మాకు ఎవరితోనూ పొత్తులుండవు : కేటీఆర్

by Muthe.Rajitha |

శుక్రవారం నందినగర్‌లోని కేటీఆర్ నివాసంలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు.

మాకు ఎవరితోనూ పొత్తులుండవు : కేటీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘వచ్చే ఎన్నికల్లో ఎలాంటి పొత్తులు ఉండవు. తెలంగాణ ఏర్పాటు తర్వాత అన్ని ఎన్నికల్లోనూ ఒంటరిగానే పోరాటం చేశాము. ఒంటరి పోరాటం మాకు కలిసి వచ్చింది. ప్రతిసారి ప్రజలు ఆశీర్వదించారు. మొన్నటి ఎన్నికల్లోనూ అతి స్వల్ప మెజారిటీతో ఓడిపోయాము. కాంగ్రెస్ పార్టీ ప్రతి రోజురోజుకూ దిగజారుతున్నది. రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్‌దే విజయం. భారీ మెజారిటీతో గెలుస్తాం’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం నందినగర్‌లోని కేటీఆర్ నివాసంలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ఇప్పటికే పలు సర్వేలు చెప్తున్నాయని.. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మూడో స్థానంలోనే ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ పరిపాలనా వైఫల్యాలు, హామీలపై మోసమే వారిని మూడో స్థానానికి నెట్టిందని అన్నారు. ఆ పార్టీ జారుడు బల్లపైన ఉన్నదని.. ఇంకా కిందికి దిగజారిపోతూనే ఉంటుంది కానీ పైకి రాదని అన్నారు. రాబోయే ఎన్నికలు బీఆర్ఎస్, బీజేపీ మధ్యనే ఉంటాయని తెలిపారు. గత పాలనలో ప్రజలకు తమపైన కొన్ని అంశాల్లో అసంతృప్తి ఉన్నదని.. వాటన్నింటినీ సరిచేసుకొని ముందుకు పోతున్నామని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ అంటేనే కంపు

కాంగ్రెస్ పార్టీ అంటేనే కంపు అని కేటీఆర్ అన్నారు. మీనాక్షి నటరాజన్ అంటే పడని వారే ఈ పనిచేశారని.. ఆమెకు రాష్ట్ర కాంగ్రెస్‌లో ఎవరు వ్యతిరేకులో ప్రజలందరికీ తెలుసు అని.. ముమ్మాటికీ ఆయన చేసిన పనే ఇది అని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో పదవులు, డబ్బులకే వస్తున్నాయని షబ్బీర్ అలీ చెప్పినందుకు అభినందనలు అని అన్నారు. గతంలో పీసీసీ పదవిని పైసలకు అమ్ముకున్నది కాంగ్రెస్ పార్టీనే అని.. ఆ తర్వాత సీఎం పదవిని సైతం డబ్బులకే అమ్ముకున్నదని ఆరోపించారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి పదవి కొనుక్కున్న వ్యక్తే కదా అని తెలిపారు. ప్రతినెలా డబ్బుల మూట పంపితేనే ఆయన పదవి ఉంటుందని.. రేవంత్‌రెడ్డి రెగ్యులర్ సీఎం కాదని.. రెన్యూవల్ సీఎం అని అందరికీ తెలుసని అన్నారు. మానసిక రోగి మాత్రమే హిట్లర్ స్ఫూర్తి అని అంటారని.. రేవంత్ అజ్ఞానంతో హిట్లర్ హైడ్రా తనకు ఆదర్శం అంటూ మాట్లాడారని అన్నారు. రేవంత్‌రెడ్డి హిట్లర్ వ్యాఖ్యలను శ్రీధర్‌బాబు సమర్థించడం ఆయనకున్న ఇబ్బందులను గుర్తుచేస్తున్నదని.. ఆయన చదువుకున్న వ్యక్తి అని.. అలాంటి ఆయన హిట్లర్ వ్యాఖ్యలను సమర్థించడం దారుణమన్నారు. శ్రీధర్‌బాబు పరిస్థితి చూస్తే జాలి కలుగుతున్నదని.. ఆయన కూడా హిట్లర్ వ్యాఖ్యలను సమర్థించడం ఆయన విజ్ఞతకే వదిలివేస్తున్నామన్నారు.

