- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంట్రాక్టర్ కోసమా తవ్వకాలు..?
నార్సింగి సర్కిల్ పరిధిలోని నెక్నాపూర్ డివిజన్ అల్కాపూర్ టౌన్‌షిప్‌లో రోడ్ నెంబర్-30లో చేపడుతున్న రోడ్డు తవ్వకాలపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ, గండిపేట: నార్సింగి సర్కిల్ పరిధిలోని నెక్నాపూర్ డివిజన్ అల్కాపూర్ టౌన్‌షిప్‌లో రోడ్ నెంబర్-30లో చేపడుతున్న రోడ్డు తవ్వకాలపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షపు నీటి పారుదల పేరుతో మూడు అడుగుల వ్యాసం గల పైప్‌లైన్ ఏర్పాటు కోసం రోడ్డును తవ్వివేయడాన్ని వెంటనే నిలిపివేయాలని, లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో వర్షపు నీరు సజావుగా వెళ్లేందుకు తగిన డ్రైనేజీ వ్యవస్థ అందుబాటులో ఉండగా, కొత్తగా పైప్‌లైన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమిటో అధికారులు ప్రజలకు స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. కాంట్రాక్టర్ కోసమా ఈ తవ్వకాలు అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రోడ్డు తవ్వకాలు ప్రారంభించి చాలా రోజులు గడిచినా పనులు పూర్తికాకపోవడంతో పాటు తవ్విన మట్టిని రహదారి పక్కనే కుప్పలుగా వదిలేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనదారులు, పాదచారులు రాకపోకల్లో ఇబ్బందులు పడుతుండగా, వర్షాల కారణంగా పరిస్థితి మరింత దారుణంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం నిర్మిస్తున్న పైప్‌లైన్ ప్రజల అవసరాల కోసమా, లేక కొందరు పెద్ద వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వర్గాల ప్రయోజనాల కోసమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని స్థానికులు పేర్కొన్నారు. ప్రజలకు ఉపయోగపడుతున్న మౌలిక వసతులను ధ్వంసం చేసి కొందరి ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకోవడం సమంజసం కాదని విమర్శించారు. ప్రజలు చెల్లిస్తున్న పన్నులు దుర్వినియోగం అవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల అడ్డగోలు నిర్ణయాలు సరికాదు అంటూ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఆదివారం స్థానికులు తవ్విన రహదారి వద్ద నిరసన చేపట్టి తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. రోడ్డు తవ్వకాలను తక్షణమే నిలిపివేయడంతో పాటు, దెబ్బతిన్న రహదారిని యథాస్థితికి తీసుకువచ్చి ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు వెంటనే స్పందించి ప్రజల సందేహాలను నివృత్తి చేయకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.






