Tata Motors: టాటా మోటార్స్ మరోసారి ధరల పెంపు

by S Gopi |

జూలై 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ పెంపు గరిష్టంగా 2.5 శాతం వరకు ఉండనుంది.

Tata Motors: టాటా మోటార్స్ మరోసారి ధరల పెంపు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ అతిపెద్ద వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ మరోసారి తన వాణిజ్య వాహనాల (సీవీ) ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. జూలై 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ పెంపు గరిష్టంగా 2.5 శాతం వరకు ఉండనుంది. ముడిసరుకుల ధరలు పెరగడం, తయారీ ఖర్చులు అధికమవడం వల్ల వచ్చిన భారం కొంత మేర వినియోగదారులపై మళ్లించాల్సి వచ్చిందని కంపెనీ తెలిపింది. అయితే పెంపు శాతం అన్ని వాహనాలకు ఒకేలా ఉండదు. మోడల్, వేరియంట్‌ను బట్టి ధరల సవరణ మారుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టాటా మోటార్స్ కమర్షియల్ వాహనాలకు సంబంధించి ఇది రెండోసారి ధరల పెంపు కావడం గమనార్హం. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే కంపెనీ 1.5 శాతం వరకు ధరలను పెంచగా, ఇప్పుడు అంతకంటే ఎక్కువగా 2.5 శాతం వరకు పెంచుతోంది. ఇదే సమయంలో ప్యాసింజర్ వెహికల్ విభాగం కూడా జూలై 1 నుంచి తన కార్ల ధరలను 1.5 శాతం వరకు పెంచనున్నట్లు ఇటీవల ప్రకటించింది. పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ పేర్కొంది. దీంతో టాటా మోటార్స్ కమర్షియల్ వాహనాలు, ప్యాసింజర్ కార్లు, ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలనుకునే వారు జూన్ నెలలో కొంటేనే ప్రస్తుత ధరల ప్రయోజనం పొందే అవకాశం ఉంది.

Next Story