బాబా ముసుగులో 15 ఏళ్లుగా మహిళపై అత్యాచారం.. మూత్రం తాగించి, నగ్న వీడియోలతో బ్లాక్‌మెయిల్

by Prasad Jukanti |   (  Updated:2026-06-18 13:41:20  IST  )

పుణేలో నకిలీ బాబా మహిళను 15 ఏళ్ల పాటు బంధించి వేధించిన కేసులో ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

బాబా ముసుగులో 15 ఏళ్లుగా మహిళపై  అత్యాచారం.. మూత్రం తాగించి, నగ్న వీడియోలతో బ్లాక్‌మెయిల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మనుషుల బలహీనతలను ఆసరాగా చేసుకుని దారుణాలకు పాల్పడుతున్న దొంగ బాబాల బాగోతాలు తరచూ వెలుగు చూస్తూనే ఉన్నాయి. అయిన భక్తి పేరుతో నమ్మిన పాపానికి భక్తులను నిలువునా మోసగిస్తున్న ఫేక్ బాబాలు పుట్టుకొస్తూనే ఉన్నారు. తాజాగా పూణేలో వెలుగు చూసిన ఓ స్వయం ప్రకటిత బాబా ఘోరాలు షాక్ కు గురి చేస్తోంది. బాబా ముసుగులో 15 ఏళ్లుగా ఓ మహిళను చెరబట్టి ఆమెపై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా ఆమె చేత మూత్రం తాగించి నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసిన ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది. విస్తుపోయే దారుణాలకు కేరాఫ్‍గా మారిన ఈ కేసులో నకిలీ బాబాతో పాటు ఆరుగురు మహిళలు సహా మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు.

మోడరన్ గురుకులం పేరిట మైండ్ గేమ్

రాధామోహన్ మిశ్రా అనే వ్యక్తి దైవిక శక్తులు ఉన్నాయంటూ నమ్మించి పుణేలోని ఖరాడీ ప్రాంతంలో ఒక పెద్ద బంగ్లాలో ‘మోడరన్ గురుకులం’ పేరుతో ఆశ్రమాన్ని నడిపిస్తున్నాడు. తన వద్దకు వచ్చే భక్తులను నమ్మించి వారి పిల్లలను ఆశ్రమంలో ఉంచి చదివించుకునేలా వారిని ప్రోత్సహించేవాడు. అలా ఆ బాబా మాటలు నమ్మి అనేక మంది తల్లిదండ్రులు వారి పిల్లలను ఆ ఆశ్రమంలో చేర్పించారు. అయితే అక్కడ చేరిన పిల్లలు పగటిపూట స్కూళ్లు, కాలేజీలకు వెళ్లి రాత్రి వేళల్లో ఆశ్రమంలోనే ఉండేవారు. ఈ క్రమంలో తనకు అతీత శక్తులు ఉన్నాయని తాను మనసులో మాటలను చదవగలని నమ్మబలుకుతూ ప్రతి ఒక్కరి వ్యక్తిగత విషయాలు, ఆలోచనలను ‘రిపోర్ట్’ రూపంలో రాయించుకుని వాటితోనే వారిని లొంగతీసుకునేవాడు.

కరెంట్ షాక్‌లు.. మూత్రం తాగించి నరకం

ఈ క్రమంలో తనతో రెండు దశాబ్దాలుగా పరిచయం ఉన్న ఓ కుటుంబంలోని మహిళపై బాబా దృష్టి పడింది. ఆ కుటుంబానికి ఉన్న నమ్మకాన్ని ఆసరగా చేసుకుని ఆ మహిళను తన ఆశ్రమంలో ఉండేలా కుటుంబ సభ్యులను ఒప్పించాడు. అయితే ఆశ్రమానికి వచ్చిన ఆ మహిళను అక్కడ ఓ గదిలో బంధించి సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం నిఘా పెట్టాడు. విశ్వాస పరీక్షల పేరుతో ఆమెపై నిరంతరం అత్యాచారానికి పాల్పడేవాడు. బాబా అఘాయిత్యాలపై ఆమె కుటుంబానికి ఫిర్యాదు చేసినా బాబాపై ఉన్న భక్తి, విశ్వాసంతో ఆమె అబద్ధాలాడుతోందని కుటుంబ సభ్యులు నమ్మలేదు. సభ్యులు సైతం బాబా మాటలనే విశ్వసించారు. తాను చెప్పేది కుటుంబ సభ్యులు కూడా వినిపించుకోకపోవడంతో నరకయాతన అనుభవించిన ఆ మహిళపై బాబా మరింత దారుణంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. ఆమెకు కరెంట్ షాక్‌లు ఇవ్వడమే కాకుండా, బలవంతంగా ఆమె చేత మూత్రాన్ని తాగించేవారని పోలీసులు తెలిపారు.

తానే పెళ్లి చేసి నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్:

బాధిత మహిళ ఎలాగైనా ఆ నరకం నుండి బయటపడాలని పెళ్లి ప్రతిపాదన తీసుకువచ్చింది. దీంతో బాబానే ఒక మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా కొన్ని కఠినమైన షరతులతో ఆమెకు వివాహం జరిపించాడు. ఆ తర్వాత మహిళ, ఆమె భర్తకు సంబంధించిన నగ్న వీడియోలను సేకరించి వాటితో బ్లాక్‌మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. చివరికి భర్త నుండి కూడా ఆమె విడిపోయేలా చేశాడు. భరించలేని స్థితికి చేరిన బాధితురాలు.. చివరకు తన గదిలోని సీసీటీవీ కెమెరాలను పగలగొట్టి, ఆ బంగ్లా నుండి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది. జూన్ 16న అందిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి రంగంలోకి దిగిన పోలీసులకు ఆ ఆశ్రమంలో జరుగుతున్నదని చూసి విస్తుపోయారు.

భారీగా నగదు, సొరంగం:

బాధితురాలి ఫిర్యాదుతో మోడ్రన్ గురుకుల భవనానికి వెళ్లిన పోలీసులు అక్కడ సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీగా ఎలక్ట్రానిక్ సాక్ష్యాలు లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. 19 హార్డ్ డిస్క్‌లు, 12 ల్యాప్‌టాప్‌లు, 11 సెల్‌ఫోన్లు, 23 పెన్ డ్రైవ్‌లు, భారీగా డీవీడీలు, సీడీలతో పాటు రూ. 6.5 లక్షల నగదు, రూ. 15 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు కనుగొన్నట్లు వెల్లడిచారు. అయితే అక్కడ ఎలాంటి ఆయుధాలు లేకపోయినా 10 బుల్లెట్లు లభ్యమయ్యాయినట్లు తెలిపారు. అంతేకాకుండా, పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఆశ్రమం కింద రహస్యంగా నిర్మిస్తున్న ఒక భూగర్భ సొరంగ మార్గం బయటపడింది. ఏదైనా ముప్పు వస్తే తప్పించుకోవడానికి దీనిని తవ్వుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. అయితే ఈ బాబాకు మహారాష్ట్రతో పాటు పలు నార్త్ ఇండియాలోని పలు రాష్ట్రాల్లో కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఉన్నారని, ఈ దారుణానికి సంబంధించి ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారనే కోణంలో దృష్టి సారించినట్లు పోలీసులు తెలిపారు.

Next Story