నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు

by Batti.Sumithra |

నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతలు, ప్రజాప్రశాంతత పరిరక్షణ దృష్ట్యా పలు ప్రత్యేక నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చినట్లు పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య వెల్లడించారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతలు, ప్రజాప్రశాంతత పరిరక్షణ దృష్ట్యా పలు ప్రత్యేక నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చినట్లు పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య వెల్లడించారు. ఈ మేరకు ఈనెల 16 నుంచి 31 వరకు అమల్లో ఉండేలా ఉత్తర్వులు జారీ చేసినట్లు సీపీ తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే ప్రదేశాల్లో, ముఖ్యంగా పార్కులు, ఐలాండ్లు, ప్రభుత్వ భవనాల వద్ద విగ్రహాల ప్రతిష్ఠాపన చేపట్టకూడదన్నారు. విగ్రహాల ఏర్పాటు కోసం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా పొందాలని సూచించారు.

డీజేల పై నిషేధాజ్ఞలు..

శబ్ద కాలుష్య నియంత్రణలో భాగంగా అధిక శబ్దంతో డీజేలు వినియోగించరాదని, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు డీజే సౌండ్ సిస్టమ్ పూర్తిగా నిషేధిస్తున్నట్లు సీపీ స్పష్టం చేశారు. సభలు, సమావేశాలు, ఊరేగింపుల కోసం సంబంధిత పోలీసు అధికారుల అనుమతిని తప్పనిసరిగా తీసుకోవాలని సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు. 500 మంది వరకు పాల్గొనే కార్యక్రమాలకు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్, అంతకంటే ఎక్కువ మంది పాల్గొనే కార్యక్రమాలకు 72 గంటల ముందే పోలీస్ కమిషనర్ నుంచి విధిగా అనుమతి తీసుకోవాలని సీపీ తెలిపారు. మాల్స్, సినిమా థియేటర్లు, హోటళ్లు, ఎగ్జిబిషన్లు తదితర ప్రాంతాల్లో భద్రతా నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని పేర్కొన్నారు. ప్రజలు క్యూ విధానాన్ని పాటించాలని సూచించారు. డ్రోన్ల వినియోగం పై కూడా ఆంక్షలు విధించినట్లు తెలిపారు. ప్రజాప్రయోజనాల కోసం డ్రోన్లు వినియోగించాలనుకుంటే సంబంధిత ప్రభుత్వ, పోలీసు, ఏవియేషన్ శాఖల నుంచి ముందస్తు అనుమతులు పొందాలని సూచించారు.

నకిలీ గల్ఫ్ ఏజెంట్లతో జాగ్రత్త..

జిల్లాలో నకిలీ గల్ఫ్ ఏజెంట్ల మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ హెచ్చరించారు. ఇళ్లు అద్దెకు ఇచ్చే ముందు వారి వివరాలను ధృవీకరించి, అనుమానాస్పద వ్యక్తుల సమాచారాన్ని వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. 'ఏ' సర్టిఫికెట్ పొందిన సినిమాలను మైనర్లు వీక్షించేందుకు థియేటర్లు అనుమతించరాదని స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడాన్ని కూడా నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు సీపీ తెలిపారు. నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, ఇందుకు నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలోని పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వోలు, ఎస్‌ఐలకు అధికారాలు కల్పించినట్లు సీపీ వెల్లడించారు. ప్రజలందరూ పోలీసు శాఖకు సహకరించాలని పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Next Story