ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సేవలు అభినందనీయం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

by Kodari Anjali |

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సేవలు అభినందనీయమని తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అన్నారు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సేవలు అభినందనీయం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
X

దిశ, దమ్మాయిగూడ: తలసేమియా, క్యాన్సర్ వంటి రోగులకు అత్యవసర సమయాల్లో రక్తాన్ని అందుబాటులో ఉంచుతూ ఎలాంటి లాభాలను ఆశించకుండా మానవత్వమే ధ్యేయంగా పనిచేస్తున్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సేవలు అభినందనీయమని తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అన్నారు. ఆదివారం ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా లోక్ భవన్‌లోని సంస్కృతి కమ్యూనిటీ హాల్‌లో భారత రెడ్‌క్రాస్ సొసైటీ, తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని గవర్నర్ ప్రారంభించారు. అనంత‌రం విశిష్ట సేవలందించిన వైద్యులు, అత్యధిక సార్లు రక్తదానం చేసిన దాతలు, రక్తదాన శిబిరాల నిర్వాహకులు, అలాగే కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద భారత రెడ్‌క్రాస్ సొసైటీ తెలంగాణ శాఖకు విశేష సహకారం అందించిన సంస్థల ప్రతినిధులను గవర్నర్ సత్కరించి పురస్కారాలు అందజేశారు. రక్తదానం పట్ల సమాజంలో చైతన్యం కలిగిస్తూ, స్వచ్ఛంద రక్తదానాన్ని ప్రోత్సహిస్తూ విశిష్ట సేవలందించిన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా రెడ్ క్రాస్ శాఖ చైర్మన్, ప్రొహిబిష‌న్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ఓఎస్డీ డా. ఎస్.ఎం. రాజేశ్వర్ రావును తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సత్కరించి పురస్కారాలు అందజేశారు.

క్యాన్సర్ రోగులకు ఎంతో ఉపయోగపదుతుంది..

స్వచ్ఛంద రక్తదానోద్యమంలో ప్రజలను భాగస్వాములను చేయడంలో, అవగాహన కల్పించడంలో డా. రాజేశ్వర్ రావు చేస్తున్న కృషికి గాను, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ శాఖ ఆయనను "హయ్యెస్ట్ బ్లడ్ డోనర్ మోటివేటర్ అవార్డు–2026"కు ఎంపిక చేసిందన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ చేతుల మీదుగా ఆయన అవార్డును స్వీకరించారు. డా. రాజేశ్వర్ రావు నాయకత్వంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా రెడ్ క్రాస్ శాఖ చేపట్టిన సేవా కార్యక్రమాలు పలువురి ప్రశంసలు అందుకుంటున్నాయన్నారు . 2023 మార్చి నుంచి 2026 మే వరకు 113 రక్తదాన శిబిరాలను నిర్వహించి 8,279 యూనిట్ల రక్తాన్ని సేకరించగా, ఆ రక్తం తలసేమియా, క్యాన్సర్ రోగులకు ఎంతో ఉపయోగపదుతుందన్నారు. అలాగే 467 ఉచిత వైద్య శిబిరాల ద్వారా 24,142 మందికి పైగా వృద్ధులు, దివ్యాంగులు, గిరిజన ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు అందించారు.

వరద బాధితులకు సహాయక చర్యలు...

అత్యవసర సమయాల్లో ప్రాణాలను కాపాడేందుకు 20 సీపీఆర్, ఫస్ట్ ఎయిడ్ శిక్షణ కార్యక్రమాల ద్వారా 1,865 మందికి శిక్షణ కల్పించారు. శామీర్‌పేటలో వృద్ధుల కోసం ‘ప్రణామ్’ డే కేర్ సెంటర్, బోయిన్‌పల్లిలో మిస్రీలాల్ మంగీలాల్ మాతా-శిశు ఆసుపత్రిని నిర్వహిస్తూ పేద కుటుంబాలకు ఆరోగ్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. వీటితో పాటు టీబీ ముక్త్ అభియాన్, ఆయుష్మాన్ భారత్ పథకం నమోదు, వరద బాధితులకు సహాయక చర్యలు, యువ రెడ్ క్రాస్ వంటి అనేక సామాజిక సేవా కార్యక్రమాలను ఆయన సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దాన కిషోర్, శాంతిభద్రతల విభాగం డైరెక్టర్ జనరల్ మహేష్ భగవత్, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ తెలంగాణ శాఖ ప్రధాన కార్యదర్శి అండ్ సీఈఓ ప్రొఫెసర్ శ్రీరాములు, ట్రెజరర్ శ్రీనివాస్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి శశికిరణాచారి, లార్వెన్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ వరుణ్ విహార్, సీఈఓ రమణయ్య, తదితరులు పాల్గొన్నారు.

Next Story