- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Crude Oil: యుద్ధానికి ముందు స్థాయికి చేరిన చమురు ధరలు
అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ విరమణకు సంబంధించిన ప్రాథమిక అవగాహన ఏర్పడటం, అలాగే హోర్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణా మళ్లీ సాధారణ స్థితికి చేరుకోవడం ఇందుకు ప్రధాన కారణాలు.

దిశ, బిజినెస్ బ్యూరో: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుతున్న సంకేతాలతో అంతర్జాతీయ చమురు మార్కెట్‌లో భారీ ఊరట కనిపిస్తోంది. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 72 డాలర్ల వద్దకు పడిపోవడంతో, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు ప్రారంభం కావడానికి ముందు ఉన్న స్థాయికి తిరిగి చేరింది. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ విరమణకు సంబంధించిన ప్రాథమిక అవగాహన ఏర్పడటం, అలాగే హోర్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణా మళ్లీ సాధారణ స్థితికి చేరుకోవడం ఇందుకు ప్రధాన కారణాలు. గత 24 గంటల్లో సుమారు 20 మిలియన్ బ్యారెళ్ల చమురు ఈ మార్గం గుండా రవాణా కావడం సరఫరా ఆందోళనలు తగ్గుతున్నాయనే సంకేతాన్ని ఇచ్చింది. దీంతో చమురు ధరలు వరుసగా రెండో రోజు క్షీణించాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 72.28 డాలర్ల వద్ద, డబ్ల్యూటీఐ 69 డాలర్ల పరిధిలో ట్రేడ్ అవుతున్నాయి.
మరోవైపు, చమురు ధరలతో పాటు పసిడి ధరలు కూడా దిగొస్తున్నాయి. గత మూడు ట్రేడింగ్ సెషన్లలో ఎంసీఎక్స్‌లో బంగారం 10 గ్రాములకు దాదాపు రూ.6,000, వెండి కిలోకు రూ.15,500 వరకు పడిపోయాయి. బంగారం 12 వారాల కనిష్ట స్థాయికి చేరుకోగా, వెండిలో కూడా భారీ అమ్మకాలు నమోదయ్యాయి. అమెరికన్ డాలర్ ఏడాది గరిష్ట స్థాయికి చేరుకోవడం, ఫెడరల్ రిజర్వ్ మరిన్ని వడ్డీ రేట్ల పెంపులకు సంకేతాలు ఇవ్వడం ఈ పతనానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. అధిక వడ్డీ రేట్ల మధ్య రాబడి ఇవ్వని బంగారంపై పెట్టుబడులను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో స్వచ్ఛమైన బంగారం దాదాపు రూ. 3,630 క్షీణించి రూ. 1,44,470 వద్ద ఉంది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, హైదరాబాద్ మార్కెట్లో స్వచ్ఛమైన పసిడి 10 గ్రాములు రూ. 2,900 తగ్గి రూ. 1,41,430కి చేరగా, ఆభరాణాల్లో వాడే 22 క్యారెట్ల బంగారం పది గ్రాములు రూ. 2,750 తగ్గి రూ. 1,29,550కి పడిపోయింది. ఇదే సమయంలో వెండి కూడా రూ. 10 వేలు తగ్గి రూ. 2.30 లక్షలు దిగొచ్చింది.






