స్థానికేతరులకు ఖాజీ పదవులా ?

by Batti.Sumithra |

సిద్దిపేట జిల్లా పరిధిలో కొత్తగా చేపట్టిన ఖాజీల నియామకాలపై హుస్నాబాద్ ఆలంగీర్ మసీదు కమిటీ అధ్యక్షుడు, బీఆర్ఎస్ పట్టణ మాజీ అధ్యక్షుడు ఎం.ఏ. అన్వర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

స్థానికేతరులకు ఖాజీ పదవులా ?
X

దిశ, హుస్నాబాద్ : సిద్దిపేట జిల్లా పరిధిలో కొత్తగా చేపట్టిన ఖాజీల నియామకాలపై హుస్నాబాద్ ఆలంగీర్ మసీదు కమిటీ అధ్యక్షుడు, బీఆర్ఎస్ పట్టణ మాజీ అధ్యక్షుడు ఎం.ఏ. అన్వర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. శనివారం తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సిద్దిపేట జిల్లా ఏర్పడిన తర్వాత వక్ఫ్ బోర్డు ప్రభుత్వ తరఫున సదర్ ఖాజీగా జహీరుద్దీన్, హుస్నాబాద్ డివిజన్ నాయబ్ ఖాజీగా ఎం.డి. అబ్దుల్ మన్నాన్‌ను నియమించిందని, వారు ప్రస్తుతం కొనసాగుతున్నారని తెలిపారు. అయితే తాజాగా ఖాజా ఖరీముద్దీన్‌ను సదర్ ఖాజీగా, షేక్ రూహల్ అమీన్‌ను నాయబ్ ఖాజీగా నియమించడం నిబంధనలకు విరుద్ధమని ఆరోపించారు.

కొత్తగా నియమితులైన వారు స్థానికులు కాదని, పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారని, వారిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని అన్వర్ ఆరోపించారు. ఇలాంటి వారిని ఖాజీలుగా ఎలా నియమించారని ప్రశ్నించారు. ఖాజీ పదవికి ధార్మికంగా ఎంతో ప్రాధాన్యం ఉందని, వివాహాలు వంటి కీలక కార్యక్రమాలు నిర్వహించే బాధ్యతలను అర్హత కలిగిన స్థానికులకే అప్పగించాలని కోరారు. ఈ వ్యవహారాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. నియామకాలపై సమగ్ర విచారణ చేపట్టి, అనర్హులుగా తేలిన వారి నియామకాలను రద్దు చేయాలని, తప్పుడు నివేదికలు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రి పొన్నం జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో అబ్దుల్ బారి, నయీముద్దీన్, ముజాహిద్, అబ్బు, సలీం, కరీం తదితరులు పాల్గొన్నారు.

Next Story