రేపటి నుంచే స్కూళ్లు రీ ఓపెన్.. వెంటాడుతున్న ‘అమావాస్య’ భయం

by Kema Shiva Kumar |   (  Updated:2026-06-14 12:25:31  IST  )

తెలంగాణలో ఎండల తీవ్రత వల్ల పొడిగించిన వేసవి సెలవులు ముగియడంతో రేపటి నుంచి పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి.

రేపటి నుంచే స్కూళ్లు రీ ఓపెన్.. వెంటాడుతున్న ‘అమావాస్య’ భయం
X

దిశ, వెబ్‌డెస్క్: వేసవి సెలవుల అనంతరం తెలంగాణ (Telangana)లో రేపటి నుంచి పాఠశాలలు తెరచుకోనున్నాయి. సాధారణంగా షెడ్యూల్ ప్రకారం జూన్ 12 వరకే సమ్మర్ హాలిడేస్ ముగియాల్సి ఉండగా.. రాష్ట్రంలో ఎండల తీవ్రత దృష్ట్యా విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సర్కార్ సెలవులను జూన్ 14 వరకు పొడిగించింది. దీంతో సోమవారం నుంచి అంటే రేపటి నుంచి విద్యార్థులు తిరిగి బడిబాట పట్టనున్నారు. అయితే, మొదటి రోజే స్కూళ్లకు పిల్లలను పంపే విషయంలో కొందరు తల్లిదండ్రులు భయపడుతున్నారు. అందుకు కారణం రేపు సోమవారం అమావాస్య కావడమేనని తెలుస్తోంది. జ్యోతిష్య నియామాలు, నమ్మకాల ప్రకారం అమావాస్య రోజున కొత్త పనులు, చదువులు ప్రారంభించడం మంచిది కాదని కొందరు భావిస్తున్నారు. ఇక అమావాస్య కాదని మరుసటి రోజు పంపుదామంటే.. అది మంగళవారం అవుతుంది. ఈ సెంటిమెంట్ల కారణంగా సోమ, మంగళవారాల్లో పిల్లల్ని స్కూళ్లకు పంపకుండా.. నేరుగా బుధవారం నుంచి పంపాలని చాలామంది తల్లిదండ్రులు ఫిక్స్ అయ్యారు.

సర్వంసిద్ధం చేసిన విద్యాశాఖ..

మరోవైపు తల్లిదండ్రులు పిల్లలను సెంటిమెంట్‌తో బడికి పంపేందుకు వెనుకడుగు వేస్తుంటే.. విద్యాశాఖ మాత్రం స్కూళ్ల పున:ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు రేపటి నుంచి యథావిధిగా నడవనున్నాయి. కొత్త విద్యా సంవత్సరానికి స్వాగతం పలుకుతూ విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలు, మౌలిక వసతులను సిద్ధం చేశారు. ఎండల తీవ్రత ఇంకా పూర్తిగా తగ్గకపోవడంతో పాఠశాలల్లో తాగునీరు, ఓఆర్ఎస్ (ORS) ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని అధికారులు యాజమాన్యాలకు సూచించారు.

Next Story