రైతులను ఇబ్బంది పెడితే డీలర్లపై కఠిన చర్యలు

by Ratna Kumari |

రైతులు ప్రభుత్వం సూచించిన నాణ్యమైన, సన్న రకాల విత్తనాలను మాత్రమే కొనుగోలు చేసి సాగు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి అన్నారు.

రైతులను ఇబ్బంది పెడితే డీలర్లపై కఠిన చర్యలు
X

దిశ, కోదాడ : రైతులు ప్రభుత్వం సూచించిన నాణ్యమైన, సన్న రకాల విత్తనాలను మాత్రమే కొనుగోలు చేసి సాగు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి అన్నారు. గురువారం కోదాడ మండలంలోని అల్వాలపురం, గుడిబండ రైతు వేదికల్లో నిర్వహించిన విత్తన మేళాలను ఆయన సందర్శించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా విత్తన మేళాల ద్వారా రైతులు నాణ్యమైన విత్తనాలను అందుబాటు ధరల్లో పొందే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు పంటల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉన్నందున అధిక నీటి అవసరం లేని ఆరుతడి పంటలైన కందులు, పెసర్లు, ఇతర పప్పుధాన్యాలు, కూరగాయల సాగుపై దృష్టి సారించాలని రైతులకు సూచించారు.అనంతరం కోదాడ మండలంలోని పలు ఎరువుల దుకాణాలను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి ఎరువుల నిల్వలు, విక్రయాల తీరును తనిఖీ చేశారు.

రైతులు యూరియా ఎరువును తప్పనిసరిగా ప్రభుత్వం రూపొందించిన యాప్ ద్వారానే కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. ఎరువుల డీలర్లు నిర్ణయించిన గరిష్ఠ చిల్లర ధర (ఎంఆర్పీ)కే ఎరువులను విక్రయించాలని ఆదేశించారు.రైతులను ఇబ్బందులకు గురిచేసే విధంగా ఎరువుల విక్రయాలు నిర్వహించినా, అధిక ధరలకు విక్రయించినా, నిబంధనలు ఉల్లంఘించినా సంబంధిత డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వ్యవసాయ శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపడతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోదాడ వ్యవసాయ సహాయ సంచాలకులు పి.ప్రశాంతి, మండల వ్యవసాయ అధికారి పాలెం రజని, వ్యవసాయ విస్తరణ అధికారులు నగేశ్, పిచ్చయ్య, మహేష్, పలువురు రైతులు, ఎరువుల డీలర్లు పాల్గొన్నారు.

Next Story