- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మోడీ జీ..! జర సునియే జీ..!
ప్రధాని మోడీ తెలంగాణపై ఫోకస్ చేయాలని కోరుతూ.. రాష్ట్ర బీజేపీ పరిస్థితిపై సామాన్య కార్యకర్తలు ఆవేదన మీద ప్రత్యేక కథనం

దిశ, తెలంగాణ బ్యూరో: దేశ వ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హవా కొనసాగుతున్నది. జాతీయ రాజకీయాల్లో ప్రస్తుతం ఆయనకు ప్రత్యామ్నాయం లేని పరిస్థితులు నెలకొన్నాయి. అత్యంత కీలకమైన పశ్చిమ బెంగాల్‌లో సైతం ఇటీవల కమలం పార్టీని విజయ పథం వైపు నడిపించడంలో మోడీ-షా టీం సక్సెస్ అయింది. అంతకంటే ముందు బిహార్, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, అస్సాం సహా పశ్చిమ, ఉత్తర, ఈశాన్యం వైపుల్లో ఉన్న పలు రాష్ట్రాల్లో పార్టీని అధికార పీఠంపై కూర్చోపెట్టారు. ఈ నేపథ్యంలో దక్షణాది రాష్ట్రాలపై ఫోకస్ పెట్టడంలో భాగంగా ప్రధాని మోడీ నేడు హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా బీజేపీ గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు రాష్ట్ర పార్టీలో నెలకొన్న పరిస్థితులను చూసి ఆవేదన చెందుతున్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీ జెండా రేపరెపలాడుతుంటే, రాష్ట్రంలో మాత్రం రోజురోజుకు చతికిల పడుతోందని ఆందోళన చెందుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావాలంటే ముందుగా స్థానిక పార్టీ నాయకుల మధ్య కొనసాగుతున్న విబేధాలు, ఇగోలకు చెక్ పెట్టాలని కోరుతున్నారు.
వర్గపోరుతో సతమతం..
ఇతర పార్టీల్లాగా కాకుండా బీజేపీలో వర్గపోరును ఏ మాత్రం సహించరు. అయినా తెలంగాణ పార్టీలో ఇదొక జాఢ్యంలా తయారైందని, పార్టీ మనుగడకే ప్రమాదకరంగా మారిందని క్రింది స్థాయి కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. రాష్ట్ర బీజేపీలో ఐదారు గ్రూపులు ఉన్నాయి. ఒక్కో గ్రూపునకు ఒక్కో సీనియర్ లీడర్ నాయకుడుగా వ్యవహరిస్తున్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి టీంతో ఒక గ్రూపు, బండి సంజయ్ వర్గంగా మరో గ్రూపు, ఎంపీ ఈటల రాజేందర్ నాయకత్వంలో మరొక గ్రూపు, ఇంకా మరో రెండు గ్రూపులు ఇతర నేతల ఆధ్వర్యంలో ఉన్నట్లు కార్యకర్తలు చెబుతున్నారు. ఈ గ్రూపుల్లో దేనితోనూ పొసగక కొందరు ఎంపీలు ఎవరికి వారే అన్నట్లుగా స్వతంత్రంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో పార్టీలో నాయకుల మధ్య ఐక్యత కొరవడిందని కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు.
నాయకుల మధ్య భిన్నాభిప్రాయాలు..
పార్టీలో నాయకుల మధ్య ఐక్యత లేదని, ఒకే అంశంపై ఏ ఇద్దరు లీడర్ల మధ్య ఏకాభిప్రాయం ఉండదని విమర్శలు ఉన్నాయి. దీనితో చాలా సార్లు కింది స్థాయి లీడర్లు, కార్యకర్తలు పార్టీ లైన్ ఏంటో తెలియక అయోమయంలో పడ్డ పరిస్థితులు ఉన్నట్లు టాక్ ఉంది. ప్రజలకు సంబంధించిన సమస్యలపై కీలకమైన లీడర్లు ఒకే వేదిక మీదికి వచ్చి ప్రభుత్వాన్ని ఎటాక్ చేసిన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తు చేస్తున్నారు. అందుకు ఉదాహరణంగా బిల్డ్ పాలసీపై కొందరు ఎంపీలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తే, మరికొందరు ఎంపీలు మాత్రం వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆ పాలసీని స్వాగతించారని చెపుతున్నారు. దీనితో కార్యకర్తల్లో ఆయోమయ పరిస్థితులు నెలకొన్నట్లు చెప్తున్నారు.
పార్టీ చీఫ్‌కు సహాయ నిరాకరణ..
