లివింగ్ రిలేషన్షిప్ తో కుటుంబాన్ని ఆదుకుందామంటే అనంత లోకాలకు

by Batti.Sumithra |

మండలానికి చెందిన బానోత్ లకుపతి (30) హత్యకు గురైన ఘటన విషాదాన్ని నింపింది.

లివింగ్ రిలేషన్షిప్ తో కుటుంబాన్ని ఆదుకుందామంటే అనంత లోకాలకు
X

దిశ, బయ్యారం : మండలానికి చెందిన బానోత్ లకుపతి (30) హత్యకు గురైన ఘటన విషాదాన్ని నింపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని వెంకట్రాంపురం పంచాయతీ పరిధిలోని శోక్లా తండ గ్రామానికి చెందిన లకుపతికి రామచంద్రాపురం గ్రామానికి చెందిన మహిళతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే కుటుంబ కలహాల కారణంగా భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి భార్య తిరిగి రాకపోవడంతో, లకుపతి గత కొన్ని సంవత్సరాలుగా జీవనోపాధి కోసం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నట్లు తెలిసింది.

ఈ క్రమంలో అతనికి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ మహిళతో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. అనంతరం ఆ మహిళతో, ఆమె తల్లితో కలిసి లివింగ్ రిలేషన్‌షిప్‌లో జీవిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. వారు మంచిర్యాల పట్టణంలోని వడ్డెర కాలనీలో నివాసం ఉంటున్నట్లు సమాచారం. ఆ మహిళకు 14 ఏళ్ల మైనర్ కుమార్తె ఉంది. కుటుంబంలో పురుషుల అండ లేకపోవడంతో, గత కొన్ని రోజులుగా ముగ్గురు యువకులు ప్రేమపేరుతో ఆ మైనర్ బాలికను, ఆమె కుటుంబాన్ని వేధిస్తున్నట్లు లకుపతికి తెలిపినట్లు సమాచారం. దీంతో లకుపతి మంచిర్యాలలోని వడ్డెర కాలనీకి వెళ్లి ఆ ముగ్గురు యువకులను మందలించడంతో పాటు వారి పై చేయి చేసుకున్నట్లు తెలిసింది. దీంతో కక్ష పెంచుకున్న ఆ ముగ్గురు యువకులు మద్యం మత్తులో లకుపతిని అడ్డుతొలగించాలని పథకం రచించి, విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేసినట్లు మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న బంధువులు గురువారం మంచిర్యాలకు చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని గురువారం స్వగ్రామానికి తరలించినట్లు తెలిపారు.

ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో వెళ్లిన లకుపతి, వారి కుటుంబ సమస్యల్లో జోక్యం చేసుకుని చివరకు ప్రాణాలు కోల్పోయాడని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో అతని భార్య, ఇద్దరు చిన్నారులు ఆధారాన్ని కోల్పోయి అనాథలుగా మారారని గ్రామస్తులు వాపోయారు. ఈ విషాద ఘటనతో శోక్లా తండ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఒంటరి జీవితాలు, సోషల్ మీడియా పరిచయాలు, ఆవేశపూరిత నిర్ణయాలు ఎంతటి దారుణ పరిణామాలకు దారితీస్తాయో ఈ ఘటన మరోసారి చర్చనీయాంశంగా మారింది.

Next Story