కష్టమైనా నిరంతరం మీ మధ్యే ఉండేది బీఆర్ ఎస్ పార్టీనే : హరీష్ రావు

by Taduka Kalyani |

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కొత్త స్కీములు ఏమీ రాలేదు కానీ అన్నీ స్కాం లే అని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు.

కష్టమైనా నిరంతరం మీ మధ్యే ఉండేది బీఆర్ ఎస్ పార్టీనే : హరీష్ రావు
X

దిశ, సిద్దిపేట అర్బన్ : కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కొత్త స్కీములు ఏమీ రాలేదు కానీ అన్నీ స్కాం లే అని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సిద్దిపేటలోని 29వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ వార్డు కార్యాలయాన్ని హరీశ్ రావు ప్రారంభించి మాట్లాడారు. వెటర్నరీ కళాశాల సగం పనులు పూర్తయ్యాక సీఎం రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా కొడంగల్ కు ఎత్తుకొని పోయి పిల్లల నోటి కాడ బుక్క లాక్కున్నాడని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు ఏ మొహం పెట్టుకొని సిద్దిపేట లో తిరుగుతున్నారో వాళ్లకే తెలియాలన్నారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్‌షిప్స్ ఇవ్వకుండా చదువులు ఆగం చేశారన్నారు. సిద్దిపేట అభివృద్ధిని చూసి ఓర్వలేక శిల్పారామం, రంగనాయక సాగర్ పనులను సగంలోనే ఆపేశారన్నారు. ఎన్నికల హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అవ్వ తాతలకు, బీడీ కార్మికులకు 31 నెలలుగా రూ.62 వేలు బాకీ పడ్డారన్నారు. మహిళలకు రూ.2500 ఇస్తానని మోసం చేశారన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంగా చేసుకొని విద్య క్షేత్రంగా తీర్చిదిద్దుకున్న ట్లు స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సిద్దిపేట ప్రాంతానికి సాగునీరు, తాగునీరు అందించినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకా కేసీఆర్ కిట్ రూ.12వేలు బంద్ పెట్టారన్నారు. కల్యాణ లక్ష్మి స్కీంలో తులం బంగారం పేరిట మోసం చేశారన్నారు. ఏడాది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ నాయకులు రెండున్నర ఏండ్లుగా 20 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా నిరుద్యోగులకు బోడి గుండు చూపించారన్నారు. కాంగ్రెస్ వాళ్లు కేవలం ఓట్ల కోసమే వస్తారు.. ఓట్లు అయిపోతే మాయమవుతారన్నారు. బతుకమ్మ, దసరా, దేవీ నవరాత్రులు, రంజాన్, బక్రీద్, క్రిస్మస్.. ఇలా పండుగైనా, కష్టమైనా నిరంతరం మీ మధ్యే ఉంటూ మీ ఇంట్లో అన్నదమ్ముల్లా, అక్కాచెల్లెళ్లలా ఉండేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అన్నారు. ఈ స్కామ్‌ల ప్రభుత్వం పోవాలి, మళ్లీ మన స్కీమ్‌ల ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని హరీష్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్ రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Next Story