సీనియర్ నేతల నుంచి పార్టీ అధ్యక్షుడు రామచందర్‌రావుకు సహాయ నిరాకరణ కొనసాగుతున్నట్లు తెలిసింది. పైకి అధ్యక్షుడి పట్ల గౌరవం చూపించే నాయకులు లోన మాత్రం ఆయన పిలుపు ఇచ్చే కార్యక్రమాలను సీరియస్‌గా తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఈ విషయంలో మౌనంగా ఉంటూనే, సమయం, సందర్భం చూసుకుని రామచందర్‌రావు కీలక నేతలకు షాక్ ఇచ్చినట్లు టాక్ ఉంది. పార్టీ కమిటీల నియామకం విషయంలో అధ్యక్షుడు సీనియర్ నేతల సూచనలు పట్టించుకోలేదన్న చర్చ జరుగుతున్నది. ప్రధానంగా సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ కు చెందిన కొందరు నాయకులను కమిటీల్లోకి తీసుకున్నారు. కాని ఆ లీడర్లను కమిటీలోకి తీసుకోవాలంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించలేదని తెలిసింది. అయితే కేంద్ర మంత్రికి ఇష్టం లేని వ్యక్తులకు ప్రయారిటీ ఇచ్చి, రాంచందర్ రావు తన సత్తా ఏంటో పరోక్షంగా చూపించినట్లు కార్యకర్తల్లో చర్చ జరుగుతున్నది.
మాకేం అవసరం?
ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, ప్రజల సమస్యలపై ఆందోళనలు, నిరసనలకు పార్టీ అధ్యక్షుడి హోదాలో రాంచందర్‌రావు పిలుపిస్తే వాటిని పట్టించుకునే నాయకులు లేరనే టాక్ ఉంది. ‘‘అధ్యక్షుడు చూసుకుంటారు.. మాకేం అవసరం... మాకు ఇతర కార్యక్రమాలు ఉండవా? ఆయన చెప్పగానే మేం పాటించాలా?’’అంటూ కేంద్ర మంత్రులు, ఎంపీలు వ్యవహరిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. దీంతో చాలా విషయాల్లో ప్రభుత్వాన్ని సరిగా ఎటాక్ చేయలేక పోతున్నారనే అభిప్రాయం కార్యకర్తల్లో ఉంది. పార్టీ స్పోక్స్‌పర్సన్ల ఎంపిక విషయంలో ఇతర కీలక నేతలను సంప్రదించకుండా ఏకపక్షంగా జాబితాను తయారు చేసి, హైకమాండుకు పంపారు. ఆ జాబితాలో పార్టీ గురించి బొత్తిగా తెలియని వారు, పలు వివాదాలు, పోలీసు కేసుల్లో ఇరుక్కున వ్యక్తుల పేర్లను చూసి ఢిల్లీ నేతలు షాక్ గురైనట్లు సమాచారం.
సమర్థుడైన అధ్యక్షుడి కోసం డిమాండ్..
రాంచందర్‌రావుకు మృదు స్వభావి అనే పేరు ఉంది. ఎదుటి వారిని ఇబ్బంది పెట్టే వ్యక్తిత్వం కాదు. ఇదే అనేక సార్లు పార్టీకి నష్టం తెస్తోందనే చర్చ కార్యకర్తల్లో ఉంది. రాష్ట్రంలో 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ బలంతో పార్టీ చాలా దూకుడుగా ఉండాలి. ప్రజలకు, కార్యకర్తలకు ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే రియాక్ట్ అయ్యే విధంగా, అవసరమైతే ఆందోళనలు, నిరసనలు చేపట్టే విధంగా ఉండాలి. కాని పార్టీలో లీడర్‌షిప్ మధ్య సమన్వయం కొరవడడం మూలంగా పార్టీ ఇచ్చే కార్యక్రమాలు అంతగా సక్సెస్ కావడం లేదని విమర్శలు ఉన్నాయి. అదే దూకుడు స్వభావం ఉన్న నాయకుడికి అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే, ఆయనే స్వయంగా ఫీల్డ్‌కు వెళ్లడమో, లేకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగడమో చేస్తే కార్యకర్తల్లో మంచి జోష్ వస్తుందని అంటున్నారు. ఫలితంగా మిగతా లీడర్లు కూడా తాము ఎక్కడ వెనకబడిపోతామనే భయంతోనైనా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారని అభిప్రాయపడుతున్నారు.
సీఎం రేవంత్ దృష్టిలో పడేందుకు తహతహ..
కొందరు బీజేపీ నేతలు సీఎం రేవంత్‌రెడ్డి దృష్టిలో పడేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు విమర్శలున్నాయి. పార్టీ పరంగా విమర్శలు చేసి, ఆయన కలిసినప్పుడు మాత్రం ఆయనతో చనువుగా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు సొంత పనులు చక్కబెట్టుకునేందుకు ఆయన దగ్గరకు వెళ్తున్నట్లు ప్రచారం ఉంది. ప్రధానంగా అసెంబ్లీ సమావేశాల సమయంలో ఒక్కో ఎమ్మెల్యే ఒక్కో తీరుగా వ్యవహరిస్తుంటారని టాక్ ఉంది. ఒక అంశంపై ఒక ఎమ్మెల్యే మాట్లాడుతుంటే, మిగతా ఎమ్మెల్యేలు ఆయనకు సపోర్టుగా సభలో కూర్చన్న సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయని గుర్తు చేసుకుంటున్నారు.
జూబ్లీహిల్స్ వైఫల్యం..
