తిరుమలలో శ్రీవాణి టికెట్ల బల్క్ బుకింగ్ స్కామ్.. చెన్నై ట్రావెల్ ఏజెన్సీ గుట్టురట్టు

by Malleboina Mahesh |

శ్రీవాణి టికెట్ల అక్రమ విక్రయాలపై టీటీడీ విజిలెన్స్ కొరడా ఝుళిపించింది. ఒకే నంబర్‌తో భారీగా టికెట్లు పొంది భక్తులను దోచుకుంటున్న చెన్నైకి చెందిన పద్మావతి ట్రావెల్స్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

తిరుమలలో శ్రీవాణి టికెట్ల బల్క్ బుకింగ్ స్కామ్.. చెన్నై ట్రావెల్ ఏజెన్సీ గుట్టురట్టు
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల తిరుపతిలో వాణి (SRIVANI) ట్రస్ట్ టికెట్ల బల్క్ బుకింగ్‌లో చోటుచేసుకున్న భారీ అక్రమాలపై టీటీడీ విజిలెన్స్ (TTD Vigilance) విభాగం లోతుగా విచారణ చేపట్టింది. చెన్నైకి చెందిన 'పద్మావతి ట్రావెల్స్' ('Padmavati Travels') అనే సంస్థ ఒకే ఫోన్ నంబర్‌ను పదేపదే ఉపయోగిస్తూ వందలాది టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. సామాన్య భక్తులు టికెట్ల కోసం వెబ్‌సైట్‌లో నిరీక్షిస్తుంటే, ఈ ఏజెన్సీ మాత్రం సాంకేతిక లొసుగులను వాడుకుంటూ పెద్ద ఎత్తున టికెట్లను దక్కించుకోవడంపై విజిలెన్స్ బృందం ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

ఈ ఏజెన్సీ తన వెబ్‌సైట్ ద్వారా ఒక్కో శ్రీవాణి టికెట్‌ను రూ. 13,500 నుంచి రూ. 15,000 వరకు విక్రయిస్తున్నట్లు విజిలెన్స్ తనిఖీల్లో వెల్లడైంది. నిమిషాల్లో పూర్తయ్యే రోజువారీ 800 టికెట్ల కోటాలో ఈ ట్రావెల్స్ ఏజెన్సీకి మాత్రమే ఎలా అధికంగా టికెట్లు లభిస్తున్నాయి? అనే అంశంపై టీటీడీ ఏవీఎస్వో (AVSO) నేతృత్వంలోని బృందం గత వారమే తిరుమల బయోమెట్రిక్ కౌంటర్ల (Tirumala biometric counters) వద్ద సోదాలు నిర్వహించింది. ఈ అక్రమ దందా పై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరుతూ విజిలెన్స్ అధికారులు తిరుమల వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భక్తుల మనోభావాలతో ఆడుకుంటూ టికెట్లను బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది.

Next Story