సీఐడీ ప్రధాన కార్యాలయంలో అత్యాధునిక ల్యాబ్‌ల ఏర్పాటు

by Malleboina Mahesh |

సిఐడీ ప్రధాన కార్యాలయంలో అత్యాధునిక కంప్యూటర్, షీ సైబర్ ల్యాబ్‌లను డీజీపీ సీవీ ఆనంద్ ప్రారంభించారు.

సీఐడీ ప్రధాన కార్యాలయంలో అత్యాధునిక ల్యాబ్‌ల ఏర్పాటు
X

దిశ, తెలంగాణ బ్యూరో: సాంకేతికతను పుణికిపుచ్చుకుంటూ నేరాల స్వరూపం వేగంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో.. నేరగాళ్ల గుట్టురట్టు చేసేందుకు తెలంగాణ పోలీస్‌ శాఖ కృత్రిమ మేధ ఏ ఐ ను ప్రధాన ఆయుధంగా మలచుకుంటోంది. నేర పరిశోధన, డేటా విశ్లేషణలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ, హైదరాబాద్‌లోని సీఐడీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్, షీ సైబర్ ల్యాబ్‌ లను రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఏఐ ఆధారిత స్మార్ట్ క్రైమ్ అనలిటిక్స్ సిస్టమ్ ద్వారా దర్యాప్తు ప్రక్రియలో సరికొత్త అధ్యాయానికి ఆయన నాంది పలికారు.

మాట్లాడే వారిని పసిగట్టే స్మార్ట్ కెమెరాలు..

సీఐడీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ అత్యాధునిక ల్యాబ్‌లు ఎన్నో వినూత్న ప్రత్యేకతలను సంతరించుకున్నాయి. ఇక్కడ ఏర్పాటు చేసిన స్మార్ట్ కెమెరాలు.. మాట్లాడుతున్న వ్యక్తిని ఆటోమేటిక్‌గా గుర్తించి అటువైపు తిరగడమే కాకుండా, వారిపై జూమ్ అవుతూ ఆడియో, వీడియోలను రికార్డు చేస్తాయి. మానిటర్ లేదా డిజిటల్ బోర్డుపై ఇచ్చే సమాచారాన్ని ఇట్టే గ్రహించి.. క్షణాల్లో టెక్స్ట్, ఆడియో లేదా నివేదిక రూపంలోకి మార్చే సామర్థ్యం ఈ వ్యవస్థ సొంతం. కృత్రిమ మేధస్సు సాయంతో నేరాలకు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించి క్రైమ్ మ్యాపింగ్, డేటా ఫిల్టరింగ్, కేసుల సమీక్షలను కచ్చితత్వంతో నిర్వహించవచ్చు.

సాంకేతికత వినియోగంలో ఆదర్శం..

ఈ ప్రారంభోత్సవం అనంతరం నిర్వహించిన సమావేశంలో డీజీపీ సీవీ ఆనంద్‌ మాట్లాడారు. పోలీసుల విధి నిర్వహణలో, ముఖ్యంగా సైబర్ నేరాల కట్టడిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడమే మూల సూత్రమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ పోలీసులు సరికొత్త ఆవిష్కరణలతో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. సైబర్ నేరాల నియంత్రణ, డిజిటల్ ఫోరెన్సిక్ దర్యాప్తు, క్రైమ్ అనాలిటిక్స్‌లో మన పోలీసులది విశేష పురోగతి అని ప్రశంసించారు. ఇటీవల అందుబాటులోకి తెచ్చిన టీ-స్పార్క్ వంటి ప్రత్యేక బృందాలు వినూత్న విధానాలను అమలు చేయడంలో కీలకంగా వ్యవహరిస్తున్నాయని గుర్తుచేశారు.

బాధితుల వాంగ్మూలాలు సైతం డిజిటల్‌గా..

సమావేశాల్లో చర్చించిన ప్రతి అంశాన్ని ఈ ల్యాబ్‌లో డిజిటల్ రూపంలో భద్రపరుస్తారు. దీంతో పాటు బాధితులు, ఫిర్యాదుదారుల అభిప్రాయాలను సైతం డిజిటల్ పద్ధతిలో నమోదు చేయడం ఈ వ్యవస్థలోని మరో ప్రత్యేకత. దీనివల్ల కేసుల పురోగతి, దర్యాప్తు నాణ్యత, ప్రజల స్పందనను ఎప్పటికప్పుడు సమీక్షించడం సులభతరమవుతుంది. అలాగే, సీసీటీఎన్ఎస్ వేదికపై డేటా నిర్వహణ, విశ్లేషణ, ధ్రువీకరణ తదితర ప్రక్రియలు మరింత పారదర్శకంగా, వేగవంతంగా జరగనున్నాయి. ఈ ఏఐ ల్యాబ్‌లు భవిష్యత్తులో తెలంగాణ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయడంలో కీలక మైలురాయిగా నిలుస్తాయని డీజీపీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీజీ ఏసీబీ, సీఐడీ చారు సిన్హా, డీఐజీలు నవీన్ కుమార్, నారాయణ నాయక్, పరిమళ హనా నూతన్, ఎస్పీ మద్దిపాటి శ్రీనివాస్ తో పాటు పలువురు సీఐడీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Next Story