ముందుకుసాగని సాగు..!

by Jakkula.Mamatha |

ఉమ్మడి జిల్లాలో ములుగు మినహా అన్ని జిల్లాల్లో వర్షపాతం సరాసరి నమోదు కాలేదు.

ముందుకుసాగని సాగు..!
X

ఉమ్మడి జిల్లాలో చినుకు లేదు. వానాకాలం మొదలై నెలరోజులు దాటినా నేటికీ భారీ వర్షం కురియలేదు. రైతులు వర్షాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. అడపాదడపా కురిసిన వర్షాలకు ఆరుతడి పంటలు సాగుచేస్తున్నారు. భారీ వర్షాలు లేక పూర్తిస్థాయిలో విత్తనాలు మొలకెత్తకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. వరి సాగు కోసం నారుమళ్లు సిద్ధం చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాలు లేక వాగులు పొంగక చెరువుల్లో నీళ్లు లేక గడ్డుపరిస్థితి ఏర్పడింది. గడిచిన ఐదేళ్లుగా ఇలాంటి పరిస్థితి చూడలేదని రైతులు వాపోతున్నారు. భారీ వర్షాలు కురిస్తేనే అన్ని పంటలు సాగుచేసేందుకు సిద్ధమవుతున్నారు.

దిశ, వరంగల్ బ్యూరో: ఉమ్మడి జిల్లాలో ములుగు మినహా అన్ని జిల్లాల్లో వర్షపాతం సరాసరి నమోదు కాలేదు. అన్ని జిల్లాల పరిధిలో లోటు వర్షపాతమే నమోదైంది. వానాకాలం మొదలై నెలరోజులు దాటినా ఇప్పటికీ భారీ వర్షాలు పడలేదు. వాగులు పొంగలేదు. చెరువుల్లో నీళ్లు చేరలేదు. భూగర్భ జలాలు పెరగలేదు. చెదురు ముదురుగా పడుతున్న వర్షాలతో రైతులు ఆరుతడి పంటలు మొక్కజొన్న, సోయా, పెసరు, కంది, పసుపుతో పాటు ఇతర పంటలు సాగు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ప్రధాన చెరువులు పరిశీలిస్తే దేనిలో కూడా నీటిమట్టాలు లేవు. నీళ్లు అడుగంటి ఉన్నాయి. ప్రధాన వాగుల్లో కూడా ఇంకా వరద నీరు చేరలేదు. వానాకాలం ఆరంభమై నెలరోజులు దాటినా భారీ వర్షాలు లేకపోవడంతో ఉమ్మడి జిల్లాలో పంటల సాగు జోరందుకోలేదు.

16.62లక్షల ఎకరాల సాగు అంచనా..

ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో 16లక్షల 62వేల ఎకరాలకు పైగా పంటలు సాగు అవుతాయని అధికారులు అంచనా వేశారు. హన్మకొండ జిల్లా పరిధిలో 2లక్షల 42వేల 375 ఎకరాలు, వరంగల్ జిల్లాలో 2లక్షల 37వేల 957 ఎకరాలు, మహబూబాబాద్ జిల్లాలో 4లక్షల 77వేల 765 ఎకరాలు, ములుగు జిల్లాలో లక్షా 27620 ఎకరాలు, భూపలపల్లి జిల్లాలో 2లక్షల 12,120 ఎకరాలు, జనగామ జిల్లాలో 3లక్షల 6434 ఎకరాలు సాగు అవుతుందని అంచనా వేశారు. ఉమ్మడి జిల్లా పరిధిలో పత్తి, మొక్కజొన్న, ఇతర పంటలు కలిపి ఇప్పటి వరకు 7లక్షల ఎకరాలలోపే సాగైంది. భారీ వర్షాలు లేకపోవడం కొన్ని మండలాల పరిధిలో మామూలు వర్షపాతం కూడా నమోదు కాకపోవడంతో రైతులు పంటలను ఎక్కువ మొత్తంలో సాగు చేయలేదు.

పత్తి, మొక్కజొన్న పంటలు ఎక్కువగా వేసిన కొన్నిచోట్ల వర్షాలు తగినంతలేక మొలకెత్తడం లేదు. మొలచినా వర్షాలు పడకపోవడంతో ఎండిపోతున్నాయి. వాటిని కాపాడుకునేందుకు ట్యాంకర్లు, ఇతర మార్గాల ద్వారా నీటిని తెప్పిస్తూ పంటలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రైతులు విత్తనాలు, ఎరువులు సిద్ధం చేసుకున్నా వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో పత్తి, మొక్కజొన్న ఎక్కువ విస్తీర్ణంలో సాగు అయిన మిగతా పంటలు మాత్రం నామమాత్రంగా వేస్తున్నారు.

వరిసాగుపై భారీ అంచనాలు..

ఉమ్మడి జిల్లా పరిధిలో భారీ ఎత్తున వరిసాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. అన్ని మండలాల పరిధిలో పెద్ద ఎత్తున నారుమళ్లను సిద్ధం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఎస్సారెస్పీ, దేవాదుల, చెరువుల కింద 7 లక్షల ఎకరాల వరకు సాగు అవుతుందని అధికారులు అంచనా వేశారు. భారీ ప్రాజెక్టులు లేకున్నా కాకతీయుల కాలం నాటి కట్టిన చెరువుల ద్వారా పంటలు పండించేందుకు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి జిల్లాకు ఎక్కువ సాగుకు ఎస్సారెస్పీ నీటి ద్వారానే హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల పరిధిలోని పంటల సాగుకు కాకతీయ కాలువ ద్వారా నీటిని అందిస్తున్నారు. గడిచిన కొన్నేళ్లుగా ఎస్సారెస్పీ నిండటం మిడ్ మానేరు, ఎగువ మానేరు, లోయర్ మానేరు డ్యామ్ నింపడంతో రెండు పంటలకు సాగునీరు అందుతుంది. ఇదే కాకుండా దేవాదుల పంప్ హౌజ్ ల ద్వారా కూడా సాగుకు నీరు అందుతున్నాయి.

దేవాదుల ప్రాజెక్టు పంప్ హౌజ్ లు ఆన్ చేస్తే గోదావరి ద్వారా నీళ్లు సాగుకు అందుతాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో ఏవైపు చూసినా భారీ వర్షాలు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈనెల రోజులు దాటితే ఆరుతడి పంటలు వేసే అవకాశం ఉండదని భావిస్తున్నారు. ఒకటి రెండు భారీ వర్షాలు పడితే సాగు పెరిగే అవకాశం ఉంది. వర్షాలు తక్కువ గా పడుతున్నందున రైతులు ఆరుతడి పంటలు ఎక్కువగా సాగుచేయలని హన్మకొండ జిల్లా వ్యవసాయ అధికారి విజేయేంద్ర సూచించారు. భారీ వర్షాలు పడి భూగర్భ జలాలు పెరిగితేనే వరిసాగుకు మొగ్గుచూపాలని కోరారు.

Next Story