ఎస్సీ కాంప్లెక్స్ కేటాయింపుల్లో అక్రమాలు

by Batti.Sumithra |

కల్వకుర్తి మున్సిపాలిటీలోని ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్ దుకాణాల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని, వెంటనే వాటిని రద్దు చేసి పారదర్శకంగా అర్హులకు కేటాయించాలని కోరుతూ గురువారం దళిత నిరుద్యోగ యువత రిలే నిరాహార దీక్షకు దిగారు.

ఎస్సీ కాంప్లెక్స్ కేటాయింపుల్లో అక్రమాలు
X

దిశ, కల్వకుర్తి : కల్వకుర్తి మున్సిపాలిటీలోని ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్ దుకాణాల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని, వెంటనే వాటిని రద్దు చేసి పారదర్శకంగా అర్హులకు కేటాయించాలని కోరుతూ గురువారం దళిత నిరుద్యోగ యువత రిలే నిరాహార దీక్షకు దిగారు. పారదర్శకత లేకపోవడం, అనర్హులకు రాజకీయ సిఫార్సులతో కేటాయింపులు చేయడం వంటి కారణాల వల్ల స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. బస్టాండ్ ఎదురుగా ఉన్న ఎస్సీ కాంప్లెక్స్‌లోని 34 దుకాణాలను అర్హులైన పేద దళితులకు ఇవ్వడంలో మొండిచేయి చూపారని, నిరుపేద దళిత నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యం పూర్తిగా పక్కదారి పట్టిందని వారు మండిపడ్డారు. 2017లో జిల్లా ఐఏఎస్ అధికారి శ్రీధర్ అప్పట్లో ఎస్సీ దుకాణాల నిర్మాణం కోసం రూ.150 లక్షలు మంజూరు చేశారని, నిరుపేద దళితులకు దక్కాల్సిన ఈ దుకాణాలు నేడు స్థానిక మున్సిపల్ కౌన్సిలర్, ఒక ప్రభుత్వ ఉద్యోగి కుటుంబ సభ్యులతో పాటు ఉన్నత చదువులు చదువుతున్న వారికి, మున్సిపాలిటీ సిబ్బంది బంధువులకు సైతం కేటాయించడం విస్మయానికి గురిచేస్తోందని బాధితులు వాపోయారు.

నిబంధనలను నిలువునా ఉల్లంఘించి అనర్హులైన బడాబాబులకు అధికారులు దొడ్డిదారిన షట్టర్లు కట్టబెట్టడం సమంజసం కాదని వారు అన్నారు. రాజకీయ అండదండలు, పలుకుబడి ఉన్నవారికే దొడ్డిదారిన పెద్దపీట వేస్తూ, ఏళ్ల తరబడి ఉపాధి కోసం ఎదురుచూస్తున్న అర్హులైన దళిత అభ్యర్థులకు అధికారులు మొండిచేయి చూపారని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు జరిగిన ఈ ఘోర అన్యాయాన్ని నిరసిస్తూ అర్హులైన దళిత అభ్యర్థులు కల్వకుర్తి పట్టణంలోని ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్ ఎదుట రిలే నిరాహార దీక్షలకు దిగామని తెలిపారు. ప్లకార్డులు చేతబూని అధికారుల తీరు పై మండిపడుతూ, అర్హులైన దళిత యువతకే షట్టర్లు కేటాయించాలి, పక్షపాతం వీడాలి – ప్రతిభను గౌరవించాలి, రాజకీయ జోక్యం నశించాలి అంటూ నినాదాలు చేశారు.

తక్షణమే జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని అక్రమంగా జరిగిన ఈ కేటాయింపులను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం పై పూర్తిస్థాయిలో విచారణ జరిపి పారదర్శకంగా అర్హులకు మాత్రమే న్యాయం చేయాలని కోరారు. అనర్హుల కేటాయింపులు రద్దు చేయని పక్షంలో తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని దీక్షా శిబిరంలోని దళిత నిరుద్యోగులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నేరటి మల్లేష్, శ్రీను, శ్యాంపూరి చెన్నయ్య, పోలే శ్రీకాంత్, ఎడ్ల బాలరాజు, చిన్న, రాజు, మల్లేష్, బీఎన్ మూర్తి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Next Story