- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రతి ఇంటిలో.. ప్రతి ఆఫీస్‌లో ఇంకుడు గుంత తప్పనిసరి: మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపు
భూగర్భ జలాల పరిరక్షణకు ప్రతి ఇల్లు, అపార్ట్‌మెంట్, విద్యాసంస్థలో వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. సైఫాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ సైన్స్ కళాశాలలో జలమండలి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన వర్షపు నీటి సంరక్షణ అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: భూగర్భ జలాల పరిరక్షణకు ప్రతి ఇల్లు, అపార్ట్‌మెంట్, విద్యాసంస్థలో వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. సైఫాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ సైన్స్ కళాశాలలో జలమండలి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన వర్షపు నీటి సంరక్షణ అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కళాశాల ప్రాంగణంలోని ఎండిపోయిన బోర్‌వెల్‌ను ఇంజెక్షన్ బోర్‌వెల్‌గా పునరుద్ధరించి, రీచార్జ్ పిట్‌ను ప్రారంభించిన మంత్రి, రూఫ్‌టాప్ వర్షపు నీటిని ఎండిపోయిన బోర్‌వెల్లకు మళ్లించడం ద్వారా వాటికి పునర్జీవం కల్పించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం మాట్లాడుతూ.. మనం ప్రకృతి నుంచి నీటిని తీసుకుంటున్నాం... వర్షపు నీటిని తిరిగి భూమికి అందించడం కూడా మన బాధ్యతేనని. ఇంకుడు గుంతల నిర్మాణం కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రతి పౌరుడి సామాజిక బాధ్యతగా స్వీకరించాలని అన్నారు.
జలమండలి చేపడుతున్న వర్షపు నీటి సంరక్షణ ఉద్యమంలో ప్రతి పౌరుడు చురుకుగా పాల్గొని, ప్రతి ఇంటిలో రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి, ప్రతి వర్షపు చుక్కను భూగర్భ జలంగా మార్చే మహాయజ్ఞంలో భాగస్వాములు కావాలని అయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యాన్ని అభినందిస్తూ, విద్యను అందించే కేంద్రంగా మాత్రమే కాకుండా సమాజంలో సానుకూల మార్పుకు దారితీసే అవగాహన కార్యక్రమాలకు వేదికగా సైఫాబాద్ సైన్స్ కళాశాల నిలవడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రస్తుతం వర్షపు నీటిని డ్రైనేజీల ద్వారా వృథాగా సముద్రంలోకి పంపకుండా, భూమిలోకి ఇంకేలా చేసి భూగర్భ జలాలను పెంపొందించడం అత్యవసరమని తెలిపారు. ఒకప్పుడు ప్రతి గ్రామంలో చెరువులు, కుంటలు, జలవనరులు సమృద్ధిగా ఉండేవని, కాకతీయుల కాలం నుంచి నిజాం పాలన వరకు చెరువుల నిర్మాణానికి విశేష ప్రాధాన్యం ఇచ్చారని గుర్తు చేశారు. ఆ దూరదృష్టిని నేటి తరంలోనూ పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు.
వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ మహానగరంలో కాంక్రీట్ నిర్మాణాలు పెరగడంతో వర్షపు నీరు భూమిలోకి ఇంకే అవకాశాలు గణనీయంగా తగ్గాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం 2016 నుంచే కొత్త భవనాల్లో రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థను తప్పనిసరి చేసినప్పటికీ, ఇప్పటికే ఉన్న గృహాలు, అపార్ట్‌మెంట్లు కూడా స్వచ్ఛందంగా ఈ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. వాతావరణ మార్పుల ప్రభావంతో వర్షపు నీరు భూమిలోకి ఇంకకుండా రోడ్లపై నుంచి నేరుగా డ్రైనేజీల్లోకి వెళ్లిపోవడం వల్ల భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని, ఫలితంగా తాగునీటి అవసరాల కోసం ట్యాంకర్లపై ఆధారపడే పరిస్థితి పెరుగుతోందని తెలిపారు. జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి గారు వెల్లడించిన వివరాలను ప్రస్తావిస్తూ, గతంలో రోజుకు సుమారు నాలుగు వేల ట్యాంకర్లతో అవసరాలు తీరగా, ప్రస్తుతం కొన్ని సందర్భాల్లో పన్నెండు వేల వరకు ట్యాంకర్ల అవసరం ఏర్పడుతోందని పేర్కొన్నారు. ఇది నీటి వనరుల పరిరక్షణపై ప్రతి ఒక్కరికీ హెచ్చరికగా భావించాలని సూచించారు. ప్రభుత్వం ఒక్కదానితో ఈ లక్ష్యాన్ని సాధించడం సాధ్యం కాదని, ప్రజల భాగస్వామ్యమే విజయానికి మూలమని స్పష్టం చేశారు. ప్రతి ఇంటి యజమాని, ప్రతి అపార్ట్‌మెంట్ సంక్షేమ సంఘం, ప్రతి విద్యాసంస్థ రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్ ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరారు. రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయడం పెద్ద వ్యయంతో కూడుకున్న పని కాదని, అయితే దీని ద్వారా భూగర్భ జలాల పెరుగుదల, బోర్‌వెల్లలో నీటి నిలకడ, ట్యాంకర్లపై ఆధారపడే పరిస్థితుల తగ్గుదలతో పాటు భావితరాలకు నీటి భద్రత కల్పించవచ్చని వివరించారు. అనంతరం ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, జలమండలి ఎండీ అశోక్ రెడ్డితో కలిసి మొక్క నాటారు. జలమండలి చేపడుతున్న వర్షపు నీటి సంరక్షణ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకుని, ప్రతి వర్షపు చుక్కను భూగర్భ జలంగా మార్చే ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరారు.
జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం వర్షాలు పూర్తిగా నిలిచిపోతే నగరానికి నీటిని అందించే జలాశయాల్లోని నిల్వలు సుమారు 80 రోజుల అవసరాలకు మాత్రమే సరిపోతాయని తెలిపారు. ఈ జలాశయాలపై దాదాపు మూడు లక్షల కనెక్షన్లు ఆధారపడి ఉన్నాయని, భవిష్యత్తులో వారికి నీటి సరఫరా కొనసాగించడం పెద్ద సవాలని పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి జలాలతో పాటు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ, సింగూర్ జలాశయ పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. హైదరాబాద్ సముద్రమట్టానికి ఎత్తులో ఉండటంతో వందల కిలోమీటర్ల దూరం నుంచి భారీ పంపుల ద్వారా నీటిని నగరానికి తీసుకురావాల్సి వస్తోందని వివరించారు. నగరంలో పెరుగుతున్న కాంక్రీట్ నిర్మాణాల వల్ల వర్షపు నీరు భూమిలోకి ఇంకకుండా మూసీ, కృష్ణా నదుల వైపు వృథాగా వెళ్లిపోతోందన్నారు. ప్రకృతి ఉచితంగా అందించే నీటిని వృథా చేసి, తిరిగి భారీ విద్యుత్ వ్యయంతో నగరానికి తీసుకురావాల్సి రావడం విచారకరమని పేర్కొన్నారు. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు, రీచార్జ్ పిట్లు, ఇంజెక్షన్ బోర్లు ఏర్పాటు చేస్తే భూగర్భ జలాలు పెరిగి, ట్యాంకర్లపై ఆధారపడే పరిస్థితి తగ్గుతుందని తెలిపారు. జనవరిలో రోజుకు సుమారు నాలుగు వేలుగా ఉన్న ట్యాంకర్ బుకింగ్‌లు వేసవిలో 16 వేల వరకు పెరిగాయని, గతంలో నాలుగు వేల అపార్ట్‌మెంట్లు మాత్రమే డ్రైగా ఉండగా, ఈసారి 13 వేల అపార్ట్‌మెంట్లలో భూగర్భ జలాలు తగ్గాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జలమండలి రీజినల్ డైరెక్టర్లు సామ్రాట్ అశోక్, సంతోష్, ఆపరేషన్స్ డైరెక్టర్ ప్రభు, రెవెన్యూ డైరెక్టర్ కిరణ్ కుమార్, జీఎంలు శ్రీను నాయక్, జమీల్, ఇంకుడుగుంతల ప్రత్యేక అధికారి జాల సత్యనారాయణ, కళాశాల ప్రిన్సిపాల్ కరుణా సాగర్ లతో పాటు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.






