వాహనాల్లో పరిమితికి మించి లోడింగ్ చేస్తే కఠిన చర్యలు

by Muthe.Rajitha |

వాహనాల్లో పరిమితికి మించి (ఓవర్‌లోడింగ్) సరుకులు, ఖనిజాలను లోడ్ చేయడం, రవాణా చేయడంపై రాష్ట్ర రవాణా శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

వాహనాల్లో పరిమితికి మించి లోడింగ్ చేస్తే కఠిన చర్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : వాహనాల్లో పరిమితికి మించి (ఓవర్‌లోడింగ్) సరుకులు, ఖనిజాలను లోడ్ చేయడం, రవాణా చేయడంపై రాష్ట్ర రవాణా శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు అన్ని లోడింగ్ పాయింట్ల ఇన్‌చార్జులు, జిల్లా మైనింగ్ అధికారులు, జిల్లా రవాణా అధికారులకు రవాణా శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో పలు క్వారీలు, కంపెనీలు, లోడింగ్ పాయింట్లు వాహనాల నిర్ణీత పరిమితికి మించి సరుకులను లోడ్ చేస్తున్నట్లు రవాణా శాఖ గుర్తించింది. అంతేకాకుండా, ఆ అదనపు పరిమాణానికి వే బిల్లులు, ట్రాన్సిట్ పర్మిట్లు కూడా జారీ చేస్తున్నట్లు తేలింది. ఈ చర్యలు మోటారు వాహనాల చట్టం-1988, మైనింగ్ నిబంధనలతో పాటు గౌరవ సుప్రీంకోర్టు, హైకోర్టు ఉత్తర్వులను పూర్తిగా ఉల్లంఘించడమేనని రవాణా శాఖ స్పష్టం చేసింది. సెక్షన్ 113 (మోటారు వాహనాల చట్టం, 1988) ప్రకారం వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (ఆర్సీ)లో పేర్కొన్న గ్రాస్ వెహికల్ వెయిట్ (జీవీడబ్ల్యూ) కంటే ఎక్కువ బరువున్న లోడ్‌తో ఎలాంటి వాహనాన్ని నడపకూడదు, అనుమతించకూడదు. సెక్షన్ 194 ప్రకారం ఓవర్‌లోడ్ వాహనాన్ని అనుమతించడం లేదా నడపడం శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారు. సెక్షన్ 199 మేరకు ఈ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడే వారిపై ఈ సెక్షన్ కింద కూడా బాధ్యతలను నిర్దేశిస్తూ చట్టపరమైన చర్యలు ఉంటాయి.

లోడింగ్ పాయింట్ ఇన్‌చార్జులకు ఆదేశాలు...

ఏ వాహనంలోనూ దాని ఆర్సీలో అనుమతించిన జీవీడబ్ల్యూ కంటే ఎక్కువ లోడ్ చేయకూడదని రవాణా శాఖ స్పష్టం చేసింది. నిర్ణీత పరిమితులను ఉల్లంఘించి లోడింగ్‌కు పాల్పడే యజమానులు, బాధ్యులపై నేరుగా చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. అనుమతించదగిన పరిమితి కంటే అదనంగా ఉన్న ఖనిజ పరిమాణానికి ఎలాంటి రాయల్టీని అంగీకరించకూడదని మైనింగ్ శాఖకు మార్గదర్శకాలు జారీ చేసింది. పరిమితికి మించిన బరువుకు ట్రాన్సిట్ పర్మిట్లు లేదా రశీదులను జారీ చేయరాదని స్పష్టం చేసింది. అదనపు పరిమాణానికి పర్మిట్లు ఇవ్వడం లేదా రాయల్టీని స్వీకరించడం సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల ఉల్లంఘన కిందికే వస్తుందని పేర్కొంది. డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్లు (డీటీసీలు), జిల్లా రవాణా అధికారులు (డీటీఓలు) తమ పరిధిలోని అన్ని కంపెనీలు, క్వారీలు, లోడింగ్ పాయింట్లు, మైనింగ్ శాఖ అధికారులకు ఈ ఆదేశాలను రవాణా సిబ్బంది ద్వారా చేరవేయాలని రవాణా శాఖ స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన నివేదికను వెంటనే రవాణా కమిషనర్ కార్యాలయానికి సమర్పించాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను రవాణా శాఖ, మైనింగ్ శాఖ అధికారులు మరియు లోడింగ్ పాయింట్ ఇన్‌చార్జులు ఖచ్చితంగా అమలు చేయాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని రవాణా శాఖ హెచ్చరించింది.

Next Story