సారపాకలో వీధి కుక్కలు, కోతుల స్వైర విహారం

by Batti.Sumithra |

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం పరిధిలోని సారపాక మేజర్ గ్రామపంచాయతీలో వీధి కుక్కలు, కోతుల సంచారం మితిమీరిపోతోంది.

సారపాకలో వీధి కుక్కలు, కోతుల స్వైర విహారం
X

దిశ, ​బూర్గంపాడు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం పరిధిలోని సారపాక మేజర్ గ్రామపంచాయతీలో వీధి కుక్కలు, కోతుల సంచారం మితిమీరిపోతోంది. గ్రామంలోని వీధుల్లో ఇవి స్వైరవిహారం చేస్తుండటంతో స్థానిక ప్రజలు తీవ్రభయాందోళనలకు గురవుతున్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు,చిన్న పిల్లల పై ఇవి విచక్షణారహితంగా విరుచుకుపడుతున్నాయి.

చేతిలో కవర్ కనిపిస్తే చాలు.. దాడే !

​గ్రామస్తులు నిత్యావసరాలు, ఇతర వస్తువుల కోసం చేతిలో ఒక కవర్ పట్టుకుని బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. చేతిలో కవర్ కనిపిస్తే చాలు కుక్కలు, కోతులు ఒక్కసారిగా మనుషులపైకి ఎగబడుతున్నాయి. వాటిని బెదిరించి తరిమే క్రమంలో అవి మరింత రెచ్చిపోయి మనుషుల పై దాడులు చేస్తూ తీవ్రంగా గాయపరుస్తున్నాయి.

​గోదారమ్మ క్యాంపులో వరుస దాడులు..

​సారపాక పరిధిలోని గోదారమ్మ క్యాంపులో వీధి కుక్కల దాడి తీవ్రరూపం దాల్చింది. గత వారం రోజుల క్రితమే ఇక్కడ కుక్కల దాడిలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ ఘటన మరవకముందే, తాజాగా ఆదివారం ఉదయం కూడా ఒక మహిళపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా కరిచాయి. ఈ దాడుల్లో బాధితులకు రక్తస్రావమై తీవ్ర గాయాలవుతున్న పరిస్థితి ఉంది.​ గతంలో జరిగిన గ్రామసభలో పాలకవర్గ సభ్యులు వీధి కుక్కలు, కోతుల బెడదను నివారించేందుకు తీర్మానం చేసినప్పటికీ, ఆచరణలో మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా మేజర్ గ్రామపంచాయతీ అధికారులు, పాలకవర్గం తక్షణమే స్పందించి,గ్రామాల్లో ప్రజలకు రక్షణ కల్పించేలా వీధి కుక్కలు, కోతుల బెడద నుండి శాశ్వత విముక్తి కలిగించాలని బాధితులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story