శివసేనలో ముదిరిన సంక్షోభం.. తిరుగుబాటు ఎంపీలకు రూ.10 కోట్లు ఇచ్చారని సంజయ్ రౌత్ ఆరోపణ

by Ramesh Naini |

శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) యూబీటీ పార్టీలో సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది.

శివసేనలో ముదిరిన సంక్షోభం.. తిరుగుబాటు ఎంపీలకు రూ.10 కోట్లు ఇచ్చారని సంజయ్ రౌత్ ఆరోపణ
X

దిశ, డైనమిక్ బ్యూరో: శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) యూబీటీ పార్టీలో సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది. పార్టీ జారీ చేసిన విప్‌ను ధిక్కరించి ఢిల్లీలో జరిగిన అత్యవసర పార్లమెంటరీ సమావేశానికి 9 మంది లోక్‌సభ ఎంపీల్లో ఏకంగా ఆరుగురు డుమ్మా కొట్టారు. వీరంతా ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గంలో విలీనం అయ్యేందుకు సిద్ధమైనట్లు స్పష్టమవుతోంది. అయితే పార్టీకి చెందిన ఆరుగురు లోక్‌సభ ఎంపీలు పార్లమెంటరీ సమావేశానికి గైర్హాజరుకావడంపై రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ (Sanjay Raut) తీవ్ర ఆరోపణలు చేశారు. అసమ్మతి ఎంపీలకు ఇప్పటికే రూ.15 కోట్లు ఇచ్చి, తాజాగా మరో రూ.10 కోట్లు చొప్పున అందజేసి రాజస్థాన్‌లోని సురక్షిత ప్రాంతానికి తరలించారని ఆయన పేర్కొన్నారు. పార్టీ విప్‌ను ఉల్లంఘించిన ఎంపీలపై చర్యలు ప్రారంభించామని, వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసి సభ్యత్వ రద్దు కోసం ప్రయత్నిస్తామని రౌత్ తెలిపారు. తిరుగుబాటు ఎంపీలకు నైతికత ఉంటే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వారిని ‘ద్రోహులు’గా అభివర్ణిస్తూ, వారికి కల్పించిన పోలీసు భద్రతను ఉపసంహరించుకోవాలని కోరారు.

దేశ రాజకీయాలను కలుషితం చేస్తున్న బీజేపీ

దేశ రాజకీయాలను, ముఖ్యంగా మహారాష్ట్ర రాజకీయాలను బీజేపీ కలుషితం చేసిందని ఆరోపించిన రౌత్, దీనికి ఆ పార్టీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. మరోవైపు, శివసేన నేత సంజయ్ శిర్సాట్ (Sanjay Shirsat) మాత్రం ఈ అసంతృప్తి ఏడాదిగా కొనసాగుతోందని, ఎంపీలను ఆకర్షించేందుకు తాము ఎలాంటి ‘ఆపరేషన్ టైగర్’ చేపట్టలేదని, ఇది శివసేన (యూబీటీ) అంతర్గత వ్యవహారమేనని వ్యాఖ్యానించారు. తిరుగుబాటుకు తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

షిండే వర్గంలోకి ఆరుగురు ఎంపీలు?

పార్టీ సమావేశానికి అరవింద్ సావంత్, అనిల్ దేశాయ్, రాజభావు వాజే, సంజయ్ రౌత్ మాత్రమే హాజరయ్యారు. మిగిలిన ఆరుగురు ఎంపీలు (నాగేశ్ ఆస్తికర్, సంజయ్ దేశ్‌ముఖ్, సంజయ్ జాదవ్, సంజయ్ దిన పాటిల్, ఓంప్రకాశ్ రాజేనింబాల్కర్, భావుసాహెబ్ వాక్‌చౌరే) లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి ఏకనాథ్ షిండే వర్గంలో విలీనానికి గుర్తింపునివ్వాలని కోరుతూ లేఖ ఇచ్చినట్లు సమాచారం. ఫిరాయింపుల నిరోధక చట్టం నుంచి తప్పించుకోవడానికి కావాల్సిన మూడింట రెండొంతుల (2/3) బలం ఈ ఆరుగురు ఎంపీల రూపంలో వారికి దక్కిందని మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చానీయాంశంగా మారింది.

Next Story