బ్లాక్‌మెయిల్ సంస్థలా మారిన హైడ్రా

75 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఈ నగరానికి చేసిందేమీ లేదని.. గత పదేళ్లలో తాము చేసిన ఎస్ఎన్‌డీపీ, ఇతర కార్యక్రమాల వల్లనే మెరుగైన పరిస్థితి ఉన్నదని కేటీఆర్ తెలిపారు. కానీ, రేవంత్‌రెడ్డి మున్సిపల్ శాఖ మంత్రిగానూ విఫలమయ్యారని అన్నారు. వర్షాకాల సన్నద్ధత ప్రణాళికపై సమీక్ష సైతం నిర్వహించలేదని పేర్కొన్నారు. ఉన్న సిటీని గాలికి వదిలేసి ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుతున్నారని.. ఫ్యూచర్ లేని రేవంత్‌రెడ్డి ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నారని అన్నారు. వర్షాలు ఆగితే తన క్రెడిట్ అని చెప్పుకున్న సీఎం.. వర్షాలు, వరదలు వస్తే మాత్రం పాత ప్రభుత్వానికి అంటగడుతున్నారని అన్నారు. నగరంలోని ప్రజల అవస్థ పాపం ముమ్మాటికీ రేవంత్‌రెడ్డిదేనని ఆరోపించారు. ఎయిర్‌పోర్ట్ మెట్రోను రద్దు చేయడం వల్లనే ఆ ప్రాంతంలో రద్దీ భారీగా పెరిగిందన్నారు. హైడ్రా ఒక బ్లాక్‌మెయిల్ సంస్థగా మారిందని.. హైడ్రాను అన్ని సమస్యలకూ జిందా తిలస్మాత్ లెక్క చూపిస్తున్నారని పేర్కొన్నారు. హైడ్రా బ్లాక్‌మెయిలింగ్, డబ్బుల వసూళ్లకు తప్పించి దేనికీ పనిచేయడం లేదన్నారు.

వందల కోట్లతో రేవంత్‌రెడ్డి రాజసౌధం

రాష్ట్ర ప్రభుత్వం భారీగా అమ్ముతున్న భూముల నుంచి వచ్చే నిధులు ఎక్కడ పోతున్నాయో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 4 లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకువచ్చి వాటిని ఎక్కడ పంపిందో చెప్పాలన్నారు. కొత్త హెలికాప్టర్లు కొని సీఎం సోకులు పడుతున్నారని.. రూ.200 కోట్లతో రాజసౌధాలు కట్టుకుంటున్నారని ఆరోపించారు. భారీ ఎత్తున కోటగోడలు కట్టి ఒక రాజప్రసాదం నిర్మాణం చేసుకున్నారని.. దానికి సంబంధించిన నిర్మాణ జీవోలు రహస్యంగా ఉంచుతున్నారని తెలిపారు. తప్పు చేయకుంటే ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. అర్ధరాత్రి సీఎం ఇంటి గృహప్రవేశం ఎందుకు చేసుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ఢిల్లీకి వెళ్లిన సీఎం తీసుకొచ్చి సాధించిందదేమీ లేదని.. మూడు మూడు ఇండ్లు కట్టుకుంటున్నారని ఆరోపించారు. అటు.. డిప్యూటీ సీఎం సైతం హైదరాబాద్, ఖమ్మం, మధిరలో భారీ ఇండ్లు కట్టుకుంటున్నారని ఆరోపించారు. యువతలో నిరాశ నిస్పృహలు ఉంటే తిరుగుబాటు తప్పదని.. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో ఆన్‌లైన్‌లో అదే స్పందన కనిపిస్తుందని చెప్పారు.

జమిలి ఎన్నికలు ఉండకపోవచ్చు..

