ట్రెండ్‌గా మారిన సర్పంచులు.. ప్రభుత్వ బడి బాటలో వినూత్న ప్రచారం!

by Jakkula.Mamatha |

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు పెంచేందుకు సర్పంచులు వినూత్న ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు.

ట్రెండ్‌గా మారిన సర్పంచులు.. ప్రభుత్వ బడి బాటలో వినూత్న ప్రచారం!
X

దిశ, ఆత్మకూరు(ఎం): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు పెంచేందుకు సర్పంచులు వినూత్న ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన "బడిబాట" కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ బడుల ప్రాధాన్యతను వివరిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా సదుపాయాలు కల్పిస్తామని, విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడతామని హామీలు ఇస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలంలోని రాఘవాపురం సర్పంచ్ ఎరుకల యతీశ్వర్ గౌడ్ విడుదల చేసిన ప్రకటన ప్రస్తుతం గ్రామాల్లో చర్చనీయాంశంగా మారింది. "నా ఊరు – నా బడి" నినాదంతో ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు.

విద్యార్థులకు పాఠశాల అనంతరం ప్రత్యేక ట్యూషన్లు, ప్రతి 15 రోజులకు ఒకసారి పేరెంట్స్ మీటింగ్‌లు, డిజిటల్ ప్రొజెక్టర్ క్లాసులు, నాణ్యమైన స్టడీ మెటీరియల్, ఆట వస్తువులు, రవాణా సౌకర్యం, విహారయాత్రలు, సైన్స్ ఫెయిర్లు, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ నైపుణ్యాల అభివృద్ధి వంటి కార్యక్రమాలను చేపడతామని ప్రకటించారు. ప్రస్తుతం ప్రైవేటు పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్న తల్లిదండ్రులను ప్రభుత్వ బడుల వైపు ఆకర్షించేందుకు సర్పంచులు చేస్తున్న ఈ వినూత్న ప్రచారం గ్రామీణ ప్రాంతాల్లో కొత్త చర్చకు దారితీస్తోంది. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రజాప్రతినిధులు ముందుకు రావడం విద్యారంగంలో సానుకూల పరిణామంగా పలువురు అభిప్రాయపడుతున్నారు. బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సర్పంచులు స్వయంగా రంగంలోకి దిగడం విశేషంగా మారింది.

Next Story