నీట్ లీకేజీపై విద్యార్థుల విజయం చారిత్రాత్మకం : సీపీఎం కార్యదర్శి జాన్​వెస్లీ

by Naga Rani Yarlagadda |

దేశంలో నయా ఫాసిస్టు మోడీ ప్రభుత్వ నిరంకుశ పాలనపై దేశ యువత, విద్యార్థులు చారిత్రాత్మక విజయం సాధించడం గొప్ప విషయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్​వెస్లీ పేర్కొన్నారు.

నీట్ లీకేజీపై విద్యార్థుల విజయం చారిత్రాత్మకం : సీపీఎం కార్యదర్శి జాన్​వెస్లీ
X
  • విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్​రాజీనామా తప్పలేదు

దిశ, తెలంగాణ బ్యూరో : దేశంలో నయా ఫాసిస్టు మోడీ ప్రభుత్వ నిరంకుశ పాలనపై దేశ యువత, విద్యార్థులు చారిత్రాత్మక విజయం సాధించడం గొప్ప విషయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్​వెస్లీ పేర్కొన్నారు. శనివారం ఒక ప్రకటనలో పేర్కొంటూ నీట్ పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం సుమారు 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిందని, ఫలితంగా 22 మంది విద్యార్థులు తమ ప్రాణాలను బలిదానం చేయాల్సి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అక్రమాలకు నిరసనగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, యువజనులు గత 36 రోజులుగా నిరవధిక ఆందోళన జరుపుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించింది. శాంతియుతంగా జరుగుతున్న ఆందోళనను అణచివేసేందుకు ప్రభుత్వం తీవ్ర అనాగరిక పద్ధతులకు పాల్పడింది. నిరసన శిబిరాల్లో ఇంటర్నెట్, తాగునీరు, భోజన సౌకర్యాలు నిలిపివేసి, టెంట్లను కూల్చివేస్తూ, వర్షంలో తడిచేలా చేసింది. విద్యార్థులు పార్లమెంట్ ముట్టడికి పిలుపునిచ్చిన సందర్భంలో పోలీసులు యువత తలలు పగిలేలా విచక్షణ రహితంగా లాఠీచార్జ్ చేశారు. చివరకు యువతుల దుస్తులు చించి తీవ్రంగా అవమానించే స్థాయికి దిగజారిందని మండిపడ్డారు. విద్యార్థులపై అక్రమ కేసులు బనాయించి, వారిని దేశద్రోహులుగా చిత్రీకరిస్తూ భయభ్రాంతులకు గురిచేసేందుకు ప్రభుత్వం ఎంత ప్రయత్నించినప్పటికీ, యువత వెరవకుండా పోరాటం కొనసాగించింది. ఈ ఉద్యమ తీవ్రతకు దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించక తప్పలేదని, ఇది విద్యార్థి లోకం సాధించిన గొప్ప విజయం అన్నారు. దేశం కోసం, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతున్న యువత నేడు దేశానికి ఆశాకిరణంగా మారుతోంది. నేటి యువత కేవలం ఈ ఒక్క సమస్యకే పరిమితం కాకుండా, దేశాన్ని పట్టి పీడిస్తున్న దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా కూడా నడుం బిగించి, రాబోయే పోరాటాల్లో ముందుండాలని పిలుపునిచ్చారు.

Next Story