చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలా? వాటిని పోగొట్టే సీక్రెట్స్ ఇవిగో..!

by Javid Pasha |

పోషకాహారం ఎంత తీసుకున్నా, ఎన్ని బ్యూటీ టిప్స్ పాటించినా శారీరక శ్రమ లేకపోతే.. వృద్ధాప్య ఛాయలు త్వరగా సంభవిస్తాయి.

చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలా? వాటిని పోగొట్టే సీక్రెట్స్ ఇవిగో..!
X

దిశ, ఫీచర్స్ : ఏజ్ పెరిగే కొద్దీ శరీరంలో మార్పులు రావడం సహజం. కానీ ఇటీవల చాలా మంది చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలకు సంబంధించిన శారీరక లక్షణాలను ఎదుర్కొంటున్నారు. 30 ఏండ్లలోనే ముఖంపై ముడతలు, నుదుటిపై గీతలు, జుట్టు రాలడం, బట్టతల రావడం, పొట్ట పెరగడం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఎందుకిలా? ఈ ఎర్లీ ఏజింగ్ లక్షణాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.

ఆహార నియమాలు ముఖ్యం..

సాధారణంగా ఉన్న వయసుకంటే అధిక వయసు గల వ్యక్తుల్లా కనిపించే శారీరక మార్పులు సంభవించడానికి ఆహారపు అలవాట్లు కూడా కారణమని నిపుణులు అంటున్నారు. హెల్తీ ఫుడ్స్ కాకుండా జంక్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ వంటివి ఎక్కువగా తినేవారిలో యవ్వన ఛాయలు త్వరగా కనుమరుగవుతాయని చెబుతున్నారు. అలా జరగకూడదంటే పోషకాలతో కూడిన సమతుల్య ఆహార నియమాలు(A balanced diet) పాటించాలని సూచిస్తున్నారు. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి కాబట్టి, తాజా కూరగాయలు, గింజలు, బెర్రీలు, ఆకు కూరలు, లీన్ ప్రొటీన్లు, చేపలు, పరిమిత స్థాయిలో మాంసాహారం వంటివి ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిలో ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి గనుక వయసుకంటే ముందే వృద్ధాప్య ఛాయలు రాకుండా అడ్డుకుంటాయి. ముఖ్యంగా అధిక చక్కెరలు కలిగిన ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ నివారించాలి.

నీళ్లు ఎక్కువ తాగాలి

ఏజింగ్ లక్షణాలు త్వరగా రావడానికి గల కారణాల్లో నీరు తక్కువ తాగడం కూడా ఒకటి. కొందరు కేవలం తిన్నప్పుడు మాత్రమే తాగుతుంటారు. ఆ తర్వాత మధ్య మధ్యలో నీళ్లు తాగరు. దీంతో శరీరంలో నీటిశాతం తగ్గి డ్రైగా మారుతుంది. విష పదార్థాలు బయటకు పంపడంలో నీరు చాలా ముఖ్యం. తక్కువ నీరు తాగడంవల్ల శరీరంలో జీవక్రియలు నెమ్మదిస్తాయి. ఫలితంగా చిన్న వయసులో వృద్ధాప్యాన్ని సూచించేలా శరీర ఆకృతికి కారణం అవుతాయి. అలా జరగకూడదంటే ప్రతిరోజూ సరిపడా నీళ్లు తాగాలి. 8 నుంచి 10 గ్లాసులు తాగడం ఆరోగ్య దాయకమని నిపుణులు సూచిస్తున్నారు.

ఫిజికల్ యాక్టివిటీస్

పోషకాహారం ఎంత తీసుకున్నా, ఎన్ని బ్యూటీ టిప్స్ పాటించినా శారీరక శ్రమ లేకపోతే.. క్రమంగా వృద్ధాప్య ఛాయలకు దారితీస్తుంది. దీంతో శరీరంలో ప్రతికూల మార్పులు సంభవిస్తుంటాయి. తగిన ఆహార నియమాలు పాటిస్తూ, రోజూ వ్యాయామాలు లేదా తిన్న ఆహారాన్ని బర్న్ చేయగలిగే విధంగా ఏదో ఒక శారీరక శ్రమ కలిగి ఉండటంవల్ల బాడీలో వృద్ధాప్య ఛాయలకు సంబంధించిన మార్పులు రాకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. పైగా ఈ అలవాట్లతో ఎక్కువ కాలం యవ్వనంగా కనిపిస్తారు. దీంతోపాటు వాకింగ్, జాగింగ్, ఏరోబిక్స్ ఇలా ఎక్సైర్ సైజ్‌లు ఏవైనా సరే శరీరంలో రక్త ప్రసరణను మెరుగు పరుస్తాయి. స్ట్రెస్ హార్మోన్లు తగ్గితాయి. వృద్ధాప్య ఛాయలను నెమ్మదింపజేస్తాయి.

నాణ్యమైన నిద్ర

వృద్ధాప్య ఛాయలు త్వరగా రావడానికి మరో ప్రధాన కారణం నిద్రలేమి. నాణ్యమైన నిద్రలేకపోవడం కూడా మీలోని యవ్వనాన్ని దూరం చేస్తుంది. వృద్ధాప్య ఛాయలకు కారణం అవుతుంది. నిజానికి నిద్ర అనేది మనిషికి చాలా ముఖ్యం. ఎందుకంటే.. ఈ సమయంలో శరీరం కణాలను రిపేర్ చేస్తుంది. జీవక్రియలను సమతుల్యం చేస్తుంది. స్కిన్ రీజనరేట్ అవుతుంది. దీంతో చర్మంలో నిగారింపు పెరుగుతుంది. ముఖంపై ముడతలు రాకుండా ఉంటాయి. స్ట్రెస్, యాంగ్జైటీస్ వంటివి దూరం అవుతాయి. మొత్తానికి యాంటీ ఏజింగ్ ప్రాసెస్‌లో నాణ్యమైన నిద్ర కీ రోల్ పోషిస్తుందని నిపుణులు అంటున్నారు.

ఒత్తిడి నిర్వహణ

మానసిక ఒత్తిడి కూడా.. వృద్ధాప్య లక్షణాలను వేగవంతం చేసే ప్రధాన శత్రువు అంటారు ఆరోగ్య నిపుణులు. ఎక్కువ రోజులు ఈ సమస్యను ఎదుర్కొనే వారి శరీరంలో యవ్వన ఛాయలు త్వరగా కనుమరుగవుతాయి. చిన్న వయసులోనే పెద్ద వయసు వ్యక్తుల్లా కనిపిస్తారు. ఇలా జరగకూడదంటే ఒత్తిడిని దూరం చేసుకోవాలి. అలాగనీ పూర్తిగా ఒత్తిడిలేని జీవితం ఉండదు. కాకపోతే మీరు ఒత్తిడిని ఎలా మేనేజ్ చేస్తున్నారనేది కూడా ఇక్కడ కీలకం. ప్రతీది ఒత్తిడిగానే ఫీలయ్యే అతి ఆలోచనా ధోరణిని కూడా మానసిక ఒత్తిడిగానే నిపుణులు పేర్కొంటున్నారు. ఇది వృద్ధాప్యానికి దగ్గర చేస్తుంది. కాబట్టి మీలో ఆ లక్షణాలు కనిపిస్తే వెంటనే దూరం చేసుకునే ప్రయత్నం చేయండి అంటున్నారు నిపుణులు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story