డంపింగ్ యార్డ్‌పై రాజకీయాలు మానండి.. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఘాటు హెచ్చరిక

by Jakkula.Mamatha |

సిద్ధాపూర్ గ్రామంలో ప్రతిపాదిత ఏకో పార్క్(వేస్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్) అంశంపై షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తీవ్రస్థాయిలో స్పందించారు.

డంపింగ్ యార్డ్‌పై రాజకీయాలు మానండి.. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఘాటు హెచ్చరిక
X

దిశ, షాద్ నగర్: సిద్ధాపూర్ గ్రామంలో ప్రతిపాదిత ఏకో పార్క్(వేస్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్) అంశంపై షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తీవ్రస్థాయిలో స్పందించారు. కొందరు రాజకీయ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ, తనపై నిరాధార అవినీతి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. డంపింగ్ యార్డ్ పేరుతో రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్న వారిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి బుధవారం కార్యకర్తలతో కలిసి చౌరస్తా వరకు పాదయాత్రగా వచ్చిన ఎమ్మెల్యే అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మీడియాతో మాట్లాడారు. సిద్ధాపూర్‌లో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో రైతుల నుంచి భూములను సేకరించిందని, అనంతరం కాలుష్య పరిశ్రమలను అక్కడికి తరలించే ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు.

అప్పటినుంచే కాంగ్రెస్ నాయకులు, యువజన సంఘాలు, ప్రజా సంఘాలతో కలిసి తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. కేటీఆర్ పర్యటనను సైతం అడ్డుకున్నామని, ఆ కేసుల్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం టీఎస్‌ఐఐసీ నుంచి 86 ఎకరాలను జీహెచ్‌ఎంసీకి బదిలీ చేసిన నేపథ్యంలో ఏకో పార్క్ ప్రతిపాదనపై తాము తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశామని పేర్కొన్నారు. సీఎం, మంత్రులు, టీఎస్‌ఐఐసీ, జీహెచ్‌ఎంసీ అధికారులకు ఇప్పటికే వినతిపత్రాలు అందజేశామని, ప్రభుత్వం పూర్తిగా ఈ ప్రతిపాదనను రద్దు చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.ఈ అంశంపై అన్ని రాజకీయ పార్టీలు, రైతులు, ప్రజా సంఘాలు కలిసి అఖిలపక్షంగా ఉద్యమించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

అయితే కొందరు వ్యక్తులు తనను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని, అలాంటి చౌకబారు రాజకీయాలను ప్రజలు నమ్మరని అన్నారు. తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్న వారికి ఎమ్మెల్యే శంకర్ సవాల్ విసిరారు. టీఎస్‌ఐఐసీ భూములు జీహెచ్‌ఎంసీకి ప్రభుత్వ జీవో ప్రకారం బదిలీ అయ్యాయని, అందులో ఎమ్మెల్యేకు డబ్బులు ఇచ్చారనే ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని అన్నారు. ఆరోపణలు చేసే ముందు ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో భూసేకరణలో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపించిన ఆయన, సుమారు 70 నుంచి 80 ఎకరాల భూములు, రూ.9 కోట్లకు పైగా అక్రమాలు జరిగాయని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ నాయకులు తమ హయాంలో ఎలాంటి అవినీతి జరగలేదని బహిరంగంగా ప్రకటిస్తే, అన్ని ఆధారాలను ప్రజల ముందుంచుతామని హెచ్చరించారు.

సిద్దాపూర్ రైతులు, ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని, కాలుష్య పరిశ్రమలు లేదా డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రతిపాదనను పూర్తిగా ఉపసంహరించుకునే వరకు ఉద్యమం కొనసాగుతుందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, వైస్ చైర్మన్ అందే మోహన్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్, పట్టణ పార్టీ అధ్యక్షుడు శ్రీధర్, కొత్తూరు మండల పార్టీ అధ్యక్షుడు శేఖర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Next Story