- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ పాఠశాలల మూసివేత విద్యా హక్కులకు విఘాతం:ఎంపీ ఆర్.కృష్ణయ్య
రాష్ట్రంలో 27 వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకు తగ్గించి, 23 వేల పాఠశాలలను మూసివేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.

దిశ, హిమాయత్‌నగర్: రాష్ట్రంలో 27 వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకు తగ్గించి, 23 వేల పాఠశాలలను మూసివేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆదివారం బషీర్ బాగ్ దేశోద్ధారక భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం అనాలోచిత చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. ఎన్నో పోరాటాల ఫలితాల వల్ల పాఠశాలలు నెలకొల్పారని గుర్తు చేశారు. కార్పొరేట్ స్కూళ్లకు న్యాయం చేసేందుకే పాఠశాలల రద్దు యోచన అని ఆరోపించారు. ఆ ఆలోచన మానకుంటే రాష్ట్రంలో యుద్ధమే కొనసాగుతుందని హెచ్చరించారు.
విద్య, వైద్యం ద్వారానే సమాజ మార్పు అని, విద్యారంగాన్ని నిర్వీరం చేస్తే సహించేది లేదన్నారు. జూలై 1 నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలను రాష్ట్ర వ్యాప్తంగా తిరగనివ్వమని హెచ్చరించారు. ఒకవైపు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటూ పాఠశాలను రద్దు చేయడం సిగ్గుచేటని అన్నారు. పాఠశాలల భూములను అమ్ముకోవడానికే సీఎం స్కూళ్ల రద్దు యోచన చేస్తున్నాడని మండిపడ్డారు. రాష్ట్రంలో విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు చెల్లించకపోవడంతో పాటు 30 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు.
పాఠశాలల మూసివేత వల్ల డ్రాప్‌ఔట్ రేటు పెరిగి పేద విద్యార్థులు చదువులకు దూరమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సింది పోయి వాటిని నిర్వీర్యం చేసి ప్రైవేట్ విద్యాసంస్థలకు లాభం చేకూర్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే భారీ ప్రజా ఉద్యమం చేపడతామని, కాంగ్రెస్ పార్టీ రాజకీయ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర బీసీ యువజన సంఘం అధ్యక్షుడు జిల్లపల్లి అంజి, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పర్లగోర్ల మోడీ రాందేవ్, రాష్ట్ర ఐక్య వేదిక అధ్యక్షుడు అనంతయ్య, బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్, డా.కప్పుల అన్వేష్, పరిపూర్ణ చారి, డా.రాజీవ్ పాల్గొన్నారు.