జూలై నెల నుంచి డీలిమిటేషన్ జరిగే అవకాశం ఉన్నదని అంటున్నారని.. జాతీయ స్థాయిలో డీలిమిటేషన్ జరగకున్నా, రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో జరగాల్సి ఉన్నదని కేటీఆర్ అన్నారు. జమిలి ఎన్నికలు ఉండకపోవచ్చు అని.. హైదరాబాద్‌లో పార్లమెంట్ స్థానాలు పెంచాలన్న అంశంపైనా ఇప్పటిదాకా సమాచారం లేదని తెలిపారు. దక్షిణ భారతదేశ ప్రాతినిధ్యం తగ్గకుండా ఉంటే డీలిమిటేషన్‌కు మద్దతు ఇస్తామని.. దక్షిణ భారతదేశానికి ప్రాతినిధ్యం తగ్గితే ఊరుకోబోమని చెప్పారు. దక్షిణ భారతదేశానికి అన్యాయం జరిగితే ఖచ్చితంగా ప్రజలతో కలిసి గొంతు విప్పుతామన్నారు. మోదీ 12 ఏళ్ల పాలనలో దేశానికి చేసిందేమీ లేదన్నారు. ఒక్క హామీని సైతం నిలుపుకోలేదన్నారు. గతంలో దేవేంద్ర ఫడ్నవీస్‌తో కేసీఆర్ వ్యక్తిగతంగా సమావేశమై తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రయత్నం చేశారని.. కానీ ఆయన మహారాష్ట్ర ప్రజలకు జరిగే నష్టం రూపంలో ససేమిరా అన్నారని తెలిపారు. ఇప్పుడు కూడా అక్కడ ఉన్న మహారాష్ట్ర సీఎం ఒప్పుకోరనే విషయం తెలిసిన తర్వాత కూడా ప్రజలను మోసం చేయడానికే రేవంత్‌రెడ్డి ఈ నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. సింగరేణి అంశంలో కాంగ్రెస్ పార్టీ అనేక కుంభకోణాలకు పాల్పడుతున్నదని.. స్వయంగా ముఖ్యమంత్రి బావమరిది సింగరేణి వ్యవహారాలు నడిపిస్తున్నారని ఆరోపించారు. సైట్ విజిటేషన్ మొదలుకొని నైనీ గనుల వరకు అనేక అక్రమాలు జరిగాయన్నారు. అక్రమాలు జరగకుంటే వాటి టెండర్లను ఎందుకు రద్దు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. సింగరేణి అక్రమాలపై ఇప్పటికే పలు లేఖలు రాసినా సమాధానం చెప్పే ధైర్యం లేకనే కిషన్‌రెడ్డి మౌనం వహిస్తున్నారని.. రాష్ట్ర ప్రభుత్వంతో ఆయన కుమ్మకు అయ్యారని ఆరోపించారు.

సభ్యత్వ నమోదు అప్లికేషన్ సిద్ధం

పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని.. సభ్యత్వ నమోదు మొబైల్ అప్లికేషన్ సిద్ధంగా ఉన్నదని కేటీఆర్ తెలిపారు. అప్లికేషన్ టెస్టింగ్ కొనసాగుతున్నదని.. ఆ తర్వాత నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లతో సభ్యత్వ నమోదు పైన శిక్షణ ఉంటుందని చెప్పారు. నియోజకవర్గాల వారీగా ఈ శిక్షణా కార్యక్రమాలు ఉంటాయని.. ఇప్పటికే జనరల్ సెక్రటరీలు, ఇన్‌చార్జీలు ప్రతి నియోజకవర్గం తిరుగుతున్నారని తెలిపారు. 60 నియోజకవర్గాల్లో ఎస్ఐఆర్, మెంబర్‌షిప్‌పై సమావేశాలు పూర్తయ్యాయని.. సభ్యత్వ నమోదు ఈ నెలాఖరు వరకే స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నదని చెప్పారు. ఆ తర్వాత కొత్త కమిటీలు ఏర్పాటు చేసుకుంటామన్నారు. అనంతరం కమిటీలకు, కార్యకర్తలకు శిక్షణ నిర్వహిస్తామన్నారు. ప్రతి ఒక్క కార్యకర్తను సుశిక్షితులైన పార్టీ కార్యకర్తల మాదిరిగా తయారు చేసుకుంటామని.. బీజేపీ, కాంగ్రెస్ కన్నా బలమైన పార్టీ నిర్మాణం తమకున్నదని స్పష్టం చేశారు.

Next Story