- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతుల విశ్వాసాన్ని దెబ్బతీస్తే కఠిన చర్యలు: వైరా ఎస్సై
రైతుల విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించే వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని వైరా ఎస్సై రామారావు, వ్యవసాయ శాఖ ఏడీ డీ.కరుణశ్రీ తెలిపారు.

దిశ, వైరా: రైతుల విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించే వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని వైరా ఎస్సై రామారావు, వ్యవసాయ శాఖ ఏడీ డీ.కరుణశ్రీ తెలిపారు. వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టడానికి వ్యవసాయ, పోలీస్ శాఖలు సంయుక్తంగా వైరా మండలంలోని తాడిపూడిలో గురువారం ముమ్మర తనిఖీలు చేపట్టారు. విత్తన దుకాణాలు, గోదాములు, రవాణా కేంద్రాలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఫర్టిలైజర్స్ అండ్ సీడ్స్ షాపులను సందర్శించి, విక్రయాల రికార్డులు, స్టాక్ వివరాలు, లైసెన్సులు, బిల్లుల నిర్వహణ, నిల్వల పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించారు. రైతులకు విక్రయిస్తున్న విత్తనాలు, ఎరువులు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని ఆరా తీశారు. అలాగే విత్తన ప్యాకెట్లపై ఉన్న వివరాలు, తయారీ తేదీలు, గడువు తేదీలు, కంపెనీ గుర్తింపు తదితర అంశాలు పరిశీలించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. రైతుల ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ తనిఖీలు ముమ్మరంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ రంగం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటిదని, రైతుల కష్టార్జితం సంపాదనను దోచుకునే నకిలీ వ్యాపారులపై పోలీస్, వ్యవసాయ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. వైరా పరిసర ప్రాంతాల రైతులు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు వినియోగించి అధిక దిగుబడులు సాధించాలని అధికారులు ఆకాంక్షించారు. రానున్న రోజుల్లో ఇలాంటి ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మంజు ఖాన్ పాల్గొన్నారు.






