కారేపల్లి ఆధార్ కేంద్రంలో అక్రమాలు..?

by Ratna Kumari |

ప్రజలకు సులభంగా ఆధార్ సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రాలు కొందరి చేతుల్లో ఆదాయ వనరులుగా మారుతున్నాయనే ఆరోపణలు కారేపల్లి మండలంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

కారేపల్లి ఆధార్ కేంద్రంలో అక్రమాలు..?
X

దిశ, కారేపల్లి : ప్రజలకు సులభంగా ఆధార్ సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రాలు కొందరి చేతుల్లో ఆదాయ వనరులుగా మారుతున్నాయనే ఆరోపణలు కారేపల్లి మండలంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా విద్యార్థుల అవసరాల కోసం మంజూరైన ఆధార్ కేంద్రాన్ని నిబంధనలకు విరుద్ధంగా సాధారణ ప్రజల సేవలకు వినియోగిస్తూ భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.అధికారికంగా నిర్ణయించిన రుసుములకు భిన్నంగా వందల రూపాయలు వసూలు చేస్తూ ప్రజలను దోచుకుంటున్నారని స్థానికులు మండిపడుతున్నారు.

విద్యార్థుల కోసం ఏర్పాటు.. అందరికీ సేవలు

కారేపల్లి మండలంలో ప్రస్తుతం రెండు ఆధార్ కేంద్రాలు కొనసాగుతున్నాయి.ఇందులో ఒకటి సాధారణ ప్రజలకు సేవలు అందించే కేంద్రం కాగా, మరొకటి విద్యాశాఖ ఆధ్వర్యంలో చిన్నారులు, పాఠశాల విద్యార్థులు, ఇంటర్ విద్యార్థుల కోసం ఏర్పాటు చేయబడింది.ఈ కేంద్రంలో కొత్త ఆధార్ నమోదు, చిరునామా సవరణ, మొబైల్ నంబర్ నమోదు, బయోమెట్రిక్ అప్‌డేట్ వంటి సేవలు అందించాల్సి ఉంటుంది.అయితే విద్యార్థుల కోసం మంజూరైన ఈ కేంద్రాన్ని అన్ని రకాల ఆధార్ సేవలకు వినియోగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.దీనివల్ల ప్రభుత్వ ఉద్దేశం పూర్తిగా దెబ్బతింటోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిర్ణీత రుసుములు ఒకటి.. వసూళ్లు మరొకటి

యూఐడీఏఐ నిబంధనల ప్రకారం చిరునామా మార్పు వంటి సేవలకు నిర్ణీత రుసుము మాత్రమే వసూలు చేయాలి.చిన్నారుల ఆధార్ నమోదు ఉచితంగా నిర్వహించాల్సి ఉంటుంది.అలాగే బయోమెట్రిక్ అప్‌డేట్, మొబైల్ నంబర్ లింక్ వంటి సేవలకు కూడా నిర్ణయించిన చార్జీలు మాత్రమే తీసుకోవాలి.కానీ కారేపల్లిలో పరిస్థితి భిన్నంగా ఉందని ప్రజలు ఆరోపిస్తున్నారు.చిన్నచిన్న మార్పులకే రూ.300నుంచి రూ.1000వరకు వసూలు చేస్తున్నారని,కొందరి నుంచి అంతకంటే ఎక్కువ మొత్తాలు కూడా తీసుకుంటున్నారని చెబుతున్నారు.ఆధార్ సేవల పేరుతో ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఒకే లాగిన్‌తో రెండు కేంద్రాలా..?

ప్రభుత్వం అధికారికంగా ఒకే కేంద్రానికి అనుమతి ఇచ్చినా, అదే సర్వర్‌ను వినియోగిస్తూ ప్రభుత్వ విద్యాసంస్థలో ఒక కేంద్రం నిర్వహిస్తూనే, పాఠశాల ఎదురుగా మరో చోట కూడా ఆధార్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఒకే లాగిన్ ఆధారంగా సేవలు అందిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఈ వ్యవహారంపై సంబంధిత శాఖ అధికారులు ఇప్పటివరకు ఎలాంటి విచారణ చేపట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

పేరు సవరణకు రూ.15 వేలా..?