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓట్లను చూసి సొంత పార్టీ నేతలే శాపనార్ధాలు పెడుతున్నారు. గట్టిగా ప్రయత్నం చేసుంటే రెండో స్థానంలో ఉండే వాళ్లమని, కాని అభ్యర్థి ఎంపిక నుంచి, ప్రచారం వరకు కొందరు నేతల తీరు వల్ల పార్టీకి డిపాజిట్ కూడా రాకుండా పోయిందని ఆవేదన చెందుతున్నారు. ఈ ప్రభావం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో చూపించే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. గతంలో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన కమలం పార్టీ ఇప్పుడు మళ్లీ అంతే స్థాయిలో కార్పోరేటర్లను గెలుచుకోగలదా? అనే డౌట్ వస్తున్నది.
మా సెగ్మంట్ లో మేమే సుప్రీం..
కొందరు ఎంపీల తీరు పార్టీకి పెద్ద సమస్యగా మారింది. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్‌లో అభ్యర్థి ఎంపిక విషయంలో పార్టీ స్థానిక ఎంపీ కిషన్‌రెడ్డికి ప్రయారిటీ ఇచ్చింది. అలాగే హుజూరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో స్థానిక ఎంపీ బండి సంజయ్ సూచించిన వ్యక్తులకు టికెట్లు ఇచ్చారు. దీంతో రానున్న గ్రేటర్ ఎన్నికలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తమ ఎంపీ సెగ్మెంట్లలో ఇతర లీడర్లు జోక్యం చేసుకోకూడదని ఎంపీలు అభ్యంతరపెడుతున్నట్లు తెలిసింది. అత్యంత కీలకమైన గ్రేటర్ హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక ప్రస్తుతం సవాలుగా మారింది.
చేతులెత్తేసిన సునీల్ బన్సల్..
అగ్ర నేతల మధ్య ఉన్న విబేధాలు, ఇగోలను దగ్గర నుంచి గమనించిన పార్టీ ఇన్చార్జి జనరల్ సెక్రెటరీ సునీల్ బన్సల్ చేతులెత్తేసినట్లు ప్రచారం జరుగుతున్నది. ఒక గ్రూపును సర్దిచెప్పే ప్రయత్నం చేస్తే మరో గ్రూపు సహాయ నిరాకరణ చేయడం పరిపాటిగా మారిందనే టాక్ ఉంది. ఒకరిపై మరొకరు తరుచుగా ఫిర్యాదులు చేయడంతో విసిగిపోయిన బన్సల్ రాష్ట్ర పార్టీ బాధ్యతలు వద్దని పలు సందర్భాల్లో హైకమాండ్ వద్ద మొర పెట్టుకున్నట్లు తెలిసింది.
హైకమాండుకు తప్పుడు నివేదికలు..
కాగా, గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు ముందు, ఆ తర్వాత కూడా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై బీజేపీ అధిష్టానానికి తప్పుడు నివేదికలు అందాయని పలువురు కింది, మధ్య స్థాయి బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొందరు అగ్రనేతలు ఇచ్చిన తప్పుడు సమాచారం కారణంగానే అధ్యక్షుడి మార్పు జరిగిందని, బీఆర్ఎస్‌తో బీజేపీ కుమ్మక్కు ప్రచారం జరగడానికి కూడా ఈ నేతలే తావిచ్చారని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవి చూసిన అనంతరం పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని మోడీ ఇమేజీ కారణంగానే ఎనిమిది మంది ఎంపీలు గెలిచారని చెబుతున్నారు. అసెంబ్లీలో గెలుస్తుందని గతంలో వీళ్లు రిపోర్టు ఇచ్చిన బీఆర్ఎస్‌కు పార్లమెంటులో ఒక్క ఎంపీ సీటు రాకపోవడం వారి తప్పుడు నివేదికల లోగుట్టును బట్టబయలు చేస్తుందని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
మోడీ-షా జోక్యం చేసుకోవాలి..
ఇప్పటికైనా హైకమాండ్ ప్రత్యేకించి ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా జోక్యం చేసుకుని తగిన నిర్ణయాలు తీసుకున్న పక్షంలో వచ్చే అసెంబ్లీ-పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీదే గెలుపని ఆ పార్టీ కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎనిమిది మంది ఎంపీలతో లక్షలాది మంది కిందిస్థాయి కార్యకర్తలతో నేడు తెలంగాణలో కాంగ్రెస్ సర్కారుకు ప్రధాన ప్రతిపక్షంగా ఉండాల్సిన కమలం పార్టీ కేవలం రెండవ స్థానానికే పరిమితమవడానికి స్థానిక నాయకత్వం వైఖరే కారణమని పలువురు కార్యకర్తలు, రాజకీయ పరిశీలకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి తోకగా వ్యవహరించే తత్వం ఒకరిద్దరు నేతలు మినహా మిగతా అందరు నేతల్లో ఉందని వాళ్లు స్పష్టం చేస్తున్నారు. ప్రధాని మోడీ తన ఈ పర్యటనలో ఇక్కడి పరిస్థితులను అవగాహన చేసుకుని వీలైనంత తొందరగా పరిస్థితులను చక్కదిద్దే చర్యలు చేపట్టాలని వాళ్లు కోరుతున్నారు.






