- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిశ కథనానికి అదిరిపోయిన అబ్కారీ శాఖ
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న మద్యం దందాపై హైదరాబాద్‌కు చెందిన అబ్కారీ స్టేట్ టాస్క్‌ఫోర్స్ సిబ్బంది సోమవారం మెరుపు దాడి నిర్వహించారు.

దిశ, కాగజ్‌నగర్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న మద్యం దందాపై హైదరాబాద్‌కు చెందిన అబ్కారీ స్టేట్ టాస్క్‌ఫోర్స్ సిబ్బంది సోమవారం మెరుపు దాడి నిర్వహించారు. పట్టణంలోని వెంకటేశ్వర బార్‌పై అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టి, అక్రమ మద్యం విక్రయాలను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
దిశ కథనంతో కదిలిన రాష్ట్ర యంత్రాంగం
కాగజ్‌నగర్ పట్టణంలో బార్ లైసెన్స్‌ను అడ్డం పెట్టుకుని జరుగుతున్న బైపాస్ మద్యం దందాపై గత కొన్ని రోజుల క్రితం దిశ దినపత్రికలో ప్రచురితమైన ప్రత్యేక కథనం సంచలనం సృష్టించింది. స్థానిక అబ్కారీ యంత్రాంగం కళ్లు ఉన్నా చూడనట్లు వ్యవహరిస్తోందంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దిశలో ప్రచురితమైన ఈ కథనంపై ఉన్నతాధికారులు సీరియస్‌గా స్పందించారు. స్థానిక అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నేరుగా హైదరాబాద్ నుంచి స్టేట్ టాస్క్‌ఫోర్స్ బృందాన్ని రంగంలోకి దించారు.
రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ నిర్వాహకులు..
సోమవారం కాగజ్‌నగర్‌కు చేరుకున్న స్టేట్ టాస్క్‌ఫోర్స్ సిబ్బంది వెంకటేశ్వర బార్ పై నిఘా ఏర్పాటు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బార్‌లో మాత్రమే మద్యం సరఫరా చేయాల్సి ఉండగా, బార్ నుంచి బయటకు మద్యం విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ముందస్తు ప్రణాళికతో దాడి నిర్వహించిన అధికారులు అక్రమ విక్రయాలను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం వెంకటేశ్వర బార్ యాజమాన్యానికి రూ.20 వేల జరిమానా విధించారు. బార్‌పై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టారు.
ఇతర బార్ యజమానుల్లో ఆందోళన..
హైదరాబాద్ నుంచి నేరుగా స్టేట్ టాస్క్‌ఫోర్స్ రంగంలోకి దిగి వెంకటేశ్వర బార్‌పై మెరుపు దాడి నిర్వహించడంతో పట్టణంలోని ఇతర బార్ యజమానుల్లో ఆందోళన నెలకొంది. జిల్లా స్థాయి అధికారుల ద్వారా ముందస్తు సమాచారం అందుతుందనే ధీమాతో ఉన్న నిర్వాహకులకు, స్టేట్ టాస్క్‌ఫోర్స్ నేరుగా వచ్చి దాడి చేయడం ఊహించని పరిణామంగా మారింది. నిబంధనలను ఉల్లంఘిస్తున్న ఇతర బార్ నిర్వాహకులు కూడా ప్రస్తుతం అప్రమత్తమయ్యారు. తమ బార్లపై ఎప్పుడు తనిఖీలు జరుగుతాయోనన్న భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు.