ఇటీవల ఓ యువతి ఆధార్ కార్డులో తన పేరు స్థానంలో ఇతరుల వివరాలు నమోదై ఉండటంతో సవరణ కోసం అధికారిక ఆధార్ కేంద్రాన్ని ఆశ్రయించినట్లు తెలిసింది.అయితే సమస్య పరిష్కరించాలంటే రూ.15 వేల వరకు ఖర్చవుతుందని కేంద్ర నిర్వాహకుడు చెప్పినట్లు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వ్యవసాయాధారిత మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారు అంత మొత్తాన్ని చెల్లించలేక తిరిగి ఇంటికి వెళ్లినట్లు సమాచారం.సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన సేవలు కొందరి చేతుల్లో వ్యాపారంగా మారడం ఆందోళన కలిగిస్తోంది.

బాధితుల ఆరోపణలు..

పోలంపల్లి గ్రామానికి చెందిన పలువురు తమ ఆధార్ చిరునామా మార్పు కోసం రూ.500 నుంచి రూ.1,000 వరకు చెల్లించాల్సి వచ్చిందని ఆరోపిస్తున్నారు.అధికారిక రుసుములు తక్కువగా ఉన్నప్పటికీ అదనపు డబ్బులు వసూలు చేశారని చెబుతున్నారు.మార్పులు చేసిన తర్వాత పోస్టు ద్వారా ఆధార్ వస్తుందని, అధికారిక లాగిన్ ద్వారానే ప్రక్రియ పూర్తయిందని నిర్వాహకులు చెప్పడం మరిన్ని అనుమానాలకు కారణమవుతోందని స్థానికులు పేర్కొంటున్నారు.

సంబంధిత శాఖ అధికారులపర్యవేక్షణ కరువు..

ఆధార్ కేంద్రాల పనితీరుపై పర్యవేక్షణ ఉండాల్సిన సంబంధిత శాఖ అధికారులు మాత్రం ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా విద్యాశాఖ పరిధిలో నడుస్తున్న కేంద్రంపై మండల విద్యాశాఖ అధికారులు సరైన పర్యవేక్షణ చేపట్టడం లేదని కనీసానికి అటువైపుకన్నీటి కూడా చూడడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవడంలో అధికార యంత్రాంగం విఫలమవుతోందని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

కలెక్టర్ జోక్యం చేసుకోవాలంటూ విజ్ఞప్తి..

ఆధార్ సేవల పేరుతో కొత్త మాఫియా ఏర్పడి ప్రజల నుంచి వేల రూపాయలు వసూలు చేస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.ఈ వ్యవహారంపై జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు.ప్రజల హక్కులకు సంబంధించిన ఆధార్ సేవలు కొందరి చేతుల్లో దోపిడీ కేంద్రాలుగా మారకుండా అధికారులు వెంటనే స్పందించాలని మండల ప్రజలు కోరుతున్నారు.

ఈ వ్యవహారంపై ఖమ్మం జిల్లా ఈడీఎం దుర్గ ప్రసాద్‌ను వివరణ కోరగా..

కారేపల్లి మండలంలో రెండు ఆధార్ కేంద్రాలు ఉన్నాయని, అందులో ఒకటి సాధారణ కేంద్రం కాగా మరొకటి విద్యాశాఖకు సంబంధించినదని తెలిపారు. విద్యాశాఖకు సంబంధించిన కేంద్రాన్ని విద్యాశాఖ అధికారులు పర్యవేక్షించాలని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి అధిక రుసుములు వసూలు చేసినట్లు ఫిర్యాదులు వస్తే తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

మండల తహసీల్దార్ ఓరుగంటి వెంకటేశ్వర్లును వివరణ కోరగా...

ఆధార్ కేంద్రాల్లో ప్రజలకు ప్రభుత్వం నిర్ణయించిన రుసుములకే సేవలు అందించాలని తెలిపారు. అధిక మొత్తాలు వసూలు చేస్తున్నట్లు తేలితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాధితులు ఫిర్యాదు చేస్తే సంబంధిత ఆధార్ కేంద్రంపై తప్పనిసరిగా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

Next Story