ఎంఆర్‌పీ కంటే ఎక్కువకు యూరియా విక్రయం : డీలర్‌కు షోకాజ్‌ నోటీసు

by Batti.Sumithra |

ప్రభుత్వం నిర్దేశించిన ఎంఆర్‌పీ (గరిష్ఠ చిల్లర ధర) కంటే అధిక ధరకు యూరియాను విక్రయిస్తున్న ఎరువుల డీలర్‌కు వ్యవసాయ శాఖ షోకాజ్‌ నోటీసు జారీ చేసింది.

ఎంఆర్‌పీ కంటే ఎక్కువకు యూరియా విక్రయం : డీలర్‌కు షోకాజ్‌ నోటీసు
X

దిశ, హుస్నాబాద్‌ : ప్రభుత్వం నిర్దేశించిన ఎంఆర్‌పీ (గరిష్ఠ చిల్లర ధర) కంటే అధిక ధరకు యూరియాను విక్రయిస్తున్న ఎరువుల డీలర్‌కు వ్యవసాయ శాఖ షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ పట్టణంలోని అక్కన్నపేట రోడ్డులో ఉన్న 'శ్రీ వేంకటేశ్వర ఫర్టిలైజర్స్‌' నిర్వాహకులు యూరియాను నిర్ణీత ధర కంటే ఎక్కువకు విక్రయిస్తున్నారని రైతుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై హుస్నాబాద్‌ మండల వ్యవసాయ అధికారి (ఎంఏవో) వేల్పుల పూజ ప్రాథమిక విచారణ జరిపి, అక్రమ విక్రయాలు జరుగుతున్నట్లు నిర్ధారించారు. ఈ సందర్భంగా ఎంఏవో వేల్పుల పూజ మాట్లాడుతూ... ఎరువుల (నియంత్రణ) ఉత్తర్వులు–1985 ప్రకారం ఎంఆర్‌పీ కంటే ఎక్కువ ధరకు ఎరువులను విక్రయించడం తీవ్ర చట్టవిరుద్ధమని తెలిపారు. ఈ మేరకు సంబంధిత డీలర్‌కు షోకాజ్‌ నోటీసు జారీ చేశామని, నిర్ణీత గడువులోగా లిఖితపూర్వక వివరణ సమర్పించాలని ఆదేశించినట్లు చెప్పారు. ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోతే డీలర్‌షిప్‌ లైసెన్స్‌ను సస్పెండ్‌ చేయడం లేదా పూర్తిగా రద్దు చేయడంతో పాటు చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఆధారాలతో ఫిర్యాదు చేయండి : వేల్పుల పూజ, మండల వ్యవసాయ అధికారి

ఏదైనా ఫర్టిలైజర్‌ దుకాణంలో ఎంఆర్‌పీ కంటే అదనపు ధర వసూలు చేస్తే రైతులు మౌనంగా ఉండవద్దు. రసీదులు లేదా తగిన ఆధారాలతో వెంటనే మండల వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేస్తే వెంటనే తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకుంటాం.

Next Story