ఎవరినీ ఉపేక్షించం: డిప్యూ సీఎం పవన్ కల్యాణ్

by Vemula.Srinu Prasad |

ఎర్రచందనం అక్రమ రవాణా ముఠాలకు సహకరించే వారిని ఎవరినీ ఉపేక్షించబోమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ-పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ను పూర్తిగా అరికట్టేందుకు మరింత కఠిన చర్యలు చేపడతామని, 'ఆపరేషన్ అరణ్య' అమలుపై తాను ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తానని స్పష్టం చేశారు...

ఎవరినీ ఉపేక్షించం: డిప్యూ సీఎం పవన్ కల్యాణ్
X

దిశ, ఏపీ బ్యూరో: ఎర్రచందనం అక్రమ రవాణా ముఠాలకు సహకరించే వారిని ఎవరినీ ఉపేక్షించబోమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ-పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ను పూర్తిగా అరికట్టేందుకు మరింత కఠిన చర్యలు చేపడతామని, 'ఆపరేషన్ అరణ్య' అమలుపై తాను ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తానని స్పష్టం చేశారు. కడప జిల్లా అవధూత కాశినాయన మండలం వరికుంట్ల గ్రామ సమీపంలోని జ్యోతి గుడి వద్ద రూ.1.5 కోట్ల విలువైన 78 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న ఘటనపై శనివారం ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం అధికారులతో ఉప ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ కేసులో ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్లతో పాటు వారికి సహకరించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ను కూడా అరెస్టు చేసినట్లు అధికారులు ఆయనకు వివరించారు.


అధికారుల కథనం ప్రకారం, స్టేట్ ఇంటెలిజెన్స్ బృందం అందించిన కచ్చితమైన సమాచారంతో వరికుంట్ల గ్రామ సమీపంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఇంటి సామగ్రి ముసుగులో బొలెరో మ్యాక్స్ వాహనంలో ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న హర్యానాకు చెందిన సన్నీ, రమేష్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.1.5 కోట్ల విలువైన 78 ఎర్రచందనం దుంగలు, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

విచారణలో జ్యోతి ఫారెస్ట్ బీట్‌లో బీట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న మల్లికార్జునుడు అక్రమ రవాణా ముఠాలకు సహకరించినట్లు గుర్తించి అతడిని కూడా అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. బెంగళూరు, హర్యానా, కోల్‌కతా ప్రాంతాలకు చెందిన మరికొందరు ప్రధాన సూత్రధారులను కూడా గుర్తించినట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ప్రధాన సూత్రధారులను త్వరితగతిన అరెస్టు చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అలాగే, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పాత్రపై సమగ్ర విచారణ జరిపి పూర్తి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై ప్రభుత్వం ఎలాంటి రాజీ పడబోదని, ఇందులో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Next Story