిష్యత్ ఇంధనం.. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో ఇంధన నిల్వలకు ఎలాంటి ఢోకా లేదని, ప్రస్తుతం 76 రోజులకు సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురి స్పష్టం చేశారు. సోమవారం ఓ జాతీయ న్యూస్ ఛానల్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ దేశ ఇంధన భద్రత, ధరల స్థిరీకరణపై కీలక విషయాలు పంచుకున్నారు. ‘గ్రీన్ హైడ్రోజన్’ భవిష్యత్ ఇంధనమని మంత్రి అభివర్ణించారు. భారతదేశంలో దీని వాడకం ద్వారా రాబోయే రోజుల్లో ఇంధన ధరలను భారీగా తగ్గించే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 2022, 2026 ఫిబ్రవరిలో తలెత్తిన ప్రపంచ ఇంధన సంక్షోభాలు మన చేతుల్లో లేకపోయినప్పటికీ, ప్రధాని నరేంద్ర మోడీ దౌత్య విధానాల వల్ల దేశీయ వినియోగదారులపై ఎలాంటి భారం పడకుండా జాగ్రత్తపడ్డామని వివరించారు.

41 దేశాల నుంచి దిగుమతులు

ఇంధనం కోసం కేవలం ఒకే దేశంపై ఆధారపడకుండా ఏకంగా 41 దేశాల నుంచి భారత్ చమురును దిగుమతి చేసుకుంటోందని తెలిపారు. మన దేశానికి వచ్చే ముడి చమురులో 90%, ఎల్పీజీ (LPG)లో 60% హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) గుండానే వస్తుందని, అక్కడ ఆటంకాలు ఏర్పడి బ్యారెల్ చమురు ధర 105 డాలర్లకు చేరినా, దేశంలో మాత్రం ప్రభావం పడకుండా చూశామన్నారు.

విపక్షాల విమర్శల్లో అర్థం లేదు

ఇంధన ధరలపై విపక్షాల ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలతో పోలిస్తే, విపక్షాల పాలనలో ఉన్న రాష్ట్రాల్లోనే స్థానిక పన్నుల (State Taxes) కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని విమర్శించారు. 2024 సార్వత్రిక ఎన్నికలతో పాటు ఇటీవల మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలు జరిగినా ఇంధన ధరలను పెంచలేదని, ధరలను స్థిరంగా ఉంచాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, దీనికి రాజకీయాలతో సంబంధం లేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నప్పటికీ, భారతదేశం గణనీయమైన ఇంధనం కలిగి ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Next Story