- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శ్రీశైలం నిర్వాసితుల ‘98 జీవో కు 40 ఏళ్లు: తీరని నిరీక్షణ.. మళ్లీ ఉద్యమ బాటలో బాధితులు!
శ్రీశైలం నిర్వాసితుల 98 జీఓకు 40 ఏళ్లు! ఉద్యోగాల కోసం నందికొట్కూరులో మళ్లీ రిలే దీక్షలు. కూటమి ప్రభుత్వం స్పందించాలని బాధితుల డిమాండ్.

దిశ, ప్రతినిధి కర్నూలు: కృష్ణా నదిపై నిర్మించిన భారీ బహుళార్థసాధక ప్రాజెక్టు శ్రీశైలం నిర్మాణం కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పించేందుకు తీసుకొచ్చిన 98 జీఓకు 40 ఏళ్లు నిండాయి. ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప నిరుద్యోగుల సమస్యలు నేటికీ తీరకపోవడం బాధాకరం. పాలకులు నాటి నుంచి నేటి వరకు వారిని ఓటు బ్యాంకుగా వినియోగించుకున్నారే తప్ప వారికి చేసిందేమీలేదు. ప్రస్తుతం ఒక వర్గం మళ్లీ రిలే దీక్షలు చేపట్టగా, మరో వర్గం దూరంగా ఉండటం గమనార్హం. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం దురదృష్టకరం.
ప్రాజెక్ట్ రూపకల్పన ఎప్పుడంటే..
1960లో అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ శ్రీశైలం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 215 టీఎంసీల సామర్థ్యంతో 178.74 టీఎంసీల నిల్వ సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టు 1980లో పూర్తి కాగా, 1981లో జాతికి అంకితం చేశారు. ఏపీలోని ఉమ్మడి కర్నూలు, కడప జిల్లాల్లో 1.90 లక్షల ఎకరాలకు, తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన దాదాపు 2.7 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. అయితే, ప్రాజెక్టు నిర్మాణంలో నిర్వాసితులైన వారికి ప్రభుత్వం ఇంటికో ఉద్యోగం ఇస్తామని 1986 ఏప్రిల్ 15న అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 98 జీఓను జారీ చేశారు. ఈ జీఓకు ఈ నెల 15తో 40 ఏళ్లు నిండుతున్నాయి.
10 వేల హెక్టార్ల త్యాగం
శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కోసం అటు తెలంగాణతో పాటు ఏపీలోని కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు, పాములపాడు, జూపాడుబంగ్లా, పగిడ్యాల, కొత్తపల్లి మండలాల్లోని దాదాపు 44 గ్రామాలకు చెందిన 4 వేల మందికి పైగా రైతులు 10 వేల హెక్టార్లు త్యాగం చేసి నిర్వాసితులయ్యారు. ప్రభుత్వ హామీ మేరకు 1986లో నిర్వాసితులు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుని విడతల వారీగా నిరసనలు చేపట్టారు. కానీ, ఎలాంటి ఫలితం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యను గుర్తించి మొదటి విడతలో 1605 మందికి గానూ 962 మందిని అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన లష్కర్లు గా నియమించింది. అప్పట్లో రూ.6,500 లతో ప్రారంభమైన వారి వేతనం ప్రస్తుతం రూ.20 వేలకు పెంచింది. వీరు కాకుండా జిల్లాలో ఉద్యోగాల కోసం రెండో విడతగా 930 మంది నిర్వాసితులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో 674 మందిని ప్రభుత్వం అర్హులుగా గుర్తించగా, వారిలో 9 మంది మృతి చెందారు. ఇంకా దరఖాస్తుకు నోచుకోని వారు మరో 300లకు పైగా ఉన్నారు.
ఉద్యమాలు.. హామీలు
నిర్వాసితులు ఉద్యోగాల కోసం 1984 నుంచే ఉద్యమ బాట పట్టారు. 2004 అక్టోబర్ 23 నుంచి ఆమరణ నిరాహార దీక్షలు చేయగా 9 మందిపై ఆత్మహత్యాయత్నం కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. 2003లో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర సమయంలో హామీచ్చారు. ఆయన అకాల మరణంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి వారి సమస్యను విన్నవించగా, 2011-2012 మధ్య కాలంలో 962 మందికి సర్కిల్-1, సర్కిల్-2, మైక్రో ఇరిగేషన్, హంద్రీనీవా సుజలా స్రవంతి తదితర విభాగాల్లో మొదట లష్కర్లుగా ఉద్యోగాలు కల్పించారు.
విద్యార్హత, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వారిని రెగ్యులర్ చేస్తూ జూనియర్ అసిస్టెంట్లు, అటెండర్లు, టైపిస్టులుగా అవకాశం కల్పించారు. దీంతో వీరి స్థానాలు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. 2019లో అధికారం చేపట్టిన వైసీపీ హయాంలో నందికొట్కూరులో నిర్వాసితులు 2019 సెప్టెంబర్ 9 నుంచి డిసెంబర్ 19 వరకు అంటే 102 రోజులు రిలే దీక్షలు చేశారు. కానీ, వైసీపీ ప్రభుత్వం స్పందించలేదు. 2024 ఎన్నికలకు ముందు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు, యువగళం పాదయాత్రలో మంత్రి నారా లోకేశ్ హామీనిచ్చారు. కానీ వాటి ఊసే ఎత్తకపోవడం తో ప్రస్తుతం నందికొట్కూరు పట్టణంలో మళ్లీ రిలే దీక్షలు చేపట్టారు.






