ఆషాఢ మహోత్సవాల్లో శాకంబరీ దేవి అలంకారంలో శ్రీ విజయ దుర్గామాత

by Batti.Sumithra |

ఆషాఢ మాసం సందర్భంగా సైదాబాద్ మాతా మైదానంలోని శ్రీ విజయ దుర్గామాత ఆలయంలో అమ్మవారు శాకంబరీదేవి అలంకారంలో భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు.

ఆషాఢ మహోత్సవాల్లో శాకంబరీ దేవి అలంకారంలో శ్రీ విజయ దుర్గామాత
X

దిశ, చంపాపేట్ : ఆషాఢ మాసం సందర్భంగా సైదాబాద్ మాతా మైదానంలోని శ్రీ విజయ దుర్గామాత ఆలయంలో అమ్మవారు శాకంబరీదేవి అలంకారంలో భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు. వివిధ రకాల పండ్లు, ఆకుకూరలు, కూరగాయలతో అర్చకులు అత్యంత వైభవంగా అలంకరించిన అమ్మవారి రూపం భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తింది. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించగా, నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి స్వర్ణలత రెడ్డి ఆలయానికి చేరుకుని శ్రీ విజయ దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలంతా సుఖశాంతులతో, సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.

పురాణాల ప్రకారం జీవకోటికి అన్నదాతగా నిలిచిన శాకంబరీదేవి ప్రకృతి సంపదకు ప్రతీకగా భావిస్తారు. అందుకే ఆషాఢ మాసంలో అమ్మవారిని పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో అలంకరించడం శతాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయం. ఈ కాలంలో శాకంబరీదేవిని దర్శించుకుంటే వ్యవసాయం అభివృద్ధి చెందుతుందని, పంటలు సమృద్ధిగా పండుతాయని, ప్రకృతి అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం. భక్తితో కోరిన కోరికలను అమ్మవారు నెరవేర్చుతారని ఆలయానికి వచ్చిన భక్తులు విశ్వాసం వ్యక్తం చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ కమిటీ సభ్యులు విస్తృత ఏర్పాట్లు చేశారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక క్యూలైన్లు, తాగునీరు, ఇతర సౌకర్యాలు కల్పించడంతో పాటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా చర్యలు చేపట్టారు. ఆధ్యాత్మిక శోభతో కళకళలాడిన శ్రీ విజయ దుర్గామాత ఆలయం, శాకంబరీదేవి దివ్య అలంకారంతో భక్తులను విశేషంగా ఆకట్టుకుని, ఆషాఢ మాస ఉత్సవాలకు మరింత వైభవాన్ని తీసుకొచ్చింది.

Next Story