- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జడ్చర్లను విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుతాం : ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం ఐటీఐలను ఆధునీకరించి బలోపేతం చేసే దిశగా బలమైన అడుగులు వేస్తోందని మంత్రి జి. వివేక్ వెంకటస్వామి అన్నారు.

దిశ, జడ్చర్ల / రాజాపూర్ : రాష్ట్రంలోని యువతకు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు అందించి ఉపాధి అవకాశాలను విస్తృతం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఐటీఐలను ఆధునీకరించి బలోపేతం చేసే దిశగా బలమైన అడుగులు వేస్తోందని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, శిక్షణ మరియు ఫ్యాక్టరీల శాఖ మంత్రి జి. వివేక్ వెంకటస్వామి అన్నారు. రాజాపూర్ మండలం రంగారెడ్డి గూడ గ్రామంలో రూ.8 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) నిర్మాణానికి మంత్రి జి. వివేక్ వెంకటస్వామి గురువారం స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ గత పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో ఐటీఐల అభివృద్ధి పూర్తిగా నిర్లక్ష్యానికి గురై అనేక సంస్థలు మూతపడే పరిస్థితికి చేరుకున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో యువతకు నాణ్యమైన నైపుణ్య శిక్షణ అందించేందుకు ఐటీఐలను ఆధునికీకరించి అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. టాటా టెక్నాలజీస్ భాగస్వామ్యంతో రూ.2,200 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోని 65 ఐటీఐలను ఆధునిక శిక్షణ కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
అదనంగా ప్రతి నియోజకవర్గంలో ఒక ఏటీసీ కేంద్రం ఏర్పాటు లక్ష్యంగా రూ.2,000 కోట్లతో మరో 53 కేంద్రాలను నిర్మిస్తున్నట్లు చెప్పారు. రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సీఎన్‌సీ మెషినింగ్ వంటి అత్యాధునిక కోర్సులతో పాటు ఎలక్ట్రిషియన్, వెల్డింగ్, హెల్త్‌కేర్, హోమ్‌కేర్ రంగాల్లో కూడా శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. ఈ కేంద్రాల ఏర్పాటుతో ఐటీఐల్లో ప్రవేశాలు గణనీయంగా పెరిగాయని, గతంలో 60 శాతం ఉన్న అడ్మిషన్లు ప్రస్తుతం 90 శాతానికి పైగా నమోదవుతున్నాయని పేర్కొన్నారు. విదేశీ ఉపాధి అవకాశాలను దృష్టిలో ఉంచుకుని టామ్‌కామ్ ద్వారా జర్మన్ భాషా శిక్షణ కార్యక్రమాలు ప్రారంభిస్తున్నామని మంత్రి తెలిపారు. జర్మనీతో పాటు పలు దేశాల్లో నైపుణ్యం కలిగిన యువతకు విస్తృత అవకాశాలు ఉన్నాయని, భాషా ప్రావీణ్యం సాధించిన వారికి విదేశీ ఉద్యోగాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఏటీసీల్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు నెలకు రూ.2,000 స్టైఫండ్ అందిస్తున్నామని, ఆర్థిక ఇబ్బందులు లేకుండా నైపుణ్యాలను పెంపొందించుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోందని చెప్పారు.
జడ్చర్లను విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుతున్నాం : ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ, తన సొంత గ్రామమైన రంగారెడ్డిగూడలో ఏటీసీ కేంద్రం ఏర్పాటవడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.8 కోట్లు కేటాయించగా, టాటా టెక్నాలజీస్ సహకారంతో మరో రూ.35 కోట్ల విలువైన ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. మొత్తం రూ.42 కోట్ల వ్యయంతో ఈ కేంద్రం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. జడ్చర్ల నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, నవోదయ పాఠశాల, తెలంగాణ పబ్లిక్ స్కూల్, ట్రిపుల్ ఐటీ వంటి విద్యాసంస్థలతో పాటు ఏటీసీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.
యువత అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్
జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా మాట్లాడుతూ మహబూబ్‌నగర్ జిల్లాలోని నాలుగు ఐటీఐలను రూ.40 కోట్లతో ఆధునికీకరించి అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్లుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఈ కేంద్రాల్లో చేరి నైపుణ్య శిక్షణ పొంది ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. ఉపాధి కల్పన, శిక్షణ శాఖ డైరెక్టర్ కంటి వెస్లీ మాట్లాడుతూ రంగారెడ్డిగూడలో ఏటీసీ ఏర్పాటుకు నాలుగు ఎకరాల భూమి కేటాయించడంలో సహకరించిన ప్రజాప్రతినిధులు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఏటీసీల్లో శిక్షణ పొందిన యువతకు నెలకు కనీసం రూ.18 వేల వేతనంతో ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డి. జానకి, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ సాయి శివాని, రంగారెడ్డిగూడ గ్రామ సర్పంచ్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.






