- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎల్లాపురంలో చేపల కోసం చెరువులో నీరు ఖాళీ.. ఆందోళనలో రైతులు
సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని ఎల్లాపురం గ్రామంలో చేపల వేట కోసం గ్రామ చెరువులోని నీటిని ఖాళీ చేస్తున్న ఘటన స్థానిక రైతుల్లో తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

దిశ, నేరేడుచర్ల(పాలకవీడు): సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని ఎల్లాపురం గ్రామంలో చేపల వేట కోసం గ్రామ చెరువులోని నీటిని ఖాళీ చేస్తున్న ఘటన స్థానిక రైతుల్లో తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గ్రామ మత్స్య సొసైటీ సభ్యులు నిబంధనలకు విరుద్ధంగా చెరువు తూము తెరిచి నీటిని వదులుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కళ్లెదుటే చెరువు నీరు వృథాగా పారిపోతున్నప్పటికీ సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఎల్ నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతం తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో చెరువులోని నీరు పూర్తిగా ఖాళీ చేయడం భవిష్యత్తులో గ్రామంలో భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చెరువులు నిండుగా ఉండటం వల్లే బోర్లు, బావులు నీటిమట్టం నిలకడగా ఉంటాయని, ఇప్పుడు నీటిని పూర్తిగా వదిలేస్తే వేసవికాలంలో తాగునీరు, సాగునీటి సమస్యలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు. చేపల వేట పేరుతో చెరువు నీటిని నిర్లక్ష్యంగా వదిలేయడం వల్ల పంటలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తోంది. తక్షణమే అధికారులు జోక్యం చేసుకొని చెరువు తూము తెరిచిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు నీటి విడుదలను వెంటనే నిలిపివేయాలని గ్రామస్థులు, రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇరిగేషన్ జెఈ సతీష్ రైతుల నుంచి ఫిర్యాదు అందిందని మూడు రోజుల క్రితమే పాలకవీడు పోలీస్ స్టేషన్ లో ఇలా నీటిని వదులుతున్నారని ఫిర్యాదు చేశామన్నారు. వెంటనే తూములను మూసివేస్తామన్నారు. పోలీసులు కూడా విచారణ చేసి తూములు తెరిచే వ్యక్తులను గుర్తించాలన్నారు.






