- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బూర్గంపాడు పంచాయతీలో కార్యదర్శి ‘చేతివాటం’.. 4 నెలలు దాటినా అడ్రస్ లేని జీతాల లెక్కలు!
ఆ గ్రామాన్ని కాపాడాల్సిన అధికారి.. ఆ సిబ్బంది కష్టాన్ని గుర్తించాల్సిన పాలకుడు.. చివరకు వారి పొట్టకొట్టి రూ.లక్షలాది రూపాయలు తన జేబులో వేసుకున్న సంచలన ఉదంతం బూర్గంపాడు మేజర్ గ్రామపంచాయతీలో ఆలస్యంగా వెలుగుచూసింది.

దిశ, బూర్గంపాడు: ఆ గ్రామాన్ని కాపాడాల్సిన అధికారి.. ఆ సిబ్బంది కష్టాన్ని గుర్తించాల్సిన పాలకుడు.. చివరకు వారి పొట్టకొట్టి రూ.లక్షలాది రూపాయలు తన జేబులో వేసుకున్న సంచలన ఉదంతం బూర్గంపాడు మేజర్ గ్రామపంచాయతీలో ఆలస్యంగా వెలుగుచూసింది. బదిలీపై వెళ్లిన ఓ పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది జీతాల సొమ్మును సైతం వదలకుండా స్వాహా చేశారనే ఆరోపణలు ఇప్పుడు స్థానికంగా దావానలంలా వ్యాపిస్తున్నాయి. బదిలీ జరిగి 20 రోజులు గడుస్తున్నా సదరు కార్యదర్శి నూతన అధికారికి చార్జ్ అప్పగించకపోవడం వెనుక పెద్ద ‘దొంగ లెక్కల’ స్కామే ఉందనే ఆక్షేపణలు బలంగా వినిపిస్తున్నాయి.
జీతాల సొమ్ము.. జేబులోకి ఇలా..!
బూర్గంపాడు మేజర్ గ్రామపంచాయతీలో మొత్తం 18 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. వీరికి ప్రతి నెలా రూ.1,71,000 జీతాల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. అయితే, గత ఏడాది డిసెంబర్ నెలలో సిబ్బంది అందరికీ ఇవ్వాల్సిన పూర్తి జీతం ఇవ్వకుండా, కేవలం ఒక్కొక్కరికి రూ.5 వేలు మాత్రమే ఇచ్చి మిగతా సొమ్మును బదిలీ కార్యదర్శి ప్రభాకర్ తన జేబులో వేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. 'మన కార్యదర్శే కదా, తర్వాత ఇస్తాడులే' అని నమ్మిన సిబ్బంది నోరు మెదపకపోవడమే ఆయనకు వరంగా మారింది.ఇక ఈ ఏడాది (2026) జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించి మూడు నెలల జీతాల కోసం పంచాయతీ ఖాతా నుంచి రూ. 5,13,000 డ్రా చేసినట్లు తెలుస్తోంది.ఇందులో కేవలం ఒక నెల జీతం మాత్రమే సిబ్బందికి ఇచ్చి,మిగిలిన రెండు నెలల జీతం రూ. 2,52,000ను సదరు కార్యదర్శి ప్రభాకర్ చేతివాటం ప్రదర్శించి నొక్కేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెక్కాడితే గాని డొక్కాడని పంచాయతీ కార్మికుల కష్టార్జితాన్ని ఇలా స్వాహా చేయడం పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
చార్జ్ ఇవ్వకపోవడం వెనుక ‘దొంగ లెక్కల’ వ్యూహం?
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ కార్యదర్శి తనకున్న పలుకుబడితో సాధారణ బదిలీపై వెళ్లినప్పటికీ, ఇప్పటివరకు నూతన కార్యదర్శికి బాధ్యతలు అప్పగించలేదు. బదిలీ అయి 20 రోజులు దాటినా చార్జ్ ఇవ్వకుండా కాలయాపన చేయడం వెనుక.. ఈ నాలుగు నెలలుగా తారుమారైన లెక్కలను సర్దడానికేనని, దొంగ లెక్కలు సృష్టించేందుకే చార్జ్ ఇవ్వడం లేదని స్థానికులు మండిపడుతున్నారు.
వెనుక ఉండి నడిపిస్తున్న ఆ ‘సూత్రధారి’ ఎవరు..?
ఈ వ్యవహారంలో బదిలీ కార్యదర్శి ప్రభాకర్‌పై విచారణ జరపాలని జిల్లా కలెక్టర్, డీపీఓలు ఆదేశాలు జారీ చేసినప్పటికీ, మండల స్థాయి అధికారులు మాత్రం నత్తనడకన వ్యవహరిస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. కలెక్టర్ ఆదేశాలనే ధిక్కరిస్తూ విచారణలో జాప్యం చేయడం వెనుక ఓ ఉన్నత స్థాయి మండల అధికారి హస్తం ఉన్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది.సదరు అధికారి ఈ అవినీతికి సూత్రధారిగా, పాత్రధారిగా మారి కార్యదర్శికి కొమ్ముకాస్తున్నారని సర్పంచ్, వార్డు సభ్యులు ఆరోపిస్తున్నారు. పాలన పరంగా ఇబ్బందులు తలెత్తుతున్నా, ఉన్నతాధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం వెనుక ఉన్న మతలబు ఏంటో జిల్లా కలెక్టర్ గారే తేల్చాలని, తక్షణమే విచారణ జరిపి సిబ్బందికి రావలసిన జీతాల సొమ్మును రికవరీ చేయాలని బూర్గంపాడు ప్రజలు, పంచాయతీ సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు.






