- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sabarimala Temple: శబరిమల గోల్డ్ స్కామ్.. తుది దశకు చేరిన ‘సిట్’ దర్యాప్తు
కేరళ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పత్తనంతిట్టలోని శబరిమల శ్రీ ధర్మశాస్త్ర ఆలయంలో జరిగిన గోల్డ్ స్కామ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఆదివారం మరో దఫా తనిఖీలు చేపట్టింది.

దిశ, డైనమిక్ బ్యూరో: కేరళ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పత్తనంతిట్టలోని శబరిమల శ్రీ ధర్మశాస్త్ర ఆలయంలో జరిగిన గోల్డ్ స్కామ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఆదివారం మరో దఫా తనిఖీలు చేపట్టింది. ఛార్జిషీట్ దాఖలు చేయడానికి ముందు జరుగుతున్న ఈ తుది దశ తనిఖీల్లో భాగంగా, శాస్త్రీయ విశ్లేషణ కోసం ఆలయ ఆభరణాలు, లోహపు వస్తువులను సిట్ పరిశీలిస్తోంది.
హైకోర్టు అనుమతి.. శాస్త్రీయ నివేదికలు
ఆలయంలోని ప్రభామండలం ప్లేట్లు, పైభాగంలోని ద్వారపు ఫ్రేమ్‌లను విప్పదీసి నమూనాలు సేకరించేందుకు కేరళ హైకోర్టు జూన్ 8న సిట్‌కు అనుమతి ఇచ్చింది. వాస్తవాలను నిర్ధారించడానికి, వాటి తయారీలో ఎంత మేర బంగారం వాడారో కచ్చితంగా తేల్చడానికి ఈ చర్య తప్పనిసరి అని కోర్టు అంగీకరించింది. గతంలో ఆలయ స్తంభాలు, ఇతర భాగాల నుంచి సేకరించిన 36 నమూనాలను జంషెడ్‌పూర్‌లోని నేషనల్ మెటలర్జికల్ లాబొరేటరీ (NML), విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC)లకు పంపారు. ఈ సంస్థలు ఇచ్చిన నివేదికల ఆధారంగా ఈ స్కామ్ ఎలా జరిగిందనే దానిపై సిట్‌కు పూర్తి స్పష్టత వచ్చింది.
ముగింపు దశలో విచారణ
2025 లో ద్వారపాలకుల విగ్రహాల తొలగింపు వ్యవహారంపై దర్యాప్తు దాదాపు పూర్తయిందని, త్వరలోనే తుది నివేదిక (ఛార్జిషీట్) దాఖలు చేస్తామని సిట్ కోర్టుకు స్పష్టం చేసింది. ఈ కేసులో తదుపరి పరిణామాలు, ఇందులో ప్రమేయం ఉన్న వారి నేరాల నిర్ధారణ పై సమీక్ష జరిపేందుకు హైకోర్టు తదుపరి విచారణను జూన్ 18వ తేదీకి వాయిదా వేసింది.






