- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్టీసీ బస్సుల్లో ఇకపై ఫస్ట్ ఎయిడ్ బాక్సులు
టీజీఎస్ఆర్టీసీ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 10,130 బస్సుల్లో పకడ్బందీగా ఫస్ట్ ఎయిడ్ బాక్సుల కిట్లను ఏర్పాటు చేసేందుకు కసరత్తు ముమ్మరం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ప్రజా రవాణాకు వెన్నెముక లాంటి ఆర్టీసీ బస్సుల్లో ఇకపై ఫస్ట్ ఎయిడ్ బాక్సులు కేవలం అలంకారంగా మాత్రమే మిగిలిపోవు. అత్యవసర సమయాల్లో ప్రయాణికుల ప్రాణాలు కాపాడే సంజీవనిగా మారబోతున్నాయి. నిబంధనల ప్రకారం ప్రతి వాహనంలోనూ ప్రథమ చికిత్స కిట్లు ఉండాలనే రూల్ ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం అవి ప్రయాణికులకు అందుబాటులో లేవనేది చేదు నిజం. ఎక్కడో ఒకచోట బాక్స్ కనిపించినా.. అందులో మందులు, సర్జికల్ కాటన్ వంటివి శూన్యం. సరిగ్గా ఈ లోపాన్ని గుర్తించిన ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వై. నాగిరెడ్డి, బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు లేదా ప్రయాణికులు అస్వస్థతకు గురైనప్పుడు కనీసం గాయాలకు కట్లు కట్టేందుకు, ప్రాథమిక ఉపశమనం కలిగించేందుకు ఈ కిట్స్ అత్యవసరమని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రతి బస్సులోనూ కచ్చితంగా పనిచేసే ఫస్ట్ ఎయిడ్ కిట్లు ఉండాల్సిందేనని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
అన్ని బస్సుల్లో కిట్స్ ఉంండాల్సిందే...
ఎండీ ఆదేశాలతో అలర్ట్ అయిన టీజీఎస్ఆర్టీసీ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 10,130 బస్సుల్లో పకడ్బందీగా ఈ కిట్లను ఏర్పాటు చేసేందుకు కసరత్తు ముమ్మరం చేశారు. కేవలం డబ్బా పెట్టి చేతులు దులుపుకోవడం కాకుండా, నిరంతరం అందులో అవసరమైన హెల్త్ కిట్స్ ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. "సాధారణంగా వాహనాల్లో ఉండే నామమాత్రపు ఫస్ట్ ఎయిడ్ కిట్ కంటే ఇది చాలా భిన్నంగా, పకడ్బందీగా ఉంటుంది. ప్రయాణంలో అత్యవసరంగా ఉపయోగపడేలా మెరుగైన ఎమర్జెన్సీ హెల్త్ కిట్ ను ఇందులో డిజైన్ చేస్తున్నాం. సాధ్యమైనంత త్వరగా అన్ని బస్సుల్లో వీటిని అమరుస్తాం." అని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రయాణంలో ఊహించని ప్రమాదాలు జరిగినప్పుడు లేదా ఎవరికైనా హఠాత్తుగా అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ఈ కిట్స్ ఎంతో మేలు చేస్తాయి. ఆర్టీసీ సంస్థ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రయాణం మరింత సురక్షితం కానుందని భావిస్తున్నారు. ఏదేమైనా.. ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తూ ఆర్టీసీ మేనేజ్‌మెంట్ తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయం.
ఈ కిట్‌లో ఉండే అవకాశం ఉన్న ముఖ్యమైన వస్తువులు...
* గాయాలను శుభ్రం చేసే యాంటీసెప్టిక్ లిక్విడ్స్ (డెటాల్/సావ్లాన్)
* స్టెరిలైజ్డ్ సర్జికల్ కాటన్, బ్యాండేజ్ రోల్స్
* ఓఆర్ఎస్ ప్యాకెట్లు (వడదెబ్బ లేదా డీహైడ్రేషన్ బారిన పడితే తక్షణ ఉపశమనం కోసం)
* పెయిన్ కిల్లర్ ఆయింట్‌మెంట్లు, చిన్నపాటి మందులు
* కత్తెర, మెడికల్ టేప్






