ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల కోసం రాస్తారోకో

by Jakkula.Mamatha |

ఇందిరమ్మ ఇంటి నిర్మాణ బిల్లులు విడుదల చేయాలని జుక్కల్ మండలం బస్వాపూర్ చౌరస్తాలో శనివారం లబ్ధిదారు రాస్తారోకో నిర్వహించారు.

ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల కోసం రాస్తారోకో
X

దిశ,జుక్కల్(నిజాంసాగర్): ఇందిరమ్మ ఇంటి నిర్మాణ బిల్లులు విడుదల చేయాలని జుక్కల్ మండలం బస్వాపూర్ చౌరస్తాలో శనివారం లబ్ధిదారు రాస్తారోకో నిర్వహించారు. బస్వాపూర్‌కు చెందిన వజ్రకండి మహాదేవి - లక్ష్మణ్ మాట్లాడుతూ.. తాను రోజు కూలీ చేసుకుని వడ్డీకి అప్పు తెచ్చి ఇల్లు కట్టుకున్నానని, స్లాబ్ ఎక్కువ వేశారని హౌసింగ్ ఏఈ ఇంటిని రిజెక్ట్ చేయడంతో బిల్లు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. బిల్లు డబ్బులు రాకపోతే అప్పులు ఎలా కడతాను. నాకు ఆత్మహత్యే దిక్కు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. గంటపాటు రహదారిపై రాళ్లు, ముళ్ళకంపలు వేసి నిరసన తెలిపాడు. సమాచారం అందుకున్న ఎంపీఓ, సర్పంచ్, కార్యదర్శి వచ్చి నచ్చజెప్పడంతో రాస్తారోకో విరమించారు.

స్లాబ్ నిబంధనలతో గందరగోళం..

ఇందిరమ్మ గృహాల నిర్మాణ వ్యయం పెరగకుండా ఉండేందుకు ప్రభుత్వం జూన్ 27న కొత్త జీవో ఇచ్చింది. దీని ప్రకారం ముందు వైపు 3 అడుగులు, మిగతా వైపులా 1 అడుగు మాత్రమే స్లాబ్ పొడిగింపు ఉండాలి. అంటే 400 చ.అ. ఇంటికి 500 చ.అ., 600 చ.అ. ఇంటికి 750 చ.అ. మించకూడదు. కానీ ఈ మార్పులపై అధికారులు సకాలంలో అవగాహన కల్పించకపోవడంతో జుక్కల్ మండలంలో పలువురు లబ్ధిదారులు పాత విధానంలోనే ఎక్కువ స్లాబ్ వేసుకున్నారు. దీంతో ఫోటో క్యాప్చర్ కాక బిల్లులు నిలిచిపోయాయి. ఇప్పటికే నిర్మాణాలు పూర్తిచేసిన ఇళ్లకు ప్రత్యేక వెసులుబాటు కల్పించి బిల్లులు విడుదల చేయాలని లబ్ధిదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Next Story