- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కలెక్టర్ మేడం గారు.. మాకు బడి కావాలి! ఆ జిల్లాలో గిరిజన విద్యార్థుల వినూత్న నిరసన
‘కలెక్టర్ మేడం గారు.. మాకు స్కూల్ కావాలి’ అంటూ ఆ గిరిజన గూడేల చిన్నారులు చేసిన వినూత్న నిరసన అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: ‘కలెక్టర్ మేడం గారు.. మాకు స్కూల్ కావాలి’ అంటూ ఆ గిరిజన గూడేల చిన్నారులు చేసిన వినూత్న నిరసన అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. చదువుకోవాలనే తపన ఉన్నా, ఊళ్లో బడి లేక.. కిలోమీటర్ల మేర నడవలేక పడుతున్న అవస్థలను ‘యోగాసనాల’ ద్వారా అధికారులకు, ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నం చేశారు. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలో జరిగిన ఈ వినూత్న ఆందోళనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
60 మంది పిల్లలు.. కానీ ఒక్క బడీ లేదు!
రోలుగుంట మండలం ఆర్ల పంచాయతీ పరిధిలోని లోసింగి రెవెన్యూ గ్రామంలో.. కొత్త లోసింగి, పాత లోసింగి, పెదగరువు, పిత్రి గడ్డ తదితర కొండ శిఖర గ్రామాల్లో ఆదివాసీ గిరిజనులు నివసిస్తున్నారు. ఈ గ్రామాల్లో సుమారు 312 మంది జనాభా జీవనం సాగిస్తుండగా.. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు చదువుకునే వయసున్న పిల్లలు 60 మంది ఉన్నారని, కానీ, వీరికి విద్యాబుద్ధులు నేర్పేందుకు ఆ గ్రామాల్లో ఒక్క పాఠశాల కూడా లేదని స్థానికుల సమాచారం.
ప్రాథమిక వసతుల లేమితో గిరిజనుల అవస్థలు
స్థానికుల సమాచారం ప్రకారం.. గ్రామాల్లో కనీస సదుపాయాలు లేకపోవడంతో ఆదివాసీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడి చిన్నారులు చదువుకోవాలంటే కిలోమీటర్ల కొద్దీ నడవాల్సిన పరిస్థితి. సమీపంలో ఉన్న వై.బి.పట్నం స్కూల్‌కు వెళ్లాలంటే సుమారు 3 నుంచి 8 కిలోమీటర్లు ప్రయాణించక తప్పడం లేదు. బాలింతలు, గర్భిణీలు, పసిపిల్లలకు పౌష్టికాహారం అందించే అంగన్వాడీ కేంద్రం కూడా ఈ గ్రామాలకు సుదూరంలోనే ఉంది. సుమారు 13 నుంచి 15 కిలోమీటర్ల దూరంలోని రాజన్నపేట గ్రామానికి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. అత్యవసర సమయాల్లో గర్భిణీలు, బాలింతలను నేటికీ డోలీల్లోనే మోసుకెళ్తున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
యోగాసనాలతో నిరసన
గత ఏడాదిగా బడి, అంగన్వాడీ కేంద్రం లేక తాము పడుతున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు చిన్నారులు ‘యోగాంధ్ర’ ద్వారా వినూత్నంగా ఆందోళన చేపట్టారు. ‘కలెక్టర్ మేడం గారు.. మాకు స్కూల్ కావాలి’ అంటూ నినాదాలు చేస్తూ పలు రకాల యోగాసనాలు వేశారు. తమ గ్రామానికి అంగన్వాడీ కేంద్రం, పాఠశాల మంజూరు చేయాలని ఈ సందర్భంగా చిన్నారులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
విద్యార్థుల ఆవేదన:
‘‘గత ఏడాది నుంచి మా ఊళ్లో స్కూల్, అంగన్వాడీ కేంద్రం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. బడికి వెళ్లాలంటే 8 కిలోమీటర్లు, అంగన్వాడీ కోసం 15 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తోంది. అధికారులు స్పందించి వెంటనే మా గ్రామాల్లో పాఠశాలను ఏర్పాటు చేయాలి’’ - నిరసనలో పాల్గొన్న ఓ విద్యార్థి






